Begin typing your search above and press return to search.

విచారణ కోసం కోర్టుకు సీఎం జగన్.. ఉత్తర్వుల్లో ఏముంది?

By:  Tupaki Desk   |   4 Jan 2020 5:11 AM GMT
విచారణ కోసం కోర్టుకు సీఎం జగన్.. ఉత్తర్వుల్లో ఏముంది?
X
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అక్రమాస్తుల కేసు విచారణ సుదీర్ఘంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఎలాంటి పరిస్థితుల్లో ఈ కేసులు నమోదయ్యాయో.. అసలేం జరిగిందన్న విషయం అందరికి తెలిసిందే. అయినప్పటికీ.. కేసుల విచారణను ఎదుర్కొంటున్నారు జగన్. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కోర్టు విచారణకు రావటంలో ఉన్న సంక్లిష్టతను కోర్టుకు తెలియజేశారు.

దీనిపై సీబీఐ తరఫు న్యాయవాదులకు.. జగన్ తరఫు న్యాయవాదులకు మధ్య పలు వాదనలు జరిగాయి. తాజాగా సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు తదుపరి విచారణ అయిన జనవరి 10న సీఎంగా ఉన్న జగన్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇదే కేసులో రెండో నిందితుడిగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ కమ్ ఆడిటర్ విజయసాయి రెడ్డి సైతం హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఈ మేరకు న్యాయమూర్తి బీఆర్ మధుసూదన్ రావు తన తాజా ఉత్తర్వుల్ని జారీ చేశారు. ముఖ్యమంత్రిగా విధుల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో కోర్టుకు హాజరు కాలేకపోతున్నట్లుగా జగన్ తరఫు న్యాయవాది పేర్కొన్నా.. కోర్టు మాత్రం అందుకు అంగీకరించలేదు. గత ఏడాది మార్చి ఒకటిన చివరిసారి జగన్ కోర్టుకు హాజరయ్యారని.. అప్పటి నుంచి ఏదో ఒక కారణం చెబుతున్నట్లుగా పేర్కొన్నారు. తాజా విచారణకు హాజరు కాకపోవటాన్ని తాను అనుమతిస్తున్నట్లు చెప్పిన న్యాయమూర్తి.. తదుపరి వాయిదా అయిన జనవరి10న మాత్రం తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది.