Begin typing your search above and press return to search.

జగన్ డేరింగ్ స్టెప్... ఇతర రాష్ట్రాల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు

By:  Tupaki Desk   |   1 Nov 2019 2:30 PM GMT
జగన్ డేరింగ్ స్టెప్... ఇతర రాష్ట్రాల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు
X
ఏపీ సీఎంగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో తనదైన మార్కుతో దూసుకుపోతున్నారనే చెప్పాలి. పాదయాత్రలో - ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటిగానే అయినా ఇప్పటికే మెజారిటీ హామీలను అమల్లో పెట్టేసిన జగన్... తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్ వైఎస్ ఆర్ ఆరోగ్యశ్రీ సేవలు ఇప్పటిదాకా ఏపీకే పరిమితం కాగా.. ఆ సేవలను ఇకపై ఇతర పొరుగు రాష్ట్రాల్లోనూ ఏపీ ప్రజలు వినియోగించుకునేలా జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం జారీ అయిన ఈ ఆదేశాల ప్రకారం... ఆరోగ్యశ్రీ లబ్దిదారులు ఇకపై ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ - తమిళనాడు - కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఈ సేవలు అందుకునే వెసులుబాటు లభించింది.

జగన్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం... తెలంగాణ రాజధాని హైదరాబాద్ - తమిళనాడు రాజధాని చెన్నై - కర్ణాటక రాజధాని బెంగళూరులోని దాదాపుగా 17 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు ఏపీ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాకుండా ఈ 17 ఆసుపత్రుల్లో ఏకంగా 716 జబ్బులకు సంబంధించిన వైద్య చికిత్సలను ఏపీ ప్రజలకు అందుబాటులోకి తెస్తూ జగన్ సర్కారు నిజంగానే సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వెసులుబాటుకు సంబంధించిన ఆదేశాలను జారీ చేయడంతో పాటుగా సదరు ఆసుపత్రుల్లో అందుబాటులోకి రానున్న వైద్య సేవలకు సంబంధించిన పోస్టర్లను జగన్ ఆవిష్కరించారు.

వాస్తవానికి ఏపీలోని అన్ని ప్రధాన నగరాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నా... కొన్ని అరుదై రోగాలకు చికిత్సలు తీసుకోవాలంటే... హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర నగరాలకు వెళ్లాల్సిన దుస్థితి ఉన్న మాట నిజమే. ఇదే విషయాన్ని కాస్తంత లోతుగానే ఆలోచించిన జగన్... మన రాష్ట్ర పరిధిలోని ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న చికిత్సలు ఏమిటి? అందుబాటులో లేని చికిత్సలేమిటి? అన్న వివరాలపై సమగ్రంగానే దృష్టి సారించారు. ఏపీలో అందుబాటులో లేని వైద్య చికిత్సలు అవసరమైన ఆరోగ్యశ్రీ లబ్దిదారులు... ఇకపై నిరాశ చెందకుండా ఉండేలా జగన్ తాజా నిర్ణయం తీసుకున్నారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో కొన్ని అరుదైన జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఆరోగ్యశ్రీ కింద అర్హత ఉన్న వారు ఇకపై ఎంతమాత్రం నిరాశ చెందాల్సిన అవసరం లేదన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ పథకం అయిన ఆరోగ్యశ్రీ కింద రాష్ట్రంలోని ఆసుపత్రుల్లోనే చికిత్సలు తీసుకోవాలన్న మూస నిబంధనను పక్కనపెట్టేసిన జగన్... ఈ పథకం కింద లబ్దిదారులుగా ఉన్న వారు ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లో కూడా చికిత్సలు తీసుకునేలా తీసుకున్నారు. ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.