Begin typing your search above and press return to search.

ప్రవీణ్ ప్రకాశ్ ను సీఎంవో నుంచి బయటకు పంపేసిన జగన్!?

By:  Tupaki Desk   |   15 Feb 2022 4:43 AM GMT
ప్రవీణ్ ప్రకాశ్ ను సీఎంవో నుంచి బయటకు పంపేసిన జగన్!?
X
కొద్ది రోజుల క్రితం ఒక ఫోటో తెగ వైరల్ గా మారటమే కాదు.. సీనియర్ ఐఏఎస్ అధికారి ముఖ్యమంత్రి ముందు మోకాలిపై కూర్చొని ఆయనకు ఏదో వివరించే ప్రయత్నం చేసిన వైనం పెద్ద ఎత్తున విమర్శలకు తావిచ్చింది. సీఎం జగన్ పట్ల అంతటి స్వామిభక్తిని ప్రదర్శించిన సీనియర్ ఐఏఎస్ కమ్ ఏపీ సీఎంవో ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించిన ప్రవీణ్ ప్రకాశ్ ను ఏపీ సీఎంవో నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆయన కి ఆయన రిక్వెస్ట్ చేసుకొని వెళ్లారో లేక పంపించారో తెలియవలసి ఉంది .

తాడేపల్లి నుంచి ఏకంగా ఢిల్లీకి వెళ్లిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గడిచిన కొద్దిరోజులుగా ఆయన పుణ్యమా అని ఏపీ ప్రభుత్వం తరచూ తలనొప్పుల్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. ఆయనకు చెల్లుచీటిని ఇచ్చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకొని ఉండచ్చు ఏమో అని అంటున్నారు . తాజాగా ఆయనకు అప్రాధాన్యత పోస్టును కట్టబెట్టి ఢిల్లీకి పంపించేశారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక అలవాటు ఉంటుంది. ఎవరినైనా నమ్మితే వారికి పూర్తి స్వేచ్ఛను ఇస్తారు. అయితే.. దాన్ని తప్పుగా అర్థం చేసుకొని చెలరేగిపోతే.. కొంతవరకు సహిస్తారు. అయితే.. చంద్రబాబు మాదిరి భరిస్తూ కూర్చోరు. తన కారణంగా పెరిగిన తోకను తానే కత్తిరించివేయటమే కాదు.. ఆ విషయంలో ఆయన ఎంత కఠినంగా వ్యవహరిస్తారో ఇలాంటి ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది అని అంటున్నారు .

నిజానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ప్రవీణ్ ప్రకాశ్.. ఏపీ భవన్ కు రెసిడెంట్ కమిషనర్ గా వ్యవహరించేవారు. ఆయన్ను అక్కడి నుంచి సీఎంవోకు తీసుకొచ్చారు. నెత్తిన కూర్చోబెట్టుకున్నారు. ఆయన ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగింది. ఒకదశలో ఏపీ ప్రభుత్వంలో షాడో సీఎంగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఏం చేసినా.. ప్రవీణ్ ప్రకాశ్ కు చెప్పకుండా ఏపీ సీఎం ఏమీ చేయరన్నట్లుగా చర్చ సాగేది. ప్రవీణ్ తీరు పుణ్యమా అని ఎంతో మంది అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

ఆయన స్థాయి ఎంతలా ఉండేదనటానికి ఒక ఉదాహరణను చెప్పాల్సి వస్తే.. ఎల్వీ సుబ్రమణ్యం ఎపిసోడ్ ను చెప్పాలి. ఎల్వీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వేళలో.. సీఎంవో సెక్రటరీగా ఉన్న ప్రవీణ్ ప్రకాశ్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కట్ చేస్తే.. ఈ ఉత్తర్వులు అందుకున్న ప్రవీణ్ ప్రకాశ్ చేతుల మీదుగా ఎల్వీ సుబ్రమణ్యంను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తప్పిస్తూ ఉత్తర్వులను పంపిన పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లాంటి పవర్ ఫుల్ పోస్టు నుంచి ఏమాత్రం ప్రాధాన్యత లేని మారుమాలన ఉండే బాపట్లలోని మానవ వనరుల అభివృద్ది కేంద్రం డీజీగా నియమిస్తూ తీసుకున్న నిర్ణయం అప్పట్లో సంచలనంగా మారింది. అధికార వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

అంటే.. తనకు ఏ అధికారి అయితే షోకాజ్ నోటీసులు పంపారో.. అదే అధికారికి ప్రవీణ్ ప్రకాశ్ ట్రాన్స్ ఫర్ ఆర్డర్ చేతిలో పెట్టేసి.. సీఎంవో నుంచి బయటకు పంపించిన తీరుతో ప్రవీణ్ ప్రకాశ్ రేంజ్ భారీగా పెరిగిపోయిందని చెబుతారు. ఇటీవల కాలంలో ఆయన కేంద్రంలోని బీజేపీకి దగ్గరయ్యారని.. అన్ని అనుకున్నట్లు సాగితే వచ్చే ఎన్నికల్లో ఆయన బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారన్న ప్రచారం సాగింది. దీనికి తోడు ప్రవీణ్ ప్రకాశ్ తీసుకున్న నిర్ణయాలు ఏపీ ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చి పెట్టటం.. ఆయన తీరుపై వస్తున్న విమర్శలు.. అధికార వర్గాల హాహాకారాలతో ఆయనకు సీఎం జగన్ కు మధ్య దూరం పెరిగిందని చెబుతారు.

మరికొంతకాలం సీఎంవోలో ప్రవీణ్ ప్రకాశ్ ను ఉంచితే ప్రభుత్వానికి ఇబ్బందితో పాటు.. తనకు సంబంధించిన వివరాలు కేంద్రానికి వెళ్లే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గుర్తించి.. ఆయన్ను సీఎంవో నుంచి తాజాగా పంపేశారన్న మాట వినిపిస్తోంది. ఆయన ఏ పోస్టు నుంచి సీఎంవోకు వచ్చారో.. ఇప్పుడు అదే పోస్టు (ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్)కు ఆయన్ను నియమించటం విశేషం. ఇక్కడ మరో ఆసక్తికర అంశాన్ని చెప్పాలి. ప్రస్తుతం ఆ పోస్టులో ప్రవీణ్ ప్రకాశ్ సతీమణి భావనా సక్సేనాను డిప్యూటేషన్ మీద కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖకు బదిలీ అయ్యారు. ఆమె స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆమె భర్త ప్రవీణ్ ప్రకాశ్ ను బదిలీ వేటు వేసినట్లు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. తాను ఇచ్చిన అవకాశాన్ని.. అధికారాన్ని తేడాగా వినియోగిస్తే ఎంతటి వారికైనా తోక కత్తిరించటమేనన్న విషయాన్ని సీఎం జగన్ తాజా నిర్ణయంతో స్పష్టం చేశారని చెప్పొచ్చు.