Begin typing your search above and press return to search.

అవార్డుల ఫంక్షన్ సరే.. ఖర్చుల లెక్క చూశావా జగన్?

By:  Tupaki Desk   |   2 Nov 2022 10:05 AM IST
అవార్డుల ఫంక్షన్ సరే.. ఖర్చుల లెక్క చూశావా జగన్?
X
రోటీన్ కు భిన్నంగా వ్యవహరించటం.. అనూహ్య నిర్ణయాలు తీసుకోవటం.. దీర్ఘకాలిక ప్రయోజనాల కంటే.. ఇన్ స్టెంట్ రాజకీయ ప్రయోజనాల కోసం తపించే అధినేతల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలుస్తారు. తన నాలుగేళ్ల పాలనలో వేలాది కోట్లను సంక్షేమ కార్యక్రమాలకోసం ఖర్చు చేసిన ఆయన.. తన పాలనలో రాష్ట్రానికి మేలు చేసే ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయని తీరు చూస్తే.. ఆయన ప్రాధామ్యాలు ఏమిటన్నది అర్థమవుతూ ఉంటాయి.

ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డుల్ని పక్కకు పెట్టేసిన ఆయన.. తనదైన ముద్ర కోసం తన తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన అవార్డుల ప్రధానోత్సవాన్ని భారీ ఎత్తున నిర్వహించటం తెలిసిందే.

దేశంలోనే అత్యుత్తమ పౌర పురస్కారంగా భారతరత్నను చెబుతారు. అలాంటి పురస్కారానికి ఎంపికైన వారికి పురస్కారం ఇవ్వటమే తప్పించి.. నగదు పారితోషికం లాంటివి ఇవ్వరు. అంతేనా.. పద్మ పురస్కారాలకు సైతం నగదు పురస్కారం ఉండదు. ఇలా అత్యుత్తమ పురస్కారాలకు.. ఎంపిక కావటమే గొప్ప అన్నట్లుగా ఉంటుంది తప్పించి.. అవార్డుల పేరుతో లక్షలాది రూపాయిల్ని ఖర్చు చేయటం కనిపించదు.

తాజాగా వైఎస్ పేరు మీద ఏపీ ప్రభుత్వం ఇచ్చిన అవార్డుల్ని చూస్తే జగన్ తీరు ఇట్టే అర్థమైపోతుంది. వైఎస్సార్ లైఫ్ టైమ్ ఆచీవ్ మెంట్ కు రూ.10 లక్షలు.. ఆచీవ్ మెంట్ కు రూ.5 లక్షల చొప్పున ఇవ్వటం చూసినప్పుడు ఇంత ఖర్చు అవసరమా? అనిపించకమానదు.

ఈ మొత్తం కార్యక్రమానికి రూ.3 కోట్లు అవార్డుల కోసం వెచ్చిస్తే.. మరో రూ.3కోట్ల వరకు ప్రచార ఆర్భాటం కోసం ఖర్చు చేసిన వైనం చూశాక.. అవార్డుల పేరుతో జగన్ సర్కారు లక్ష్యం ఏమిటన్నది స్పష్టమవుతుంది.

అవార్డులు ఇవ్వొద్దని ఎవరూ చెప్పరు. కానీ.. ఆపేరుతో కోట్లాది రూపాయిల ప్రజాధనాన్ని ఖర్చు చేసే కన్నా.. దాని స్థానే ప్రజల బతుకులు మారే పనులు చేస్తే బాగుంటుంది కదా? అన్న ప్రశ్న తలెత్తక మానదు. తాము చేసే ప్రతి పనికి రాజకీయ ప్రయోజనాన్ని ఆశించే పాలకులు పవర్ లో ఉన్నప్పుడు.. తాత్కాలిక ప్రయోజనాలకే పెద్దపీట వేస్తారన్నది మర్చిపోకూడదు. జగన్ సర్కారు ఇందుకు మినహాయింపు కాదు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.