Begin typing your search above and press return to search.

అసెంబ్లీలో జగన్ ఫెయిల్

By:  Tupaki Desk   |   24 Dec 2015 5:30 PM GMT
అసెంబ్లీలో జగన్ ఫెయిల్
X
నవ్యాంధ్రలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టింది మొదలు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి వరుసగా విఫలమవుతూనే ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరగడానికి ముందు, శాసనసభలో చర్చించడానికి అవకాశాలు పండులా వస్తున్నాయి. వాటిని చర్చించాలని ప్రతిపక్షం కూడా సిద్ధమవుతోంది. కానీ, అసెంబ్లీలో అధికార పక్షం ఎత్తులకు చిత్తవుతోంది. అసెంబ్లీ సమావేశాల చివరికి వచ్చేసరికి ముఖం వేలాడేస్తోంది. గతంలో ఎన్నో సందర్భాల్లో ఇదే జరిగింది. ఇప్పుడు మరోసారి పునరావృతం అయింది.

అసెంబ్లీ సమావేశాలు మరో పది రోజుల్లో జరుగుతాయనగా కాల్ మనీ – సెక్స్ రాకెట్ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇందులో తెలుగుదేశం ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్ - బుద్ధా వెంకన్న పాత్ర ఉన్నట్లు కథనాలు వచ్చాయి. వీరిద్దరూ కూడా రాజధాని ప్రాంత ప్రజా ప్రతినిధులే. దాంతో కాల్ మనీ అంశం అసెంబ్లీలో చర్చకు వస్తుందని అధికార పార్టీ భావించింది. దానిని పక్కకు మళ్లించడానికి కాల్ మనీ నిందితులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా దాడులు జరిపించింది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేయడంతో అధికార పార్టీకే ఎదురు దెబ్బ తగిలింది. బాక్సైట్ సహా మిగిలిన ఏ అంశం చర్చకు వచ్చినా దాని నుంచి సమర్థంగా ఎదురు దాడి చేయడానికి తమ వద్ద అవకాశం, ఆధారాలు ఉన్నాయని, కాల్ మనీ వ్యవహారం చర్చకు వస్తే చిక్కుకుపోతామని భావించింది. దాంతో ఎప్పట్లాగే వైసీపీని వ్యూహంతోనే బొక్కబోర్లా పడేయాలని భావించిందని రాజకీయ వర్గాలు వివరిస్తున్నాయి. అధినేత జగన్ సహా వైసీపీ నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేస్తే వాళ్లు తొలి నుంచీ రెచ్చిపోతున్నారు. అలా రెచ్చిపోతూనే అసలు విషయాన్ని పక్కనపెట్టేసి తమపై చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యూహం తొలి నుంచీ విజయవంతం అవుతోందని, ఇప్పుడు కూడా అదే వ్యూహాన్ని అమలు చేయాలని అధికార పార్టీ భావించిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే తొలుత జగన్ సహా వైసీపీ నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేశారని, దానికి ప్రతిగా రోజా తదితరులు రెచ్చిపోయారని, అధికార పార్టీ ప్రతిపక్ష నాయకులు చేసిన వ్యాఖ్యలను రికార్టుచేసిందని, దాంతో ప్రతిపక్షం అడ్డంగా దొరికిపోయిందని రాజకీయ వర్గాలు వివరిస్తున్నాయి. చివరికి అధికార పార్టీ వ్యూహమే ఫలించిందని, కాల్ మనీ వ్యవహారం పక్కకుపోయి ఎప్పట్లా వైసీపీ బద్నాం అయిందని వివరిస్తున్నాయి.