Begin typing your search above and press return to search.

సందర్భం ఏదైనా జగన్ ఆ మాటే!

By:  Tupaki Desk   |   20 Jun 2019 7:54 AM GMT
సందర్భం ఏదైనా జగన్ ఆ మాటే!
X
ప్రత్యేకహోదా అంశం గురించి అవకాశం వచ్చినప్పుడల్లా అడుగుతూ ఉంటామని ఏపీ శాసనసభలో అలా ప్రకటన చేసి వెళ్లిన జగన్ మోహన్ రెడ్డి - ఢిల్లీలో తన వాయిస్ వినిపించడానికి అవకాశం వచ్చినప్పుడల్లా ఆ అంశం గురించినే మాట్లాడుతూ ఉన్నట్టున్నారు. అసలు సందర్భం కాకపోయినా జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకహోదా అంశం గురించినే మాట్లాడుతూ ఉండటం గమనార్హం. ఢిల్లీలో అఖిలపక్ష భేటీ సందర్భంగా తన ప్రసంగంలో జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకహోదా అంశం గురించి ప్రస్తావించారు.

వాస్తవానికి ఆ మీటింగ్ జరిపింది ఈ అంశాల గురించి చర్చకు కాదు. దేశ వ్యాప్తంగా ఒకే సారి లోక్ - రాజ్యసభ ఎన్నికలు జరపడానికి - మహాత్మగాంధీ నూటా యాభైయవ జయంతి వేడుకల నిర్వహణకు - తదితర అంశాల గురించి చర్చించడానికి ఆ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

అయితే జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఆ అవకాశాన్ని కూడా వదులుకోలేదు. ప్రధానమంత్రి మోడీ - హోం శాఖ మంత్రి అమిత్ షా - కేంద్రమంత్రి రాజ్ నాథ్ తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు - కేంద్రమంత్రులు అందరూ అక్కడే ఉండటంతో.. అక్కడ ప్రత్యేకహోదా ప్రస్తావన తీసుకొచ్చారు జగన్ మోహన్ రెడ్డి.

చట్టసభలకు బాధ్యత పెరగాలని - నేతలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని - వ్యవస్థ నమ్మకాన్ని పెంపొందించుకోవాలని అంటూ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకహోదా ప్రస్తావన తీసుకు వచ్చారు. లోక్ సభలోనే అందుకు తీర్మానాలు జరిగాయని, అది విభజన హామీ అని ఏపీ సీఎం అక్కడ నొక్కి చెప్పారు. అది సందర్భం కాకపోయినా రాష్ట్రానికి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించడంలో మాత్రం జగన్ సఫలం అయ్యారు.