Begin typing your search above and press return to search.

బాబు ఉంటే స్వాతంత్ర్యం కూడా వ‌చ్చేది కాదు

By:  Tupaki Desk   |   26 Jan 2017 5:42 PM GMT
బాబు ఉంటే స్వాతంత్ర్యం కూడా వ‌చ్చేది కాదు
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా కోరుతూ విశాఖ‌లో చేప‌ట్టిన కొవ్వొత్తుల ర్యాలీకి సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన త‌న‌ను అరెస్టు చేసి నిర‌స‌న కేంద్రానికి వెళ్ల‌కుండా విశాఖపట్నం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలించడంపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు - ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్ర‌జాస్వామ్యయుతంగా నిర‌స‌న తెలిపే హ‌క్కును కూడా హ‌రించేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ను అణిచివేసిన పనికి చంద్రబాబు సిగ్గుతో తల దించుకోవాలని వ్యాఖ్యానించారు. బ్రిటీష‌ర్ల ప‌రిపాల‌న స‌మ‌యంలో చంద్రబాబు నాయుడి లాంటి నాయకుడు ఒక్కరుంటే.. మన దేశానికి స్వాతంత్ర్యం కూడా వచ్చి ఉండేది కాదని జ‌గ‌న్ విమ‌ర్శించారు.

ముఖ్యమంత్రిగా ఉండి పోరాటం చేయాల్సిన చంద్ర‌బాబు ప్రత్యేక హోదా అన్న హామీని దగ్గరుండి వెన్నుపోటు పొడుస్తున్నార‌ని జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చంద్రబాబు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ప్రత్యేక హోదాను ఖూనీచేయడాన్ని దేవుడు, ప్రజలు కూడా క్షమించరని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. ఆయన్ను బంగాళాఖాతంలో కలిపే రోజు దగ్గర్లోనే ఉందని జోస్యం చెప్పారు. రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని ప్ర‌క‌టించారని, దాన్ని నీరుగార్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని చెప్పాల్సిన అవ‌స‌రం ఉన్నందున అందరం కలిసికట్టుగా ఒక్కటవుదామని అన్ని పార్టీలకు జ‌గ‌న్ విజ్ఞప్తి చేశారు. ఈ సంద‌ర్భంగా కొంద‌రు పోలీసుల‌పై జ‌గ‌న్ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. "కొంతమంది పోలీసులు మాత్రం చంద్రబాబుకు మద్దతుగా, చాలా దారుణంగా ప్రవర్తించారు. ఎల్లకాలం చంద్రబాబు సర్కారు సాగదు..దయచేసి ప్రజల పక్షాన, వారికి అండగా నిలబడండి. సెల్యూట్ కొట్టాల్సింది టోపీ మీద ఉండే సింహాలకు గానీ గుంటనక్కలకు కాదు" అని జ‌గ‌న్ పోలీసుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

చంద్రబాబు పుణ్యాన ఉద్యోగాలు దొరక్క, రాష్ట్రంలో పరిశ్రమలు మూతపడే పరిస్థితి వచ్చిందని జ‌గ‌న్ మండిప‌డ్డారు. అందుకే ప్రత్యేక హోదా ద్వారా రాష్ట్రానికి క‌లిగే ప్ర‌యోజ‌నాల రీత్యా రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా క్యాండిల్ ర్యాలీ చేయడానికి ప్రయత్నిస్తే, కాకినాడలోజేఎన్టీయూ పిల్లలను కొట్టారని జ‌గ‌న్‌ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తిరుపతి, అనంతపురం - విశాఖపట్నం అన్నిచోట్లా పిల్లలను కొట్టడం, కేసులు పెట్టారు, వేలమందిని అరెస్టు చేశారని మండిప‌డ్డారు. చంద్రబాబు వైఖరికి నిరసనగా, ప్రత్యేక హోదాకు ఆయన అడ్డు తగులుతున్న తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా రేపు ఆందోళనలు చేయాలని కోరారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/