Begin typing your search above and press return to search.

కేసీఆర్ గెలిస్తే రైతుల మీద పెద్ద పెద్ద బండలే

By:  Tupaki Desk   |   18 Nov 2015 4:38 AM GMT
కేసీఆర్ గెలిస్తే రైతుల మీద పెద్ద పెద్ద బండలే
X
వరంగల్ ఉప ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ సర్కారును తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పలు ప్రశ్నలు సంధించారు. సందేహాలు వ్యక్తం చేశారు. తన తండ్రి వైఎస్ హయాంను ప్రతి విషయంలోనూ గుర్తు చేసిన ఆయన.. కేసీఆర్ సర్కారును తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాజా ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసినా.. వేయకున్నా జరిగే నష్టం పెద్దగా ఉండదన్న జగన్.. టీఆర్ఎస్ పార్టీ కానీ గెలిస్తే మాత్రం తెలంగాణ ప్రజలకు మహా ఇబ్బందని వ్యాఖ్యానించారు.

వరంగల్ ఉప ఎన్నికల్లో గెలిస్తే.. కేసీఆర్ పాలన బాగుందని అనుకొని ప్రజల్ని పూర్తిగా మర్చిపోయే ప్రమాదం ఉందన్నఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు.. రైతుల మీద ఇంకా పెద్ద పెద్ద బండలు వేసే రోజులు వస్తాయన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు. అందుకే టీఆర్ఎస్ ను ఓడించాలని కోరిన ఆయన.. తన ప్రసంగాల్లో పలు ప్రశ్నల్ని సంధించారు.

జగన్ ప్రశ్నలు చూస్తే..

= ప్రభుత్వం ఏర్పాటు అయిన 18నెలల్లో ఒక్కటంటే ఒక్క కొత్త అంబులెన్స్ ఎందుకు కొనుగోలు చేయలేదు?

= గత ఏడాది కంటే ఇప్పుడు నిత్యవసరాల ధరలు ఎందుకు మండిపోతున్నాయి?

= వైఎస్ హయాంలో క్వింటాల్ పత్తి మద్దుతు ధర రూ.6700 ఉంటే.. ఇప్పుడు పత్తి మద్దతు ధర క్వింటాల్ కు రూ.3500 ఎందుకుంది?

= 18 నెలల కేసీఆర్ పాలనలో దళితులకు కేవలం 1600 ఎకరాలు మాత్రమే ఎందుకు పంచారు?

= గత ఏడాది పీజు రియింబర్స్ మెంట్ బకాయిలు ఇప్పటికీ ఎందుకు చెల్లించలేకపోయారు?

= కేసీఆర్ వచ్చిన 18 నెలల కాలంలో పాత అంబులెన్స్ లకు టైర్లు మార్చటానికి కూడా గత్యంతరం లేని పరిస్థితి ఎందుకు ఉంది?

= అంబులెన్స్ ల్లో పని చేసే వారి జీతాలు అడిగితే ఎందుకు పట్టించుకోవటం లేదు?

= 77 రోజులు సమ్మె చేస్తే కనీసం వారిని ఎందుకు పలుకరించలేదు?

= కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క వరంగల్ జిల్లాలోనే 150 మంది రైతులు చనిపోయారు. అంతమంది రైతులు ఎందుకు చనిపోయారు?