Begin typing your search above and press return to search.

ఏపీలో తారస్థాయిలో ఉద్యోగుల అవినీతి.. వైసీపీ లీడర్ నే 90 వేలు అడిగారు

By:  Tupaki Desk   |   8 Nov 2019 5:53 AM GMT
ఏపీలో తారస్థాయిలో ఉద్యోగుల అవినీతి.. వైసీపీ లీడర్ నే 90 వేలు అడిగారు
X
ఒకవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవినీతి నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేయడంలో తలమునకలై ఉన్నారు. అవినీతి రహిత పాలనే లక్ష్యమని జగన్ ప్రకటిస్తూ ఉన్నారు. అందు కోసం ఆయన తన పార్టీ నేతలను కూడా పూర్తిగా కంట్రోల్ చేశారు. క్షేత్ర స్థాయి నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీల విషయంలో కూడా జగన్ చాలా చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తున్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో అధికార పార్టీ కార్యకర్తలు అంటేనే అయిన కాడికి దోచుకోవడమే అన్నట్టుగా ఉండేది పరిస్థితి. తెలుగుదేశం హయాంలో కార్యకర్తలు, నేతలు తేడా లేకుండా ఎవరికి అందింది వారు దోచుకున్నారు. ఆ పరిస్థితిలో పూర్తి మార్పును చూపుతున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

ఈ క్రమంలో తన పార్టీ వాళ్లు అని చూడకుండా వైసీపీ వాళ్లకే ఆయన పూర్తిగా బంధనాలు వేశారు. ఇలాగే పని చేస్తే అవినీతి రహిత వ్యవస్థను ఆవిష్కరించడానికి ఎంతో సమయం పట్టదని పరిశీలకులు అంటూ ఉన్నారు. ఇలా వైఎస్ జగన్ పాలనపై సానుకూల స్పందనలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. అవినీతి రహిత వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్న సీఎంను అంతా అభినందిస్తూ ఉన్నారు.

అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితి మరో రకంగా కనిపిస్తూ ఉంది. రాజకీయ పరమైన అవినీతిని అరికట్టడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా కట్టుబడి ఉన్నారు. ఆ మేరకు పని చేస్తున్నారు. అయితే ఇదే అదునుగా తీసుకుని ఉద్యోగులు మాత్రం తమ దందా సాగిస్తూ ఉన్నారు. అధికార పార్టీ నేతలను సీఎం అదిమిపెట్టగా, ఉద్యోగులు మాత్రం ఎవరేం చెప్పినా తమ దారి తమదే అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు.

అవినీతి అత్యధికం అనదగిన రెవెన్యూ వ్యవస్థలో కొందరు అధికారుల దోపిడీ యథేచ్ఛగా సాగుతూ ఉంది. అందుకు ఒక ఉదాహరణ ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపాలిటీ లో డిప్యూటీ తహశీల్దార్ గా ఉన్న కిషోర్ కుమార్ తీరు. ఈ అధికారి దోపిడీకి హద్దే లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి స్థానికుల నుంచి. ప్రతి పనికీ ఒక రేటును ఫిక్స్ చేసి ఈ అధికారి డబ్బులు తీసుకుంటూ ఉన్నారని తెలుస్తోంది.

ఈ మేరకు ఇతడి బాధితులు వాపోతూ ఉన్నారు. ఈ డిప్యూటీ తహశీల్దార్ కు ఒక ఏజెంట్ కూడా ఉన్నాడట. అతడి పేరు తమ్మినేని కొండారెడ్డి. తెలుగుదేశం పార్టీ హయాం నుంచి ఇతడు బ్రోకర్ గా కొనసాగుతూ ఉన్నాడట.

పని కావాలని ఆఫీసుకు వచ్చే వారిని ఈ బ్రోకర్ పలకరిస్తాడు. అధికారి రేటు ఎంతో చెబుతాడు. మెజారిటీ మొత్తం అధికారికి ఇచ్చి, మిగిలిన వాటా ఈ బ్రోకర్ కు అని తెలుస్తోంది. వీళ్లు ఎంతలా దోపిడీ చేస్తూ ఉన్నారంటే..తాజాగా టీ శ్రీనివాస రెడ్డి అనే ఒక రైతు తన తల్లిదండ్రులు చనిపోవడంతో తన పేరు మీద పాసుపుస్తకాలు తీసుకోవడానికి డిప్యూటీ తహశీల్దార్ ను ఆశ్రయించాడు. పని కావాలంటే తను మాట్లాడతానంటూ బ్రోకర్ ఇన్ వాల్వ్ అయ్యాడు. పాసు బుక్ చేయాలంటే తొంభై వేల రూపాయలు ఇచ్చుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పారట.

విశేషం ఏమిటంటే టీ శ్రీనివాసరెడ్డి అనే రైతు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా. అవన్నీ ఏం లేదని, పాసుబుక్ రేటు తొంభై వేల రూపాయలని, అది ఇచ్చుకుంటేనే పని అవుతుందని బ్రోకర్-డిప్యూటీ తహశీల్దార్ లు తేల్చి చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది.

ఇదీ ఏపీలో అధికారుల తీరు. ఒకవైపు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వగా వారు మాత్రం అయిన కాడికి, హద్దులేని రీతిలో దోపిడీ చేయడానికి తమ పవర్ ను ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఈ పరిస్థితిపై సీఎంవో దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.