Begin typing your search above and press return to search.

ఎర్రన్నల మీద జగన్ నిప్పులు...?

By:  Tupaki Desk   |   8 Feb 2022 1:30 PM GMT
ఎర్రన్నల మీద జగన్ నిప్పులు...?
X
వామపక్షాలు మీద ఎవరూ పెద్దగా విమర్శలు చేయడానికి చూడరు. వామపక్షాలు తమకంటూ ఒక సిద్ధాంతాన్ని పెట్టుకుని ముందుకు సాగుతారు. ఇక వారు పేదల పక్షంగా ఉంటారు. వారికి బలమల్లా యూనియన్లే. ప్రజలు ఓట్లేయకపోయినా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలోని యూనియన్ పాలిటిల్స్ లో వారిదే పైచేయి. అందుకే వారికి అసలైన బలం అక్కడే ఉంటుంది.

ఇక ఉపాధ్యాయ సంఘాలలో కూడా వారికి బలం ఉంది. అక్కడ ఏపీటీఎఫ్ అయినా యూటీఎఫ్ అయినా వామపక్ష అనుబంధ సంఘాలే. ఇపుడు ఈ రెండు ఉపాధ్యాయ సంఘాలే సర్కార్ మీద నిరసస స్వరం వినిపిస్తున్నాయి. ఈ రెండే ఇపుడు రివర్స్ పీయార్సీ అంటున్నాయి. ప్రభుత్వంలో అమీ తుమీ తేల్చుకుంటామని చెబుతున్నాయి.

దాంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి జగన్ వామపక్షాల మీద హాట్ హాట్ కామెంట్స్ చేశారు. ఎర్ర జెండాలు పచ్చ అజెండాను మోస్తున్నాయని కూడా విమర్శించారు. పీయార్సీ సాధన కమిటీ సమావేశంలో ఉపాధ్యాయ యూనియన్లు అన్ని ఒప్పందాలను ఒప్పుకుని సంతకాలు చేసిన మీదట బయటకు వెళ్ళి ఆందోళలను చేయడమేంటి అని జగన్ నిలదీశారు.

అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే వద్దని కోర్టుకెళ్ళిన చంద్రబాబుకు మద్దతుగా వామపక్షాలు అమరావతి అజెండాను మోశాయని ఆయన నిందించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల సర్కార్ కి ఏటా మూడు వేల అయిదు వందల కోట్లు ఖర్చు అవుతోంది, మరి ఇది వామపక్షాలకు కనిపించడంలేదా అని ఆయన అన్నారు.

అవుట్ సోర్సింగ్ వారి కోసం కార్పోరేషన్ పెట్టి వారి జీతల కోసం దళారీలకు లంచం ఇవ్వకుండా నేరుగా పే మెంట్ అందే మంచి పని చేస్తే గుర్తించరా అని మండిపడ్డారు. కాంట్రాక్టు ఉద్యోగులతో సహా ఆశా వర్కర్లు, హోం గార్డులు, ఇతర ఉద్యోగులకు జీతాలు గత రెండున్నరేళ్ల కాలంలో పెంచామని, ఇది కూడా కనిపించడంలేదా అని జగన్ అన్నారు.

ఇక ఏపీలో స్వాతంత్రం వచ్చిన తరువాత నుంచి 2019 దాకా మూడు లక్షల తొంబై వేల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఉంటే తాము సచివాలయ ఉద్యోగులతో సహా అన్ని రకాల ఉద్యోగాలతో కలుపుకుని రెండున్నరేళ్ల కాలంలో లక్షా తొంబై వేల పై దాకా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని జగన్ చెప్పారు.

సాఫీగా పాలన సాగరాదని, ఏపీలో ఆందోళనలు, సమ్మెలు చేస్తేనే ఎల్లో మీడియాకు ఆనందమని, చంద్రబాబు సీఎం కాలేదని, ప్రస్తుత ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడమే వారి అజెండా అని జగన్ అన్నారు. ఇక పచ్చ అజెండాను అమలు చేయడానికి వామపక్షాల మద్దతు కలిగిన యూనియన్లు రంగంలోకి దిగి ఉపాధ్యాయులతో ఆందోళలను చేయిస్తున్నారని జగన్ ద్వజమెత్తారు.

గత రెండళ్ళుగా కరోనా పరిస్థితుల కారణంగా ఏపీలో విధ్యార్ధులకు పరీక్షలు లేవని, మూడవ ఏడాది కూడా పరీక్షలు లేకుండా చేయడానికేనా ఉపాధ్యాయులతో ఆందోళనలు చేయిస్తున్నారు అని జగన్ ప్రశ్నించారు.

ప్రజలకు ఎంతో చేశామని, తాము ఇంకా చేయాలనే చూస్తున్నామని, మరి కామ్రేడ్స్ మాత్రం చంద్రబాబు అజెండాను తలెత్తుకోవడమేంటని జగన్ అంటున్నారు. మొత్తానికి ఏపీలో వామపక్షాలు టీడీపీ అజెండాతో సాగుతున్నాయని జగన్ ఆరోపించడాన్ని వారు ఎలా తీసుకుంటారో చూడాలి మరి.