Begin typing your search above and press return to search.

రాజకీయ వ్యవస్థను మార్చాలంటున్న జగన్

By:  Tupaki Desk   |   13 July 2016 11:02 AM GMT
రాజకీయ వ్యవస్థను మార్చాలంటున్న జగన్
X
ఇచ్చిన హామీలను అమలు చేయని నేతలను ప్రజలు నిలదీయాలని.. అలా నిలదీసినప్పుడే రాజకీయ వ్యవస్థ మారుతుందని.. ఏపీలో రాజకీయ వ్యవస్థ మార్పు కోసం చంద్రబాబును ప్రజలు నిలదీయాలని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఏపీలో నెలకొన్న రైతుల సమస్యలపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జగన్‌ ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో పర్యటించిన ఆయనను పొగాకు రైతులు కలిశారు. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని కూడా తగ్గించి పొగాకు కొనుగోలు చేస్తున్నారని జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను తీర్చేందుకు రాష్ట్ర మంత్రులు కేంద్రమంత్రులపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబును దుమ్మెత్తి పోశారు. పొగాకు ధర లేక.. రైతులకు గిట్టుబాటు ధర రాక.. వారు క్రాప్ హాలిడే ప్రకటించి నానా ఇబ్బందులు పడుతుంటే వారికి హోంమంత్రి హెచ్చరికలు జారీ చేయడం విడ్డూరమన్నారు. రైతుల రుణాలు మాఫీ చేస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పారన్నారు. రైతుల నుంచి ఇప్పుడు బ్యాంకులు అపరాధ రుణం వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు అపరాధ వడ్డీ కట్టాల్సిన పరిస్థితులు రావడానికి చంద్రబాబే కారణమని ఆయన విరుచుకుపడ్డారు.

చంద్రబాబు చెప్పేదొకటి - చేసేదొకటని.. రైతులను ఆదుకునేందుకు స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని చెప్పిన ఆయన ఇంతవరకు ఆ ఊసే ఎత్తలేదని మండిపడ్డారు. రైతులను ఆదుకోవాలంటే చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి.. కానీ, మోడీని అడిగే ధైర్యం చంద్రబాబుకు కానీ, ఆయన మంత్రులు - ఎంపీలకు కానీ లేదని జగన్ ఫైర్ అయ్యారు. తీసుకు రావాల్సిన అవసరముందన్నారు. టిడిపి ఎంపీలు కేంద్రంలో మంత్రులుగా ఉన్నారని, అలాంటప్పుడు కేంద్రం పైన ఒత్తిడి తీసుకు వచ్చే బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ఏపీకి రావాల్సినవి చెయ్యకుంటే మా మంత్రులను ఉపసంహరించుకుంటామని కేంద్రానికి చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదా అని నిలదీశారు.

రైతుల కోసం చంద్రబాబు పైన ఒత్తిడి తీసుకువచ్చే కార్యక్రమాన్ని తాము చేపడతామన్నారు. బాబు పైన ఒత్తిడి ఉంటేనే, ఆయన కేంద్రం పైన ఒత్తిడి చేస్తారని, అప్పుడు కేంద్రం పొగాకు రైతుల బాధలు పట్టించుకుంటుందన్నారు. పామాయిల్ రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారని.. పామాయిల్ ధరలు సగానికి సగం తగ్గిపోయాయని జగన్ అన్నారు. ఉత్తుత్తి హామీలు ఇచ్చే చంద్రబాబు ముందుముందు అందరికీ కార్లు - విమానాలు ఇస్తానని కూడా చెబుతారేమో అని ఎద్దేవా చేశారు. కాగా జగన్ సభకు భారీగా జనం రావడంతో ఆయన ఉత్సాహంగా మాట్లాడారు.