Begin typing your search above and press return to search.

తిరుపతి ఉప ఎన్నిక కోసం జగన్ రంగంలోకి దిగారా?

By:  Tupaki Desk   |   28 Dec 2020 5:30 PM GMT
తిరుపతి ఉప ఎన్నిక కోసం జగన్ రంగంలోకి దిగారా?
X
ఏపీలో జరుగుతున్న తిరుపతి ఎంపీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక మీద విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంది. ఈ ఎన్నిక చుట్టూ ఏపీ భవిష్యత్ రాజకీయాలు ముడిపడి ఉన్నాయని చెప్పాలి. ఈ ఉప ఎన్నిక ఫలితంతో రాష్ట్రంలో తమ పార్టీకి తిరుగులేదన్న విషయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేయాలని భావిస్తున్నారు. అదే సమయంలో.. ఏపీలో అధికారపక్షం తర్వాత తనకే పట్టు ఉందన్న విషయాన్ని నిరూపించేందుకు బీజేపీ కిందా మీదా పడుతోంది. ఇదిలా ఉంటే.. విపక్షనేత చంద్రబాబును తిరుపతి ఉప ఎన్నిక తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తోంది. ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తు మొత్తం ఈ ఉప ఎన్నిక మీద ఆధారపడి ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే వయసు అయిపోయిందని.. బాబుకు పోరాడే శక్తి తగ్గిందని.. ఆయన రాజకీయ వారసుడు కమ్ ఎమ్మెల్సీ నారా లోకేశ్ సమర్థత లేమి.. టీడీపీకి శాపంగా మారనున్నట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఏపీలో టీడీపీ పని అయిపోయినట్లేనన్న విషయాన్ని తాజా ఉప ఎన్నిక ఫలితంతో అందరికి అర్థమయ్యేలా చేయాలన్న ఆలోచనలో ఏపీ అధికారపక్షం ఉందంటున్నారు. దీనికి తగ్గట్లే.. ఈ ఉప ఎన్నిక మీద సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధను చూపుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఏపీలో తన ఉనికిని చాటుకోవాలని జనసేన ప్రయత్నిస్తోంది. వాస్తవానికిఆ పార్టీ ప్లాన్ వేరేగా ఉంది. బీజేపీ అధినాయకత్వాన్ని ఒప్పించి.. ఆ పార్టీని పోటీ నుంచి తప్పించి తాను పోటీ చేయాలని.. విపక్ష టీడీపీ కంటే తానే మెరుగన్న విషయాన్ని ఫ్రూవ్ చేయాలని భావించారు. అయితే.. పవన్ కంటే హుషారుగా ఉన్న బీజేపీ.. తిరుపతి ఉప ఎన్నికల్లో తాము పోటీ చేస్తామన్న ప్రకటనను చేసేయటంతో జనసేన అధినేతకు ఎలా స్పందించాలో అర్థం కాని పరిస్థితి. ఉప ఎన్నిక చుట్టూ ఏపీ రాజకీయం ఇంతలా సాగుతున్న వేళ.. ఈ సీటును సొంతం చేసుకోవటానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా చిత్తూరు పర్యటనను పెట్టుకున్న ఆయన.. కీలకమైన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

తిరుపతి ఎంపీ నియోజకవర్గ పరిధిలోని శ్రీకాళహస్తికి సమీపంలోని 167 ఎకరాల్లో పట్టాల పంపిణీ చేయటం ద్వారా.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటంతో తనకు తిరుగులేదన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేయాలన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతున్నా.. చిత్తూరు జిల్లా మీద సీఎం జగన్ ఫోకస్ పెట్టటం చూస్తే.. దానికి తాను ఇస్తున్న ప్రాధాన్యత ఎంతన్న విషయాన్ని అర్థమయ్యేలా చేయటం కూడా ఒక ఉద్దేశమని చెబుతున్నారు. ఏమైనా.. తిరుపతి ఉప ఎన్నికను సీఎం జగన్ సీరియస్ గా తీసుకోవటమే కాదు.. వ్యక్తిగతంగా తీసుకున్నట్లుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.