Begin typing your search above and press return to search.

జగ‌న్ అడిగిన ప్ర‌శ్న‌లో భ‌లే లాజిక్ ఉందే!

By:  Tupaki Desk   |   15 April 2017 10:34 AM IST
జగ‌న్ అడిగిన ప్ర‌శ్న‌లో భ‌లే లాజిక్ ఉందే!
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును విప‌క్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి సూటిగా సంధించిన ఒక‌టే ప్ర‌శ్న ఇప్పుడు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌తిప‌క్ష నేత సొంత‌ నియోజ‌క‌వ‌ర్గానికి కూడా నీళ్లు ఇచ్చిన ప్ర‌భుత్వం త‌మ‌ద‌ని ఇటీవ‌ల సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన జ‌గ‌న్ ను ఎద్దేవా చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై తాజాగా జ‌గ‌న్ ఆస‌క్తిక‌రమైన ప్ర‌శ్న వేశారు. కడప జిల్లా తొండూరు మండలం తేలూరు తుమ్మలపల్లె గ్రామంలో ఎండిపోయిన చీనీ తోటలను జగన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులివెందులకు నీళ్లు ఇచ్చిఉంటే చెట్లు ఎలా ఎండిపోతాయో చంద్రబాబే సమాధానం చెప్పాలన్నారు.

గ‌తంలో చేయ‌ని ప‌నిని తాము చేశామ‌ని - పులివెందులకు నీళ్లు ఇచ్చామని తెలుగుదేశంపార్టీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని, అయితే నీళ్లు ఇచ్చిఉంటే చెట్లు ఎలా ఎండిపోతాయో వారే చెప్పాలని జ‌గ‌న్ డిమాండ్ చేశారు. పైడిపాళెంకు 6 టిఎంసిల నీరు ఇవ్వాల్సి ఉండగా 0.3 టిఎంసిల నీరు మాత్రమే ఇచ్చారన్నారు. అలాగే చిత్రావతికి 10 టిఎంసిల నీరు రావాల్సి ఉండగా సాగునీటి కోసం 0.23 టిఎంసిలు మాత్రమే ఇచ్చారన్నారు. లింగాల- సింహాద్రిపురం-తొండూరు మండలాలకు నీరు ఇచ్చామని చెబుతున్నారని, అయితే ఇక్కడ మాత్రం పండ్లతోటలు నీళ్లు లేక ఎండిపోతున్నాయని జ‌గ‌న్ అన్నారు. `పులివెందులకు నీళ్లిచ్చాం, రైతులంతా బ్రహ్మాండంగా షావుకార్లు అయ్యారు, ఆనందంగా ఉన్నారని గొప్పలు చెప్పుకుంటున్నారు. వాస్తవానికి రైతుల వేదన అంతా ఇంతా కాదు` అని జ‌గ‌న్ వెల్ల‌డించారు. టీడీపీ నేతలు రైతుల వద్దకు వచ్చి మాట్లాడితే వారి ఆగ్రహం ఎలా ఉంటుందో తెలుస్తుందని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలోని రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశారని జ‌గ‌న్ ఆరోపించారు. రైతులకు బాబు ఇచ్చిన రుణమాఫీ నిమిత్ర మాత్రమేనన్నారు. రుణమాఫీ వస్తున్నదని వడ్డీ కట్టకుండా ఉండిపోవడంతో ప్రస్తుతం వడ్డీ మరింత పెరిగి కట్టలేక రైతు నడ్డి విరుగుతోందని జ‌గ‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రూ.82 వేల కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉండగా రూ.48 వేలకోట్లు మాత్రమే మాఫీ చేశారని త‌ప్పుప‌ట్టారు. రుణమాఫీ విషయంలో చంద్రబాబు మాటలతో బురిడీ కొట్టిస్తున్నారే తప్ప రైతులకు న్యాయం చేయడం లేదని జ‌గ‌న్ మండిప‌డ్డారు. అబద్ధాలు చెబుతూ అందరినీ మోసం చేస్తున్న చంద్రబాబుకు దేవుడు మొట్టికాయలు వేస్తాడు అని తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/