Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కు జ‌గ‌న్ ఎంత భ‌య‌ప‌డుతున్నారంటే

By:  Tupaki Desk   |   15 Jun 2016 4:28 AM GMT
కేసీఆర్‌ కు జ‌గ‌న్ ఎంత భ‌య‌ప‌డుతున్నారంటే
X
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్‌ రెడ్డిపై రాజ‌కీయ‌వ‌ర్గాల్లో కొత్త చ‌ర్చ మొద‌ల‌యింది. ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్రదేశ్‌ లో అధికార తెలుగుదేశం పార్టీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ తో విల‌విల‌లాడుతున్న వైఎస్ జ‌గ‌న్ తాజాగా తెలంగాణలో అదే ప‌రిస్థితిని ఎదుర్కుంటున్నార‌ని చెప్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్యూహంతో జ‌గ‌న్ ఇబ్బందులు ప‌డుతున్నారని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి విష‌యంలో జ‌గ‌న్ ఇరుకున‌ప‌డ్డార‌ని తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ లో భాగంగా ఇప్పటికీ ఇద్ద‌రు ఎంపీలు అధికారికంగా కారెక్కారు. మ‌ల్కాజ్‌ గిరీకి చెందిన టీడీపీ ఎంపీ మ‌ల్లారెడ్డి - వైసీపీ నుంచి గెలిచిన ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ జాబితాలో ఉన్నారు. న‌ల్ల‌గొండ ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ నాయ‌కుడు గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఈనెల 15న కారెక్క‌నున్నట్లు ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో త‌మ ఎంపీల‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని కాంగ్రెస్‌ - టీడీపీ ఫిర్యాదులు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ మల్కాజ్‌ గిరి ఎంపీపై ఫిర్యాదు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్న‌ద‌ని స‌మాచారం. ఈ ఫిర్యాదు వ‌స్తే బీజేపీ పెద్దలు కూడ చర్య తీసుకునేందుకు ఆసక్తిగా ఉండే క్రమంలో వీరిపై త్వరలోనే అనర్హత వేటు పడే అవకాశాలు స్పష్టంగా క‌నిపిస్తున్నాయి. ఇక లోక్‌ సభలో ప్రతిపక్ష స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడ గుత్తాపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఫిర్యాదు చేస్తామని చెబుతోంది.

అయితే త‌మ పార్టీ త‌ర‌ఫున గెలిచిన ఏకైక ఎంపీ పార్టీ మార‌డంపై ఫిర్యాదు చేసేందుకు వైఎస్ జ‌గ‌న్ వెనకడుగు వేస్తున్నార‌ని సమాచారం. ఫిర్యాదు ఆమోదం పొంది ఒకవేళ ఖమ్మం పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికలు వస్తే ఆ స్థానాన్ని తిరిగి వైసీపీ నిలబెట్టుకోలేమనేదే జ‌గ‌న్‌ భావ‌నగా చెప్తున్నారు. ఈ పరిస్థితులలో పొంగులేటిపై అన‌ర్హ‌త వేటువేయాల‌ని ఫిర్యాదు చేయడం వృథా ప్ర‌య‌స అవుతుంద‌ని జగన్ భావిస్తున్నట్లుగా పార్టీ వ‌ర్గాలు చెప్తున్నాయి. ఒక‌వేళ అన‌ర్హ‌త వేటు ప‌డితే ఇప్ప‌టికే ఏపీలో ఇక్క‌ట్ల‌లో ఉన్న వైసీపీ తెలంగాణ‌లో మ‌రింతగా దిగ‌జారేందుకు సొంతంగా ఏర్పాట్లు చేసుకున్న‌ట్లు అవుతుంద‌ని పేర్కొంటున్నారు.