Begin typing your search above and press return to search.

4న ఢిల్లీకి జ‌గ‌న్‌!... చిన‌బాబు బుక్కైన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   1 Feb 2019 4:44 PM GMT
4న ఢిల్లీకి జ‌గ‌న్‌!... చిన‌బాబు బుక్కైన‌ట్టేనా?
X
మ‌రో మూడు నెలల్లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. గ‌డచిన ఎన్నిక‌ల్లో వెంట్రుక‌వాసిలో అధికారానికి దూర‌మైన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి... 2019 ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా చాలా కాలం నుంచే ప‌క్కా ప‌క‌డ్బందీ ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగుతున్నారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ... తాను అధికారంలోకి వ‌స్తే... సంక్షేమ రాజ్యం అందివ‌చ్చేన‌ని ప్ర‌జ‌లకు చెబుతూ 14 నెల‌ల పాటు సుదీర్ఘ పాద‌యాత్ర చేప‌ట్టిన జ‌గ‌న్‌... ఇటీవ‌లే శ్రీ‌కాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పాయ‌యాత్ర‌ను ఘ‌నంగానే ముగించారు. యాత్రంలో రాష్ట్రంలోని మెజారిటీ నియోజ‌క‌వ‌ర్గాల‌ను చుట్టి వ‌చ్చిన జ‌గ‌న్‌.. క‌వ‌ర్ కాని నియోజ‌క‌వ‌ర్గాల‌కు త్వ‌ర‌లోనే చుట్టేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో స‌డెన్‌గా జ‌గ‌న్ డిల్లీ టూర్ ఖ‌రారు కావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. అయినా జ‌గ‌న్ ఇప్పుడు ఢిల్లీ వెళ్లాల్సిన అవ‌స‌రం ఏముంద‌న్న కోణంలో లెక్క‌లేన‌న్ని విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. అయితే ఎన్నిక‌ల వేళ జ‌గ‌న్ దేశ రాజ‌ధాని వెళుతున్నారంటే... అందులో అంతో ఇంతో ప్ర‌త్యేక‌త ఉన్న‌ట్టుగానే అంతా భావిస్తున్నారు.

గ‌డ‌చ‌ని ఎన్నిక‌ల్లో అమ‌లు సాధ్యం కాని హామీల‌ను ఇచ్చిన టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారాచంద్ర‌బాబునాయుడు... ఈ ద‌ఫా కూడా ఎలాగైనా గెలిచి తీరాల్సిందేన‌ని కంక‌ణం క‌ట్టుకున్నారు. అందుకోసం విప‌క్ష నేత నోట వినిపించిన హామీల‌ను కూడా అయ‌న అమ‌లు చేసుకుంటూ పోతున్నారు. ఈ ప‌థ‌కాల అమ‌లుతో మైలేజీ జ‌గ‌న్‌కు వ‌చ్చినా ఫ‌రవా లేదు... ఎన్నిక‌ల్లో ల‌బ్ధ మాత్రం త‌న‌కే ద‌క్కాల‌న్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తున్న చంద్ర‌బాబు తీరు ఇప్ప‌టికే అభాసుపాలైంద‌ని చెప్పాలి. అయితే ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా చంద్ర‌బాబు వీటినేమాత్రం ప‌ట్టించుకుంటున్న పాపాన పోవ‌డం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇక ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధన కోసం జ‌రుగుతున్న ఉద్య‌మంలో భాగంగా చంద్ర‌బాబు ఈ నెల 11న ఢిల్లీలో దీక్ష‌కు దిగ‌నున్నారు. ఈ దీక్ష‌కు పార్టీ శ్రేణులంతా రావాల్సిందేన‌ని ఇప్ప‌టికే చంద్ర‌బాబు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి కీల‌క త‌రుణంలో జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న అత్యంత ప్రాధాన్యం సంత‌రించుకుంది. అయినా ఢిల్లీ టూర్‌లో జ‌గ‌న్ వ్యూహ‌మేమిట‌న్న‌ది మాత్రం తెలియ రావ‌డం లేదు. దీనిపై పెద్ద ఎత్తున విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

అందులో ఓ అంశం మాత్రం టీడీపీకి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ‌... వైసీపీ సానుభూతిప‌రుల‌కు సంబంధించిన ఓట్లు ఎక్క‌డిక‌క్క‌డ తొల‌గిపోతున్నాయి. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఇటీవ‌లే స‌ర్వేల పేరిట ఓట‌ర్ లిస్టు, ట్యాబ్‌లు చేత‌బ‌ట్టుకుని వ‌చ్చిన వ్య‌క్తుల‌ను వైసీపీ పోలీసుల‌కు అప్ప‌గించింది. ఈ స‌ర్వే వెనుక టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఏపీ కేబినెట్ లో కీల‌క మంత్రి నారా లోకేశ్ హ‌స్త‌మున్న‌ట్లుగా వార్త‌లు వినిపించాయి. ఈ స‌ర్వే సంస్థ‌తో నారా లోకేశ్ ఒప్పందం చేసుకున్నార‌ని, ఆ ఒప్పందం మేర‌కే స‌ద‌రు స‌ర్వే బృందం వైసీపీ ఓట్ల తొల‌గింపే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతోంద‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. దీనిపై ఇప్ప‌టికే కేంద్ర ఎన్నిక‌ల సంఘం, రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారికి ఫిర్యాదు చేసిన వైసీపీ... బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది. ఇక జ‌గ‌న్ త‌న ఢిల్లీ టూర్‌లోనూ కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని క‌ల‌వ‌నున్ర‌న‌ట్లు తెలుస్తోంది. ఓట్ల తొల‌గింపు, దానికి కార‌ణ‌మంటూ లోకేశ్ పై ఫిర్యాదు చేసేందుకే జ‌గ‌న్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఢిల్లీ టూర్ ఇటు వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింప‌నుండ‌గా, టీడీపీలో మాత్రం వ‌ణుకు మొద‌లైన‌ట్లుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఈ రెండు పార్టీల‌తో పాటు చాలా కాలం త‌ర్వాత జ‌గ‌న్ ఢిల్లీ వెళుతుండ‌టం అన్ని వ‌ర్గాల్లోనూ ఆస‌క్తిని రేకెత్తించింద‌నే చెప్పాలి.