Begin typing your search above and press return to search.

కేసీఆర్ మీద జ‘‘గన్’’ అసలుసిసలు ఫైరింగ్

By:  Tupaki Desk   |   16 May 2016 9:51 AM GMT
కేసీఆర్ మీద జ‘‘గన్’’ అసలుసిసలు ఫైరింగ్
X
అవసరం మనిషిని పూర్తిగా మార్చేస్తుంది. ఈ మాట జగన్ కు పూర్తి సరిపోతుంది. లేకపోతే జగన్ లాంటి వ్యక్తి కేసీఆర్ మీద విరుచుకుపడటం ఏమిటి? తన పేరులో ఉన్న గన్ ఫైర్ చేస్తే ఎలా ఉంటుందో.. అదే రీతిలో తన మాటలతో కేసీఆర్ మీద ఆయన విరుచుకుపడిన తీరు చూస్తే షాకింగ్ గా అనిపించక మానదు.

విభజన నాటి నుంచి గడిచిన రెండేళ్ల కాలంలో ఎప్పుడూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద పల్లెత్తు మాట అనని ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి ఎవరూ ఊహించని వ్యాఖ్యలు తాజాగా రావాటం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్మిస్తున్న పాలమూరు ఎత్తిపోతల పథకానికి నిరసనగా ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ చేస్తున్న నిరసన దీక్ష కర్నూలులో షురూ అయిన సందర్భంగా జగన్ మాట్లాడుతూ నిప్పులు చెరిగారు.

రోహిణి కార్తెలో భగభగలాడుతున్న సూరీడు తీవ్రత సైతం.. జగన్ మాటల ధాటికి చిన్నబోయిందని చెప్పాలి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనాలకే సంచలనంగా ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించటం మామూలే అయినా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆయన నిప్పులు చెరిగినవైనం చూసినప్పుడు అనిపించేది ఒక్కటే.. ఇప్పటివరకూ కేసీఆర్ మీద ఈ స్థాయిలో విరుచుకుపడిన నేత ఎవరైనా ఉన్నారా అంటే.. అది వైఎస్ జగన్ ఒక్కరేనని చెప్పక తప్పదు. కేవలం నోటికి పనికి చెప్పినట్లు కాకుండా తన ఆగ్రహాం వెనుక ఎంత ఆవేదన ఉందన్న విషయాన్ని అంకెలతో సహా చెప్పటం గమనార్హం.

సాగునీటి ప్రాజెక్టుల మీద కేసీఆర్ కు మాత్రమే పట్టుందని ఫీలయ్యే చాలామందికి తన ప్రసంగం ద్వారా జగన్ కళ్లు తెరిపించటమే కాదు.. సాగునీటి ప్రాజెక్టుల మీద తనకున్న పట్టు ఎంతన్నది జగన్ చాటి చెప్పారని చెప్పొచ్చు. అంతేకాదు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఏపీకి ఎంత అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని వివరంగా చెప్పటమే కాదు..ఇదే రీతిలో పరిస్థితి కొనసాగితే.. రానున్న రోజుల్లో ఏపీప్రాంత ప్రజల భవిష్యత్తు ఎంత దారుణంగా ఉంటుందన్న విషయాన్ని వివరించే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తెలంగాణ ముఖ్యమంత్రి నోటి మాటలకు తాను భయపడేది లేదన్న విషయాన్ని తాజా ప్రసంగంతో జగన్ తేల్చేశారు. తాజాగా ఆయన వాడిన కొన్ని పదాలే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఏపీ తెలంగాణలు భారత్ పాక్ ల మాదిరి తయారుకావొద్దన్న మాట చాలా పెద్దదిగా చెప్పాలి. అంతేకాదు.. ఏపీ ప్రయోజనాల్ని దెబ్బ తీస్తూ కేసీఆర్ హిట్లర్ లా మాట్లాడుతున్నారని.. అలాంటి మాటలు సరి కావన్న ఆయన.. సాగునీటి ప్రాజెక్టులు ఇష్టరాజ్యంగా కట్టేసుకుంటూ పోతే.. బ్రహ్మంగారు చెప్పినట్లుగా నీటి కోసం యుద్ధాలు తప్పని చెప్పటం గమనార్హం. ఇదంతా ఒక ఎత్తు అయితే విభజన సందర్భంగా హైదరాబాద్ నగరాన్ని తెలంగాణకు ఇచ్చేశారన్నట్లుగా ఆయన తాజా వ్యాఖ్య ఉండటం విశేషం. ‘‘రాష్ట్రం విడిపోయాక తెలుగువారు అని చూడకుండా జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. హైదరాబాద్ నగరాన్ని అప్పుడు వాళ్లు పట్టుబట్టి తీసుకెళ్లిపోయారు.ఎక్కడైనా ముఖ్యమంత్రి ప్రజలకు మంచి చేయలని ఆలోచిస్తారు. కానీ.. కింది రాష్ట్రంలో తాగటానికి నీళ్లులేకపోతే అక్కడి ప్రజల ఉసురు తగలదా అని కేసీఆర్ను అడుగుతున్నా? మీరు చేస్తున్నది తప్పు. దాన్ని సరి చేసుకోవాలి’’ అంటూ మండిపడిన వైనం చూస్తే.. జగన్ ఏ రేంజ్ లో చెలరేగిపోయారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.