Begin typing your search above and press return to search.

సాక్షిపై చ‌ర్య‌ల‌కు జ‌గ‌న్ ఎలా స్పందించాడంటే...

By:  Tupaki Desk   |   10 Jun 2016 11:29 AM GMT
సాక్షిపై చ‌ర్య‌ల‌కు జ‌గ‌న్ ఎలా స్పందించాడంటే...
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ నేతృత్వంలోని సాక్షి మీడియా సంస్థ‌ల‌ను స్వాధీనం చేసుకోనుంద‌నే వార్త‌ల‌పై ఆ పార్టీ అధినేత‌ - సాక్షి మీడియా సంస్థ‌ల వ్య‌వ‌స్థాప‌కుడు వైఎస్ జ‌గ‌న్ తీవ్రంగా స్పందించారు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీరుకు పోలీస్ టెర్ర‌రిజం అని పేరు పెట్టాల్సి వ‌స్తుంద‌ని వ్యాఖ్యానించారు.

తమిళనాడులో డీఎంకే - అన్నాడీఎంకే పార్టీలకు చానెల్స్ ఉన్నాయని అయితే ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరో పార్టీకి చెందిన చానెల్స్ ప్రసారాల్ని కత్తిరించ లేదని జ‌గ‌న్ గుర్తు చేశారు. 'చంద్రబాబు చేస్తున్న పనులు అన్యాయం - తప్పు అని అడిగితే గొంతు నొక్కుతున్నారు. అటువంటి కథనాలు ప్రసారం చేస్తున్నందుకు సాక్షి చానెల్ ప్రసారాలు నిలిపివేశారు. ఇటువంటివి పునరావృతం కాకుండా కట్టడి చేయించాలి. రాజకీయ అధికారంతో నచ్చని టీవీ చానెళ్ల ప్రసారాలు నిలిపివేయటం అంటే ఇది ప్రజాస్వామ్యంలో ఒక చీకటి రోజు అనుకోవాలి. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలన చేసినప్పుడు కొన్ని ఛానెల్స్ వ్యతిరేకంగా వార్తలు రాసేవి. కార్యక్రమాలు చేసేవి. అప్పుడు కూడా అటువంటి ఛానెల్స్ ప్రసారాల్ని నిలిపివేసిన దాఖలాలు లేనే లేవు. అటువంటి వార్తలు ప్రచురించిన పత్రికల్ని ఆపివేయటమూ జరగలేదు. చంద్రబాబునాయుడు కొత్త సంప్రదాయాన్ని నెలకొల్పుతున్నారు. చంద్రబాబు చేతిలో పోలీసులు ఉన్నారు కదా అని రెచ్చిపోయి దారుణాలు చేయటాన్ని ఖండిస్తున్నాం. ఈ రోజు ముద్రగడకు , వాస్తవాలు చూపిస్తున్న సాక్షి టీవీ కి ఎటువంటి పరిస్థితి తలెత్తిందో రేపు మరొక వ్యవస్థలకు ఇటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఇంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే పోలీసు టెర్రరిజం అని చంద్రబాబు నామకరణం చేసినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇంతకన్నా దారుణం ఉంటుందా?' అని ప్ర‌శ్నించారు.

చంద్రబాబుది రాజకీయ దిగజారుడుత‌న‌మ‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ ఒక సామాజిక అంశమ‌ని పేర్కొంటూ దానికి ప్రజల నుంచి మద్దతు ద‌క్కుతోంద‌ని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల మారాల్సిన అవసరం ఉందని, ప్రజలు తిరగబడుతున్నారన్న భయం చంద్రబాబులో రావాలని జ‌గ‌న్ అన్నారు. చంద్ర‌బాబుకు అటువంటి భయం రావాలంటే ఆయ‌న‌లాంటి నాయకులు తిరగుతున్నప్పుడు చీపుర్లు చూపించాల్సిన అవసరం ఉందని జ‌గ‌న్ ఫైర్ అయ్యారు. ఇటువంటి ఆగడాల్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంద‌ని అంతా ఒక్కటై నిరసన తెలపాలని కోరారు.