Begin typing your search above and press return to search.

కోటి అడిగితే రూ.2కోట్లకు ఓకే చెప్పిన జగన్

By:  Tupaki Desk   |   17 Oct 2019 5:26 AM GMT
కోటి అడిగితే రూ.2కోట్లకు ఓకే చెప్పిన జగన్
X
ఏపీ కేబినెట్ సమావేశంలో ఆసక్తికర అంశం ఒకటి చోటు చేసుకుందని చెబుతున్నారు. నిర్ణయాలు తీసుకోవటంలో అనూహ్య వేగాన్ని ప్రదర్శించటమే కాదు.. అవసరాలకు తగ్గట్లు రియాక్ట్ అయ్యే తీరు తనలో చాలా ఉందన్న విషయాన్ని మరోసారి రుజువు చేశారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధుల గురించిన చర్చ మంత్రివర్గ సమావేశంలో జరిగింది.

ప్రతి అసెంబ్లీకి రూ.కోటి చొప్పున నిధులు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పినా.. ఇప్పటివరకూ ఆ నిధులు మంజూరు కాలేదన్న విషయాన్ని మంత్రి కన్నబాబు ప్రస్తావించగా.. మిగిలిన మంత్రులు పేర్ని వెంకట్రామయ్య.. పుష్పశ్రీవాణి తదితరులు అవునంటూ మాట కలిపారు.

దీనికి సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. అదే సమయంలో కొందరు మంత్రులు.. ఇవ్వాల్సిన నిధులు ఎటూ ఇవ్వలేదు కాబట్టి.. కోటికి బదులు రూ.2 కోట్లు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. వెంటనే రియాక్ట్ అయిన జగన్.. ఆర్థికమంత్రి బుగ్గనను ఉద్దేశించి వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు.

అయితే.. తొలుత కోటి విడుదల చేసి.. తర్వాత మిగిలిన కోటి నిధులను రిలీజ్ చేస్తామని మంత్రి బుగ్గన చెప్పగా సీఎం ఓకే అన్నట్లు సమాచారం. ఇలా.. పలు అంశాలకు సంబంధించి చర్చ కేబినెట్ లో జరగటమే కాదు.. దానిపై సీఎం వేగంగా స్పందించిన తీరుపై మంత్రులు ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. మద్యం ధరలు భారీగా పెరిగినట్లు పలువురు మంత్రులు ప్రస్తావించగా.. పది శాతం మాత్రమే పెరిగాయని.. మద్య నియంత్రణలో భాగంగా ధరలు మరింత పెంచనున్నట్లు చెప్పేశారు.

మద్యం ధరలు అందుబాటులో లేకుండా ఉన్నప్పుడే మద్యం కొనుగోలు గురించి ఆలోచిస్తారన్నారు. ఇదిలా ఉంటే.. రైతు భరోసాకు అర్హులైన వారు మిగిలి ఉంటే వెంటనే జాబితాలో చేర్చాలని.. ఆ బాధ్యతను మంత్రులు తీసుకోవాలని జగన్ సూచించినట్లు తెలుస్తోంది. వన్ సైడ్ లా కాకుండా.. తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేస్తూనే.. సహచర మంత్రులు సైతం వివిద అంశాలపై తమ వాదనను వినిపించే వాతావరణం ఉండేలా జగన్ వ్యవహరించటంపై పలువురు మంత్రులు హ్యాపీగా ఫీల్ కావటం గమనార్హం.