Begin typing your search above and press return to search.

బంద్ ఊపుతో బాబును ఏసుకున్న జగన్

By:  Tupaki Desk   |   3 Aug 2016 5:36 AM GMT
బంద్ ఊపుతో బాబును ఏసుకున్న జగన్
X
ఏపీ ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో కేంద్రమంత్రి ఆరుణ్ జైట్లీ ఇచ్చిన సమాధానంపై కాస్త ఆలస్యంగా స్పందించిన ఏపీ విపక్ష నేత జగన్.. ఆ విషయాన్ని ఎవరూ గుర్తు పెట్టుకోకుండా చేయటంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. రాజ్యసభలో జైట్లీ సాయంత్రం నాలుగైదు గంటల మధ్య తాను చెప్పాలనుకున్నది చెప్పేసిన తర్వాత.. ఈ అంశంపై తన వాదనను వినిపించేందుకు ఆయన మీడియా ముందుకు రాలేదు. కనీసం ఆయన పేరు మీద ప్రకటన వెలువడటానికి కూడా దాదాపు నాలుగైదు గంటలు పట్టిన పరిస్థితి.

అయితే.. ఆ విషయంలో తన వైపు జరిగిన తప్పును కవర్ చేస్తూ.. ఆగస్టు 2న ఏపీ బంద్ కు పిలుపునివ్వటం.. పక్కరోజు మధ్యాహ్న వేళ.. సుదీర్ఘ మీడియా సమావేశం పెట్టి.. అందులో చంద్రబాబుకు సంబంధించిన వీడియోలు ప్రదర్శించి.. ప్రత్యేక హోదా మీద తనకెంత కమిట్ మెంట్ ఉందన్న విషయాన్ని చెప్పుకునే ప్రయత్నం చేశారు. హోదా విషయంలో మోడీ సర్కారు మీద ఫైట్ చేసే విషయంలో ఏమాత్రం దూకుడుతనం ప్రదర్శించని జగన్.. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని వాడుకునే ప్రయత్నం చేశారు. జైట్లీ మాటల నేపథ్యంలో ఏపీ బంద్ కు పిలుపునిచ్చిన జగన్.. ఈ ఎపిసోడ్ లో చంద్రబాబుపై ఫైర్ అయ్యారే కానీ.. ప్రధాని మోడీ మీద తీవ్ర విమర్శలు చేయకపోవటం గమనార్హం.

ఇదిలా ఉంటే.. తాజాగా నిర్వహించిన ఏపీ బంద్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసినట్లు జగన్ ప్రకటించారు. తాను ఊహించిన దాని కంటే తన పార్టీ నేతలు ఉత్సాహంగా రోడ్డు మీద రావటం జగన్ కు ఆనందం కలిగించిందో ఏమో కానీ.. కాస్తంత జోష్ లో ఏపీ ముఖ్యమంత్రిపై తీవ్రంగా మండిపడ్డారు. హోదా అంశంపై ఆయనకున్న కమిట్ మెంట్ ను ప్రశ్నించిన జగన్.. ఈ సందర్భంగా తనదైన శైలిలో ఏపీ సీఎంపై నిప్పులు చెరిగారు.

బంద్ సక్సెస్ అయ్యిందని.. అడ్డుకోవాలని కొన్ని శక్తులు చూసినా వారి ప్రయత్నాలు విజయవంతం కాలేదన్న జగన్.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసుల్ని ప్రజల పైకి ఉసిగొల్పారన్నారు. బంద్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించారని.. హోదాకు బాబు అనుకూలమైతే.. బంద్ లో పాల్గొన్న వారిని ఎందుకు అరెస్ట్ చేశారంటూ సూటిగా ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా రావటం కోసం కేంద్రం మీదనే కాదు.. రాష్ట్రం మీద కూడా పోరాటం చేయాల్సి రావటం దురదృష్టకరంగా అభివర్ణించారు.

ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాము ఎన్నో ప్రయత్నాలు చేశామని.. చివరకు తాను ఎనిమిది రోజుల నిరవధిక దీక్ష చేసిన విషయాన్ని గుర్తు చేసిన జగన్.. ఈ సందర్భంగా బాబును తీవ్రస్థాయిలో తప్పు పట్టేలా ఒక పోలిక చేశారు. స్వాతంత్ర్య పోరాట సమయంలో చంద్రబాబుకానీ ఉండి ఉంటే బ్రిటీషోల్లు ఇచ్చినప్పుడు స్వాంతంత్ర్యం తీసుకుందామని చెప్పేవారంటూ ఎటకారం చేశారు. స్వాతంత్ర్యం ఏమైనా సంజీవనా అని చంద్రబాబు అనేవారని.. అదృష్టం ఏమిటంటే.. అప్పట్లో చంద్రబాబు లేకపోవటంగా వ్యాఖ్యానించారు. ఏపీకి సీఎంగా చంద్రబాబు ఉండటం కర్మగా అభివర్ణించారు. పథకం ప్రకారం హోదా అంశంపై పోరాటాన్ని నీరు కార్చేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్న జగన్.. ఆయనకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని చెప్పటం గమనార్హం. హోదా అంశంపై ఇప్పటికే తాము పలుమార్లు పోరాటం చేశామని.. తాజాగా ప్రత్యేకహోదా అవసరాన్ని చెప్పేందుకు వీలుగా రాష్ట్రపతి.. ప్రధాని అపాయింట్ మెంట్ కోరినట్లుగా జగన్ వెల్లడించారు. ఇప్పటికే తన ఎంపీల ద్వారా ప్రధాని అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లుగా చంద్రబాబు చెప్పటం.. జగన్ నోటి నుంచి అదే మాట వచ్చిన నేపథ్యంలో ప్రధాని ఎవరికి ముందు అపాయింట్ మెంట్ ఇస్తారో చూడాలి.