Begin typing your search above and press return to search.

సొంతోళ్ల మీద ఆ కస్సుబుస్సు ఏమిటి జగన్

By:  Tupaki Desk   |   1 March 2016 9:40 AM GMT
సొంతోళ్ల మీద ఆ కస్సుబుస్సు ఏమిటి జగన్
X
ఆవేశం ఆభరణంలా ఉండాలి. కోపం ఎదుటోళ్లను కంట్రోల్ చేసేదిగా ఉండాలి. అంతేకానీ.. మన చిరాకు ఎదుటోడ్ని చిన్నబుచ్చేలా ఉండకూదు. అందులోకి కాలం కలిసిరాని వేళ.. వీలైనంత వరకూ అణిగిమణికి ఉండటానికి మించింది లేదు. సలహలు చెప్పే స్థాయి నుంచి సలహాలు వినే స్థాయికి వెళ్లినప్పుడు కాల మహిమ అని సర్దుకుపోవటంలోనే తెలివైనోడి సామర్థ్యం దాగి ఉంటుంది. అంతేకానీ.. నాకే సలహాలు ఇస్తావా? చెప్పమన్నానని నీకు తోచించి చెప్పేస్తావా? అంటూ చిరాకు పడిపోవటం ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికే చెల్లుతుందని చెబుతున్నారు.

తాజాగా ఆయన వ్యవహారశైలి పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. గడిచిన కొద్ది రోజుల్లో ఆరుగురు ఎమ్మెల్యేలు.. ఒక ఎమ్మెల్సీ పార్టీ నుంచి జంప్ అయి.. అధికారపార్టీ తీర్థం పుచ్చుకున్న వేళ.. తన సహచరులతో సమావేశం పెట్టుకున్నప్పుడు జగన్ ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఏ నిమిసాన ఎవరు తనను విడిచిపోతారో తెలీని పరిస్థితుల్లో తొందరపడటం కన్నా.. సంయమనంతో ఉండటం చాలా ముఖ్యం. కానీ.. జగన్ లో అలాంటిది మచ్చుకు కూడా కనిపించటం లేదన్న మాట బలంగా వినిపిస్తోంది.

సోమవారం పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమైన ఆయన.. ఎవరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండని కోరిన సమయంలో.. అందరితో మీరు తచచూ మాట్లాడుతూ ఉండాలన్న మాట చెప్పిన ఎమ్మెల్యేపై కస్సుబుస్సు లాడటమే కాదు.. చిన్న చిన్న సలహాలు ఇచ్చిన వారిపై చిరాకు పడిపోతూ.. సమావేశం మధ్యలో వెళ్లిపోవటంతో జగన్ బ్యాచ్ కి షాక్ తగిలినట్లైందని చెబుతున్నారు.

నిజానికి జగన్ వైఖరి బాగా తెలిసిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు.. ఆయనకు సలహాలు ఇచ్చే పనిని అస్సలు పెట్టుకోరు. వీలైనంతవరకూ ఆచితూచి మాట్లాడుతుంటారు. ఓపక్క పార్టీ ఎమ్మెల్యేలు జంప్ అవుతున్న వేళ.. మనసులోని మాట చెప్పాలని ఒకటికి రెండుసార్లు జగన్ అడగటంతో గొంతు విప్పిన వారికి షాక్ తగిలేలా ఆయన వ్యవహరించటం పార్టీ నేతలకు మింగుడుపడని వ్యహారంగా మారింది. విపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి మామూలే. ఇలాంటి సమయంలోనే.. తనకు అండగా ఉండాలని కోరటం.. అందరూ కలిసి ఈ విపత్కర పరిస్థితిని అధిగమిద్దాం లాంటి మాటలు.. మీ సమస్యల్ని నేను తీరుస్తానంటూ భరోసా ఇవ్వటం లాంటివి అధినేతలు చేస్తుంటారు.

ఇప్పుడు తిరుగులేని అధికారాన్ని చెలాయిస్తున్న చంద్రబాబు సైతం.. సార్వత్రిక ఎన్నికలకు పదేళ్ల ముందు ఎంతటి గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. విపక్ష నేతగా ఉన్నప్పుడు.. పలువురు ఎమ్మెల్యేలు బాబు తీరును కాస్త కటువుగా ఆయనకే చెప్పేవారు. దాన్ని మౌనంగా వినట.. తన ఆవేదనను వ్యక్తం చేసే వారే తప్పించి.. ఎప్పుడూ చిరాకు పడటం.. ఆగ్రహం వ్యక్తం చేయటం లాంటివి చేయలేదన్న విసయాన్ని మర్చిపోకూడదు. కాలం పెట్టే పరీక్షల్ని ఓపిగ్గా ఎదుర్కోవాలే తప్పించి.. కంట్రోల్ తప్పి వ్యవహరిస్తే తనకే నష్టమని జగన్ అర్థం చేసుకుంటే మంచిది. లేకుంటే.. ఆయన బలంగా ఉన్న నేతలంతా సైడ్ అయితే.. ఆయన మరింత బలహీనం అవుతారన్న నిజాన్ని గుర్తించాల్సిన సమయం ఇదేనని ఆయన మర్చిపోకూడదు. చేతులారా చెడగొట్టుకునే వాడిని మార్చటం సాధ్యమేనా?