Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ నోట బాబు రెండు అబ‌ద్ధ‌పు సినిమాలు

By:  Tupaki Desk   |   13 Jun 2018 5:38 AM GMT
జ‌గ‌న్ నోట బాబు రెండు అబ‌ద్ధ‌పు సినిమాలు
X
నిర్విరామంగా సాగుతున్న ఏపీ విప‌క్ష నేత జ‌న సంక‌ల్ప యాత్ర తాజాగా తూర్పు గోదావ‌రి జిల్లాలోకి ప్ర‌వేశించిన సంగ‌తి తెలిసిందే. జిల్లాలు ఒక్కొక్క‌టిగా పూర్తి అవుతున్న కొద్దీ.. ప్ర‌జాభిమానం అంత‌కంత‌కూ పెరుగుతున్న‌వైనం గోదావ‌రి బ్రిడ్జి సాక్షిగా తెలుగు ప్ర‌జ‌లకు క‌నిపించింది. నేల ఈనిందా అన్న చందంగా జ‌గ‌న్ వెంట న‌డిచిన జ‌న ప్ర‌వాహంతో గోదారి కొత్త క‌ళ‌ను సంత‌రించుకుంద‌ని చెప్పాలి.

ప్ర‌జా సంక‌ల్పం పేరుతో గ‌డిచిన 187రోజులుగా చేస్తున్న పాద‌యాత్ర‌లో భాగంగా తాజాగా జ‌గ‌న్ మాట్లాడారు. నాలుగేళ్ల బాబు పాల‌న‌పై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తిన ఆయ‌న‌.. బాబు హ‌యాంలో ఏం జ‌రిగిందో వివ‌రంగా చెప్పుకొచ్చారు. సూటిగా కొన్ని ప్ర‌శ్న‌లు సంధించిన జ‌గ‌న్‌.. బాబు అండ్ కోను ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేశార‌నిచెప్పాలి. మోసం చేయ‌టంలో బాబు పీహెచ్ డీ తీసుకున్నార‌న్న ఆయ‌న‌.. పోల‌వ‌రం ప్రాజెక్టు త‌న క‌ల‌గా చెబుతున్నార‌న్నారు. మ‌రి.. అదే నిజ‌మైతే 1999 నుంచి 2004 వ‌ర‌కు సీఎంగా ఉన్న చంద్ర‌బాబు ఆ స‌మ‌యంలో ఆ ప్రాజెక్టు గురించి ఎందుకు ప‌ట్టించుకోలేదో చెప్పాల‌ని నిల‌దీశారు.

త‌న నాలుగేళ్ల పాల‌న‌లో చంద్ర‌బాబు రెండు అబ‌ద్ధ‌పు సినిమాలు ఏపీ ప్ర‌జ‌ల‌కు చూపించార‌న్నారు. అందులో ఒక‌టి పోల‌వ‌రం అయితే మ‌రొక‌టి అమరావ‌తిగా ఆయ‌న చెప్పారు. రెండు అబ‌ద్ధ‌పు సినిమాలు చూపించ‌టం త‌ప్ప మ‌రింకేమీ చేయ‌లేద‌న్నారు. రాష్ట్రంలో దుర్మార్గ పాల‌న చేస్తూ.. విచ్చ‌ల‌విడిగా దోపిడీ కార్య‌క్ర‌మాల్ని చేప‌ట్టిన బాబు తీరుపై జ‌గ‌న్ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు.

రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలోని కోటిప‌ల్లి సెంట‌ర్లో గ‌ళం విప్పిన జ‌గ‌న్ ప్ర‌సంగానికి అక్క‌డి ప్ర‌జ‌ల నుంచి భారీగా స్పంద‌న వ‌చ్చింది. చంద్ర‌బాబుకు దేవుడంటే భ‌క్తి లేద‌ని.. భ‌యం కూడా లేద‌న్నారు. గోదావ‌రి పుష్క‌రాల పేరుతో అక్ష‌రాల రూ.2వేల కోట్లు విలువైన ప‌నులంటూ అవినీతికి పాల్ప‌డ్డార‌న్నారు. రోడ్లు.. లైట్లు.. ఘాట్ల నిర్మాణం పేరుతో నామినేష‌న్ ప‌ద్ద‌తిలో ప‌నుల‌న్నీ త‌న బినామీల‌కు ఇప్పించుకున్నార‌న్నారు. ఇష్టానుసారం రేట్లు పెంచేసుకొని..దేవుని సొమ్మును దోచేసిన వ్య‌క్తం ప్ర‌పంచంలో చంద్ర‌బాబు ఒక్క‌రేన‌న్నారు. ఇలాంటి వ్య‌క్తి సీఎంగా ఉండ‌టానికి అర్హ‌త ఉందా? అని ప్ర‌శ్నించారు.

నాన్న గారి హ‌యాంలో పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌రుగులు తీసింద‌ని ఈ జిల్లాలోకి అడుగు పెట్టిన వెంట‌నే ఇక్క‌డి వారు త‌న‌తో చెప్పిన‌ట్లుగా జ‌గ‌న్ చెప్పారు. ఈ రోజున పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు నెమ్మ‌దిగా సాగుతున్నాయ‌న్న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మూడు నెల‌ల‌కోసారి.. ఆర్నెల్ల‌కోసారి గ్రాఫిక్స్ చూపించి.. అదిగో సింగ‌పూర్.. ఇదిగో రాజ‌ధాని.. అదిగో మైక్రోసాఫ్ట్‌.. ఇదిగో ఎయిర్ బ‌స్ అంటుంటార‌ని.. అదే అమ‌రావ‌తిగా చెబుతార‌న్నారు.

పోల‌వ‌రం ప్రాజెక్టు సినిమాలో అయితే కాస్త ఎక్కువ క‌లెక్ష‌న్లు రాబ‌ట్ట‌టానికి వారం.. వారం ప్ర‌తి సోమ‌వారం పోల‌వ‌రం అంటార‌ని.. నాలుగేళ్లుగా ఈ రెండు సినిమాలే బాబు చూపిస్తున్నార‌న్నారు. అమ‌రావ‌తి అనేసినిమాలో నాలుగేళ్లుగా శాశ్వ‌త నిర్మాణాల‌కు ఒక్క‌టంటే ఒక్క ఇటుక కూడా ప‌డ‌లేద‌న్నారు. కానీ.. ఏదో జ‌రిగిపోతున్న‌ట్లుగా.. గొప్ప‌గా సినిమా చూపిస్తూ ప్ర‌జ‌ల‌కు భ్రాంతిని క‌లుగుచేస్తున్న‌ట్లు చెప్పారు.

బాబు గొప్ప‌గా చెబుతున్న డ‌యాఫ్రం వాల్ అంటే పునాది గోడ అని.. ఆ పునాది అయ్యింద‌ని చెప్పిన చంద్ర‌బాబు ఈ రోజు జాతికి అంకితం చేస్తున్నాడ‌న్నారు. పోల‌వ‌రం ప‌రిస్థితి ఎలా ఉందో చెప్పిన జ‌గ‌న్‌.. 36 ల‌క్ష‌ల క్యూబిక్ మీట‌ర్లు మేర‌కు కాంక్రీట్ పని జ‌ర‌గాల్సి ఉంది. కేవ‌లం 6.7 ల‌క్ష‌ల క్యూబిక్ మీట‌ర్ల ప‌నులు మాత్ర‌మే జ‌రిగాయి. కానీ.. ప్రోగ్రెస్ రిపోర్టు పేరు చెప్పి పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు 36 శాతం మేర పూర్తి అయిన‌ట్లుగా ఉద‌ర‌గొడుతున్నార‌న్నారు. మొత్తం 36 శాతం ప‌నుల్లో 70 శాతం పోల‌వ‌రం కుడికాలువ‌.. ఎడ‌మ కాలువ ప‌నులు ఉన్నాయ‌ని.. వీటిల్లో 90 శాతం వైఎస్ హ‌యాంలోనే జ‌రిగాయి క‌దా? అని బాబును ప్ర‌శ్నించారు.

గోదావ‌రి పుష్క‌రాల్లో బాబు సినిమాలో హీరోగా క‌నిపించాల‌న్న ఆరాట‌ప‌డి 29 మంది ప్రాణాల్ని బ‌లిగొన్నార‌న్నారు. బాబు వీఐపీ ఘాట్ లో స్నానం చేయ‌కుండా.. మామూలు ప్ర‌జ‌లు స్నానం చేసే పుష్క‌ర‌ఘాట్ వ‌ద్ద‌కువ‌చ్చి సాధార‌ణ ప్ర‌జ‌ల‌ను స్నానాల‌కు పోనివ్వ‌కుండా ఆపార‌న్నారు. సినిమాలో బాగా క‌నిపించాల‌న్న ఉద్దేశంతో ఒక్క‌సారిగా గేట్లు తెరిపించేసి.. ప్ర‌జ‌లంద‌రిని ఒక్క‌సారిగా వ‌దిలేశార‌న్నారు. దీంతో జ‌రిగిన తొక్కిస‌లాట‌లో29 మంది మ‌ర‌ణించార‌న్నారు.

29 మంది ప్రాణాల్ని బ‌లి తీసుకున్న చంద్ర‌బాబు అనే విల‌న్ సీఎంగా ఉండ‌టానికి అర్హుడేనా? రాజ‌మహేంద్ర‌వ‌రంలో అడుగుపెట్ట‌గానే గోదారిలో ఇసుక‌ను బాబు దోచేస్తున్నార‌ని ఇక్క‌డి వారు చెప్పార‌న్నారు. గోదావ‌రికి అటువైపు మంత్రి జ‌వ‌హ‌ర్‌.. బూరుగుప‌ల్లి శేషారావు ఇసుక దోపిడీ చేస్తుంటే.. ఇటువైపు మా ముస‌లాయ‌న గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి.. మా ఎంపీ ముర‌ళీమోహ‌న్ రావులు బాధ్య‌త క‌లిగిన స్థానాల్లో ఉంటూ బాబుకు లంచాలు ఇస్తూ ఇసుక‌ను దోచుకుంటున్నారంటూ జ‌గ‌న్ మండిప‌డ్డారు. ఇందులో వాళ్లు కొంత తీసుకొని.. క‌లెక్ట‌ర్ల‌కు ఇంత అని ఇచ్చి.. చిన్న‌బాబుకు ఇంత‌.. పెద్ద‌బాబుకు ఇంత అని ఇచ్చి ఇసుక‌ను దోపిడీ చేస్తున్నార‌న్నారు. ప్ర‌తి రోజూ త‌న క‌ళ్ల ముందే వేల లారీలు ఇసుక తీసుకెళ్లిపోతున్నాయ‌ని ఇక్క‌డి ప్ర‌జ‌లు చెబుతున్నార‌న్నారు. అధికారులు ఈ దోపిడీపై ఏం మాట్లాడ‌టం లేద‌న్నారు.