Begin typing your search above and press return to search.

చంద్రబాబు పర్మిషన్.. లోకేష్ బాబు కలెక్షన్

By:  Tupaki Desk   |   6 Sep 2018 6:40 AM GMT
చంద్రబాబు పర్మిషన్.. లోకేష్ బాబు కలెక్షన్
X
తండ్రీ కొడుకులు చంద్రబాబు-లోకేష్ బాబు అవినీతిపై తీవ్ర విమర్శలు చేశారు వైసీపీ అధినేత జగన్.. పెదబాబు అవతారంలో చంద్రబాబు అడ్డగోలుగా అనుమతులిస్తుంటే.. చినబాబు లోకేష్ కలెక్షన్ ఏజెంట్ గా మారి వసూళ్లకు తెరతీశారని జగన్ ఆరోపించారు.ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ సబ్బవరంలో మాట్లాడారు. టీడీపీ సర్కారు చేస్తున్న అవినీతిని ప్రజలకు కళ్లకు కట్టినట్టు వాళ్లకు అర్థమయ్యే రీతిలో వివరించారు.

టీడీపీ పాలనలో ప్రతిరంగంలోనూ కుంభకోణం ఉందని జగన్ విమర్శించారు. ఎమ్మెల్యే - కలెక్టర్ నుంచి పెదబాబు - చినబాబు వరకూ అందరికీ వాటాలు వెళ్తున్నాయని ఆరోపించారు. ఏ టెండర్ - కాంట్రాక్ట్ అయినా పెదబాబు పర్మిషన్ ఇస్తాడని.. చినబాబు కలెక్షన్ చేసుకుంటాడని మండిపడ్డారు. తండ్రీకొడుకులకు విశాఖలోని ఆస్తులపై కన్నుపడిందని.. విశాఖలో టీడీపీ నేతలు చినబాబుతో సంబంధాలు పెట్టుకొని చేస్తున్న స్కాములు అన్నీ ఇన్నీ కావు అని అన్నారు. ఏకంగా 500 ఎకరాల అసైన్డ్ భూములు కొట్టేశారని విమర్శించారు. అవే భూముల్ని ల్యాండ్ ఫూలింగ్ కింద ప్రభుత్వానికి ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఇంతకంటే దారుణమైన అవినితి ఉంటుందా అని మండిపడ్డారు.

పద్దతి ప్రకారం చేస్తున్నానని చంద్రబాబు అంటున్నారని.. అది నిజమేనని.. టీడీపీ నేతలంతా అవినీతిని ఓ పద్ధతి ప్రకారం చేస్తున్నారని జగన్ విమర్శించారు. చివరకు వీళ్ల కరెప్షన్ కంప్యూటర్ డిస్కుల వరకూ పాకిందని జగన్ ఎద్దేవా చేశారు. కంప్యూటర్లలో డాక్యుమెంట్లు తారు మారు చేసి పేదలకు అందాల్సిన పరిహారాన్ని కూడా విశాఖ టీడీపీ నేతలు తినేస్తున్నారని మండిపడ్డారు. నీరు-చెట్టు పేరు చెప్పి రూ.40 కోట్ల రూపాయలు కొల్లగొట్టారని విమర్శించారు.

ఆర్థికమంత్రి యనమలపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు జగన్. యనమల ఏ అర్హతతో తన వియ్యంకుడికి పోలవరం ప్రాజెక్టులో సబ్ కాంట్రాక్టర్ గా అవకాశం ఇచ్చారో చెప్పాలని జగన్ ప్రశ్నించారు. బాబు హయాంలో పోలవరం పునాదులు కూడా ముందుకు పోలేదని విమర్శించారు. లంచాల కోసం నామినేషన్ పద్ధతిలో సబ్ కాంట్రాక్టర్లను బాబు తీసుకొస్తున్నారని.. వీళ్లంతా బాబు బినామీలేనని జగన్ విమర్శించారు. బాబు దోపిడీ కారణంగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నత్తనడకన సాగుతోందని మండిపడ్డారు.

బాబు పాలనలో ప్రజారోగ్యం పడకేసిందని.. ఆరోగ్యశ్రీ పథకాన్ని భ్రష్టు పట్టించారని జగన్ విమర్శించారు. పేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న చంద్రబాబుకు కుర్చీలో కుర్చునే అర్హత లేదన్నారు వైసీపీ అధినేత. హైదరాబాద్ లో ఏపీ ప్రజలకు ఆరోగ్య శ్రీ ఉండదని.. కానీ ఇక్కడ రోగమొస్తే మంచి ఆస్పత్రులు లేక హైదరాబాద్ వెళ్లి జనం ఒళ్లు, ఇల్లు గొల్లు చేసుకుంటున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ మంత్రికి పంటినొప్పి వస్తే సింగపూర్ పోయి రూ.3 లలు ఖర్చు చేస్తాడని..పేదవాడికి ప్రాణం మీదకు వస్తే తెలంగాణలో ఆరోగ్యశ్రీని ఎందుకు వర్తింపచేయరని జగన్ మండిపడ్డారు.

నారా హమారా కార్యక్రమంలో చంద్రబాబును ప్రశ్నించిన పాపానికి ముస్లిం యువకులను జైల్లో పెట్టించారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎదురు ప్రశ్నిస్తే తోకకత్తిరిస్తున్నారని.. ఇవేవీ మీడియాలో రావని అన్నారు. ఇకనైనా బాబు అరాచక అవినీతి పాలనకు ముగింపు పలకాలని జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు.