Begin typing your search above and press return to search.

జగన్:అపజయానికి ఐదు మెట్లు-5(అలక్ష్యం)

By:  Tupaki Desk   |   25 Sep 2015 6:10 PM GMT
జగన్:అపజయానికి ఐదు మెట్లు-5(అలక్ష్యం)
X
తాను ఎంతగానో కోరుకున్న ముఖ్యమంత్రి పీఠాన్ని తొలి ప్రయత్నంలో చేజిక్కించుకోలేకపోయిన జగన్ మొదట బాగా నిరాశపడినా తరువాత తొందరగానే కోలుకున్నాడు. తాను తొందరలోనే ముఖ్యమంత్రినవుతానని ఆయనలో గట్టి నమ్మకం కనిపిస్తుంటుంది. రెండు మూడేళ్లలో చంద్రబాబు ప్రభుత్వంపోయి తాను సీఎం అవుతాననని ఆయన తరచూ అంటుంటారు. అయితే... ఆ దిశగా తనవంతు ప్రయత్నాలు మాత్రం గట్టిగా చేయలేకపోతున్నారన్నది సత్యం. ఎన్నికల తరువాత చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తరువాత రుణమాఫీ వంటి విషయాల్లో చంద్రబాబుకు ఎంత మేలు జరిగిందో అంతే నష్టమూ జరిగింది. దాన్ని అడ్డంపెట్టుకుని లాభపడదామని జగన్ ప్రయత్నం చేసినా దాన్ని వ్యవస్తీకృతంగా చేయలేకపోయారు. ఆయన దీక్షలు, ఆందోళనలు అంటూ ఒక్కరోజు ఉద్యమాలకే పరిమితమవుతుంటే జిల్లాల్లో నేతలు కూడా అదే తీరున ఉంటున్నారు. దీంతో ఆ వ్యతిరేకతను చంద్రబాబు ప్రభుత్వం సమర్థంగా తిప్పికొట్టగలిగింది. రాజధాని భూసేకరణ విషయంలోనూ అదే జరిగింది. అసెంబ్లీలోనూ జగన్ కొంత ప్రయత్నం చేసినా చంద్రబాబు తప్పులనుంచి తాను మార్కులు కొట్టేయడంలో మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారు. ఈయన సీరియస్ గా పనిచేయనంత కాలం ఇలాంటి అపజయాలు జగన్ కు తప్పవు.

మరోవైపు ఆయన్ను కేసుల భయం బాగా వెంటాడుతోంది. గత ప్రభుత్వంలో జరిగినట్లుగా అంతా పైకి కనిపించకపోయినా తెరవెనుక గట్టి ప్రయత్నం జరుగుతున్నట్లుగా జగన్ అనుమానిస్తున్నారు. ఈ కేసుల్లో ఏ ఒక్కదాంల్లో నేరం రుజువైనా ఆరేళ్ల పాటు జగన్ ఎన్నికలకు, పదవులకు దూరమవ్వాల్సిందే. అంటే ఆయనకు వచ్చే టర్ములో అవకాశం పోయినట్లే. ఈసారి కాకపోయినా, ఆ తరువాతయినా సరే ప్రజలు తనను గెలిపిస్తారని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. ఆయన మాటల్లో అది అడుగడుగునా కనిపిస్తుంటుంది... అయితే, ప్రజలిచ్చే ఆ అవకాశానికి ఈ కేసులు గండికొడతాయేమోనన్న భయం మాత్రం ఆయనలో ఉంది. కాబట్టి ఆ కేసుల నుంచి బయటపడి తన అవకాశాలను పెంచుకోవాలన్న వ్యూహంలో జగన్ ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే... అదేసమయంలో తనకు బద్ధ శత్రువు అయిన రామోజీ సహాయాన్ని కోరుతుండడం మాత్రం ఆయనకు తన పిలక అందివ్వడమే తప్ప ఇంకేమీ కాదు. రామోజీకి మోడీ వద్ద, చంద్రబాబు వద్ద ఉన్న పలుకుబడి కారణంగా జగన్ రామోజీతో సఖ్యత కోరుకుంటుండొచ్చు కానీ, రామోజీ రాజకీయం, ఎత్తుగడలు తెలిసినవారు మాత్రం అది జగన్ కు ఎప్పటికైనా దెబ్బేనని హెచ్చరిస్తున్నారు.

భౌతిక దాడులు తప్ప అన్నిరకాలుగా దిగజారి తిట్టుకున్న, దొంగదెబ్బలు తీసుకున్న రామోజీ, జగన్ లు కలవడం రాజకీయంగా సంచలనమే కావొచ్చు కానీ అందులో జగన్ ప్రయోజనాలు ఎంతవరకు నెరవేరుతాయన్నది అనుమానమే. అదేసమయంలో రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చని కూడా గత అనుభవాలు చెబుతున్నాయి. వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తన ఇడుపులపాయ ఎస్టేటుకు రోడ్లు, కరెంటు, ప్రత్యేక సబ్ స్టేషన్ వంటివన్నిటినీ రాజశేఖరరెడ్డి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు సహకారంతోనే సాధించుకోవడాన్ని మర్చిపోరాదు. ఇప్పుడు కూడా జగన్ అదే వ్యూహంతో వెళ్తుండొచ్చన్న వాదన ఉంది... అయితే, అందులో రామోజీ మధ్యవర్తిత్వమే జగన్ కు పెనుముప్పు కావొచ్చన్నది చాలామంది అనుమానం. ఎత్తుగడల్లో జగన్ నిర్లక్ష్యం వహిస్తే దెబ్బతినక తప్పదంటున్నారు.

కొసమెరుపు: .... కాగా జగన్, రామోజీల భేటీ వెనుక ఇంకో ఆసక్తికర కథనం కూడా వినిపిస్తోంది. జగన్, రామోజీ వద్దకు వెళ్లినప్పటికీ ఆయన రావడంతో రామోజీ ప్లానే ఉందని తెలుస్తోంది. జగన్ అవసరాలతో పాటు రామోజీ అవసరాలు కూడా ఇందులో ఉన్నాయని సమాచారం. రామోజీ ఓం ప్రాజెక్టు చేపడుతుండడంతో దానికి భూముల విషయంలో ప్రధానంగా జగన్ మీడియా నుంచి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రాజెక్టు, భూములపై సాక్షి కథనాలు రాస్తుందన్న భయం రామోజీలో ఉంది. అదేవిధంగా జగన్ కు కేసుల నుంచి బయటపడాలన్న కోరిక, అవసరం ఉన్నాయి. దీనిపై ఇద్దరి మధ్య అవగాహన కుదిరిందని చెబుతున్నారు. దీంతోపాటు.... ఇంకోటి కూడా వినిపిస్తోంది. వచ్చే పదిపదిహేనేళ్లలో దేశంలో పెద్ద ప్రాజెక్టుల్లో ఏపీ రాజధాని నిర్మాణం కూడా ఒకటవుతుంది. అందులో పనులు చేజిక్కించుకునే ఆలోచన జగన్ ఉందని... అందుకు రామోజీని ఆశ్రయించారని చెబుతున్నారు. మొత్తానికి ఈ భేటీలో ఇద్దరికీ ఉన్న పెద్ద పెద్ద అవసరాలపైనే ప్రాథమికంగా చర్చజరిగిందని... రెండో భేటీ కూడా ఉందని.. అది ఢిల్లీలో అవుతుందని భోగట్టా.కేసుల విషయంలో జగన్ రామోజీని ఆశ్రయించడం మంచి ఎత్తుగడే కావొచ్చు కానీ, కాంట్రాక్టుల కోసం కలిస్తే మాత్రం అది ఆయనకు రాజకీయంగా ఎప్పటికైనా దెబ్బే అవుతుంది.

..ఇప్పటికైనా తనకున్న అవకాశాలను విజయాలుగా మలచుకునే దిశగా నాయకుడిలా వ్యవహరించకపోతే జగన్ నలుగురికీ నాయకుడిగా కాకుండా నలుగురిలో నారాయణలా మిగిలిపోవడం గ్యారంటీ.

-గరుడ

Disclaimer: Views expressed in this article are of the writer and do not represent the views of tupaki.com, and not necessarily reflect the opinions of the organisation either.