Begin typing your search above and press return to search.

ప్రపంచ చరిత్రను ప్రస్తావించిన జగన్

By:  Tupaki Desk   |   3 Sep 2016 4:20 AM GMT
ప్రపంచ చరిత్రను ప్రస్తావించిన జగన్
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద విరుచుకుపడ్డారు ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఓటుకు నోటు ఇష్యూలో తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న జగన్.. ఈ దఫా బాబును విమర్శించేందుకు ఎటకారాన్నిఅస్త్రంగా చేసుకున్నారు. బాబు తరచూ మాట్లాడే మాటల్ని ప్రస్తావిస్తూ మండిపడ్డ ఆయన.. ఓటుకు నోటు కేసులో అరెస్ట్ కాకపోవటం ఆయనకున్న ‘చిత్తశుద్ధి’గా అభివర్ణించారు. ఒక ముఖ్యమంత్రి రెఢ్ హ్యాండెడ్ గా ఆడియో.. వీడియో టేపుల్లో పట్టుబడి అరెస్ట్ కాకపోవటం దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే బాబు ఒక్కరేమో అంటూ ఎద్దేవా చేశారు.

వైఎస్ ఏడో వర్థంతి సందర్భంగా కడప జిల్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న జగన్.. సీఎం స్థాయి వ్యక్తి ఆడియో.. వీడియో టేపుల్లో దొరికిపోవటం ఏమిటని ప్రశ్నించారు. ఓటుకునోటు కేసు పట్ల చంద్రబాబుకున్న ‘చిత్తశుద్ధి’ కారణంగానే అరెస్ట్ కాలేదన్న జగన్.. ఏసీబీ కోర్టు బాబుపై విచారణకు ఆదేశిస్తే కేంద్రమంత్రిగా ఉన్న సుజనా చౌదరి.. కేంద్రమంత్రుల్ని.. బీజేపీ అధ్యక్షుడ్ని కలుస్తారన్నారు. గవర్నర్ ను కలిసి ప్రత్యేక హోదా గురించి అని చెబుతున్నారని.. కానీ.. గవర్నర్ కు ప్రత్యేక హోదాకు సంబంధం ఏమిటంటూ ప్రశ్నించారు.

ఆరోపణలు.. విమర్శలు ఏమైనా తెర మీదకు వచ్చినప్పుడు వారికి సంబంధించిన వ్యక్తులు ఎవరూ ఎవరినీ కలవకూడదన్నట్లుగా జగన్ మాటలు ఉన్నాయి. ఆ మాటల్నే పరిగణలోకి తీసుకుంటే.. తన మీదున్న కేసుల విచారణ జోరందుకున్న వేళ.. జగన్ ప్రస్తావించిన రాజ్ నాథ్ సింగ్.. అరుణ్ జైట్లీల మాదిరే జగన్ కూడా పలువురు జాతీయ నేతల్ని కలవటాన్ని మర్చిపోకూడదు. అత్యున్నత స్థాయి నేతలతో భేటీలోని అంతర్యాన్ని ప్రశ్నిస్తున్న జగన్.. తాను కూడా గతంలో కేంద్రమంత్రులతో.. ప్రధానితో భేటీ అయిన విషయాన్ని మరిచిపోవటం ఏమిటి? కేంద్రమంత్రులు ఇతర మంత్రులతో భేటీ కావటాన్ని భూతద్దంలో చూస్తున్న జగన్.. తన వైఖరిని.. తనపార్టీ నేతల వైఖరిని ఇలానే లింకు పెట్టి మాట్లాడితే ఏం సమాధానం చెబుతారు? దేశ స్థాయి.. ప్రపంచ స్థాయి మాటలు చెబుతున్న జగన్ మరిచిపోకూడని అంశం ఒకటి ఉంది. ప్రతి విషయాన్ని పట్టి పట్టి చూడటంలో తప్పు లేదు. కానీ.. ప్రతి ఒక్క అంశాన్ని సందేహం చూసే ధోరణి అలవాటు చేస్తే.. ఎవరిని ఎవరూ నమ్మని పరిస్థితి ఏర్పడుతుంది. అదే జరిగితే.. భవిష్యత్తులో జగన్ భేటీల్ని సైతం ఇదే రీతిలో విమర్శించే వీలుంది. లక్ష్మణ రేఖల్ని దాటేస్తూ విమర్శలు చేయటం మంచిది కాదన్న విషయాన్నిజగన్ ఎప్పటికి తెలుసుకుంటారో..?