Begin typing your search above and press return to search.

బాబు మీద జగన్ ‘ప్రత్యేక’ ఫైరింగ్

By:  Tupaki Desk   |   26 Aug 2015 4:31 AM GMT
బాబు మీద జగన్ ‘ప్రత్యేక’ ఫైరింగ్
X
ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం మీద ఏపీ అధికార పక్షం మిత్రుడిగా ఉండి.. ఇబ్బందికర పరిస్థితుల్లో నోరు విప్పటం లేదన్న వాదన వినిపిస్తుంటే.. ఇలాంటి అంశాల్ని నిలదీసి.. కడిగేయాల్సిన ఏపీ విపక్షం సైతం పెద్దగా మాట్లాడకుండా.. తూతూ మంత్రం విమర్శలతో కాలం గడిపేస్తుందన్న విమర్శ ఉంది. ఇలాంటి విమర్శలు.. ఆరోపణలు మొత్తంగా తమ ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేస్తాయని భావించారేమో కానీ.. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత.. ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గొంతు సవరించుకున్నారు. ప్రత్యేకహోదా మీద గళం విప్పారు. ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చే విషయంలే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుది చేతకానితనంగా అభివర్ణించిన ఆయన.. ప్రత్యేక మాటల ఫైరింగ్ చేశారు.

కృష్ణా జిల్లా చట్లపల్లి మండలం మాజేరులో విష జ్వరాల కారణంగా చనిపోయిన కుటుంబాల్ని ఏపీ సర్కారు ఆదుకోవాలంటూ డిమాండ్ చేస్తూ కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక హోదా సాధించటంలో ఏపీ సర్కారు వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ.. ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఏపీకి ప్రత్యేక హోదా.. ప్యాకేజీ విషయమై రాష్ట్రానికి అన్యాయం జరగకుండా ఉండటానికి ప్రధానిని.. అవసరమైతే రాష్ట్రపతిని తానుకలుస్తానని చెప్పిన జగన్.. ఈ నెల 29న ప్రత్యేక హోదా కోసం ఇచ్చిన బంద్ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై అవసరమైతే ప్రధానితో తాడో పేడో తేల్చుకుంటానని చెప్పిన చంద్రబాబు.. ప్రత్యేక హోదాను ప్రస్తావించకపోవటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

ప్రత్యేక హోదా కోసం ఎవరూ అఘాయిత్యాలకు పాల్పడవద్దని.. అన్ని పార్టీలు కలిసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొద్దామన్నారు. తెలుగుదేశం పార్టీ చేతకానితనానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలంటూ మండి పడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా గురించి జగన్ నోరు విప్పటం లేదన్న కొరతను తీరుస్తూ.. జగన్ ప్రత్యేకంగా ఫైర్ కావటం గమనార్హం. విషజ్వరాల బాధితులకు సాయం చేయాలంటూ ధర్నా చేసిన జగన్.. తన ప్రసంగంలో ఎక్కువ భాగం ఏపీ ప్రత్యేక హోదా.. ఆ విషయంలో చంద్రబాబు వైఫల్యం గురించే ఎక్కువగా మాట్లాడటం గమనార్హం.