Begin typing your search above and press return to search.

బాబు ఎంత అదృష్టవంతుడంటే..?

By:  Tupaki Desk   |   1 March 2016 5:30 PM GMT
బాబు ఎంత అదృష్టవంతుడంటే..?
X
పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రం.. ఏదైనా చేయాలనుకుంటే చేతుల్లో డబ్బుల్లేని దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పగ్గాలు చేతికి రావటం వరం కంటే కూడా శాపంగానే మారుతుంది. ఇలాంటి వేళ అధికారానికి దూరంగా ఉండే వారు తెగ ఆనందపడిపోతారు. ఎందుకంటే.. ఎన్నికల వేళ ఇచ్చే హామీల్ని అమలు చేసే అవకాశం ఉండని పరిస్థితుల్లో.. అధికారం చేతికి వచ్చినా చేసేదేమీ ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో పవర్ లేకుంటేనే బెటర్ అన్న భావన ఉంటుంది.

అధికారం చేతిలో ఉండి కూడా ఏమీ చేయలేని దాని కంటే.. చూశారా? అధికారం చేతిలో ఉండి కూడా అధికారపక్షం ఏమీ చేయలేకపోతోంది. మేం కానీ అధికారంలో ఉండి ఉంటేనా? అన్న మాట చెప్పే వీలు విపక్షానికి ఉంటుంది. ఇలాంటి అద్భుత అవకాశం విపక్షాలకు అరుదుగా లభిస్తుంది. అందులోకి చంద్రబాబు లాంటి నేత సీఎంగా ఉన్నప్పుడు విమర్శలకు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే.. ఎన్నికల వేళ.. అధికారం రావటానికి ఉన్న ప్రతి చిన్న విషయానికి హామీల మీద హామీలు ఇచ్చిన పరిస్థితుల్లో.. ఆయన పాలనను దునుమాడటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.

ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేజేతులారా వదులుకుంటున్నారు. ఎన్నికలవేళ ఇచ్చిన హామీలేంటి? మీ పాలన ఏంటి? అన్న ప్రశ్నలతో పాటు.. కేంద్రంలో మిత్రపక్షంగా ఉండి సాధిస్తోంది ఏంటి? అని సూటిగా నిలదీస్తే.. సమాధానం చెప్పేందుకు ఏపీ అధికారపక్షం దగ్గర మాటలు లేని పరిస్థితి. అయితే.. ఇలాంటి అవకాశాల్ని వినియోగించుకునే తత్వం జగన్ కు ఉండదు. ఎంతసేపటికి తనదైన లోకంలో విహరించే ఆయన.. సొంత నేతల మనసుల్నే గెలుచుకోరు. అలాంటిది విపక్ష నేతగా ఏపీ ప్రజల మనసుల్ని దోచుకునే అవకాశమే తక్కువ.

నిజానికి జగన్ లాంటి నేత విపక్ష నేతగా లభించటం చంద్రబాబు అదృష్టంగా భావించాలి. నిజమే.. సవాలక్ష హామీలతో బాబు పవర్ లోకి వచ్చినా.. వాటిని నెరవేర్చలేదన్న అసంతృప్తి ప్రజల్లో ఉన్నా.. జగన్ లాంటి నాయకుడి కంటే బాబు ఎంతో బెటర్ అన్న భావన ఉంది. విభజన కారణంగా ఏర్పడిన నష్టాల కారణంగా తాను ఎంతో చేయాలని ఉన్నా.. చాలా వరకూ చేయలేకపోతున్న విషయాన్ని బాబు ఎప్పటికప్పడు చెప్పుకుంటూ ఉన్నారు. దీన్ని సమర్థంగా తిప్పి కొట్టే విషయంలోనూ జగన్ ఫెయిల్ కావటం చూస్తే.. బాబుకు మించిన లక్కీ ఫెలో ఎవరుంటారు..?