Begin typing your search above and press return to search.

బాబు...మ‌నం ప్ర‌జాస్వామ్యంలోనే ఉన్నామా?

By:  Tupaki Desk   |   26 Jan 2017 10:53 AM GMT
బాబు...మ‌నం ప్ర‌జాస్వామ్యంలోనే ఉన్నామా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం ప్ర‌జ‌లంతా ఒక్క‌తాటిపైకి వ‌చ్చి ఆకాంక్ష‌ను వెల్ల‌డిస్తుంటే ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అణిచివేత వైఖ‌రి అనుస‌రిస్తున్నారంటూ ఏపీ విప‌క్ష‌నేత‌ - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ త‌ప్పుప‌ట్టారు. గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో జెండా ఎగుర‌వేసిన అనంత‌రం జ‌గ‌న్ ప్ర‌సంగించారు. దేశానికి స్వాతంత్ర్యం దక్కించుకొని బ్రిటిష్ పాల‌న నాటి అవ‌శేషాల‌ను తొల‌గించే క్ర‌మంలో సొంత రాజ్యాంగం రూపొందించుకోవ‌డం ద్వారా గ‌ణ‌తంత్ర రాజ్యంగా దేశం అవ‌త‌రించామ‌న్నారు. అయితే అదే చ‌ట్టాల ఆధారంగా ఏర్ప‌డిన రాజ్యాంగ ఇచ్చిన హామీల‌ను అమ‌లుచేయ‌మ‌ని గ‌ళం విప్పుతుంటే గొంతు నొక్కుతున్నారని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.

విభ‌జ‌న‌తో గాయ‌ప‌డిన రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కేటాయిస్తామ‌ని పార్ల‌మెంటు సాక్షిగా హామీ ఇచ్చి ఇపుడు స‌సేమిరా అంటున్నార‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. ఎన్నిక‌ల హామీల‌ను నెర‌వేర్చాల‌ని కోరితే అరెస్టుల‌కు దిగుతున్నార‌ని దిగుతున్నార‌ని మండిప‌డ్డారు. విశాఖ ఆర్కే బీచ్ వ‌ద్ద శాంతియుతంగా నిర‌స‌న తెలిపేందుకు సిద్ధ‌మైతే బీచ్‌ పరిసరాల్లో ఆంక్షలు విధించడంపై జ‌గ‌న్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కనీసం వాకర్స్‌ ను కూడా బీచ్‌ ​పరిసరాల్లోకి అనుమతించడంలేదని, విశాఖలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా కోసం గళమెత్తిన పార్టీ నేతలను హౌస్‌ అరెస్ట్‌ లు చేస్తున్నారని మండిపడ్డారు. త‌మ పార్టీ ఎంపీ మిథున్‌ రెడ్డి - ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నేతలను హౌస్‌ అరెస్ట్‌ లు చేస్తున్నారని జ‌గ‌న్ వివ‌రించారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20 నుంచి 30 కోట్లు ఇచ్చి కొనుగోలు చేస్తూ ఆడియో - వీడియో టేపుల సాక్షిగా దొరికిపోయిన చంద్రబాబు త‌న ప్ర‌యోజ‌నాల కోసం రాష్ట్రాన్ని తాక‌ట్టుపెడుతున్నార‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు. ప్ర‌జ‌లంతా ఏపీకి ప్ర‌త్యేక హోదా అని గ‌ళం విప్పితే చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకుండా ఉండ‌టం వెనుక కార‌ణం ఇదేన‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు.

కాపు నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం విష‌యంలోనూ ఇదే రీతిలో వ్య‌వ‌హ‌రించార‌ని జ‌గ‌న్ త‌ప్పుప‌ట్టారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో కాపుల‌కు కోటా క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చిన ఏపీ సీఎం చంద్ర‌బాబు ఇపుడు ఆ డిమాండ్ గుర్తుచేస్తున్నందుకు ముద్ర‌గ‌డ‌ను గృహ‌నిర్భందం పాలు చేస్తున్నార‌ని జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అదే విధంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో జాబు రావాలంటే బాబు రావాల‌ని ప్ర‌చారం నిర్వ‌హించార‌ని అలాంటిది అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత క‌ల్పించిన ఉద్యోగాలు ఎన్ని అని జ‌గ‌న్ సూటిగా ప్ర‌శ్నించారు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ఐదున్నర కోట్ల ప్రజలను బాబు వెన్నుపోటు పొడిచారని మండిప‌డ్డారు. అధికారం కోసం అబద్ధాలు చెప్పే నేతల కాలర్‌ పట్టుకుని ప్రశ్నిస్తే మార్పు వస్తుందని జ‌గ‌న్ అన్నారు. ప్ర‌జ‌లు విజ్ఞుల‌ని పేర్కొంటూ స‌రైన స‌మ‌యంలో స‌రైన తీర్పు త‌ప్ప‌క ఇస్తార‌ని జ‌గ‌న్ ధీమా వ్య‌క్తం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/