Begin typing your search above and press return to search.

జగన్ తొలి ప్రసంగం - సంతకం - వరం ఇదే

By:  Tupaki Desk   |   30 May 2019 8:15 AM GMT
జగన్ తొలి ప్రసంగం - సంతకం - వరం ఇదే
X
వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ ఆయన చేత ప్రమాణం చేయించారు. తెలంగాణసీఎం కేసీఆర్ - డీఎంకే అధినేత స్టాలిన్ లు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.

కాగా జగన్ తన ప్రమాణ స్వీకారం చేశాక ప్రసంగించారు. తన తొలి సంతకాన్ని వైఎస్ ఆర్ పెన్షన్ పథకంపైపెట్టారు. వృద్ధుల పెన్షన్ ను రూ..3వేల కు పెంచుతామని ప్రకటించారు. ఈ ఏడాది పెన్షన్ ను రూ.2250గా మొదలు పెడుతున్నామని.. పెన్షన్ ను ఏడాదికి ఏడాది పెంచుతూ రూ.3వేలకు పెంచుతామని జగన్ హామీ ఇచ్చారు. ఈ మేరకు పెన్షన్ పెంపుదల ఫైలుపై తొలి సంతకం చేశారు.

అనంతరం జగన్ మాట్లాడుతూ.. పాదయాత్రలో ప్రజల బాధలను ప్రత్యక్షంగా చూసినట్టు జగన్ గుర్తు చేసుకున్నారు. పాదయాత్రలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పెన్షన్ కేవలం 1000 రూపాయలు మాత్రమే ఉన్న విషయాన్ని గుర్తు చేసుకొని 3వేలకు పెంచుతానని హామీ ఇచ్చానన్నారు. ఈ హామీ మేరకే పెన్షన్ పెంచుతున్నానన్నారు. ఈ ఏడాది 2250తో మొదలు పెట్టి 3వేలకు ఐదేళ్లలో పెంచుతామన్నారు.

గత పాలకులు, ప్రభుత్వాల మాదిరిగా పేజీల కొద్దీ మేనిఫెస్టోను తయారు చేసి చెత్తబుట్టలో వేయనని.. మేనిఫెస్టోను కేవలం రెండు పేజీల్లోనే రూపొందించి దాన్ని భగవద్గీతగా - ఖురాన్ - బైబిల్ గా భావించి అమలు చేస్తానన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో అమలు చేసిన ప్రతీ విషయాన్ని అమలు చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. మాట ఇచ్చిన ప్రకారం నవరత్నాలను ఖచ్చితంగా అమలు చేస్తానని స్పష్టం చేశారు.

ఆరు నుంచి ఏడాదిలోపే రాష్ట్రంలో అవినీతి లేకుండా చేస్తానని పై నుంచి కింది స్థాయి వరకు అవినీతి రహిత పాలనను అందిస్తానన్నారు. ఈ మేరకు రాష్ట్రస్థాయిలోనే జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు జగన్ ప్రకటించారు. అంతేకాదు.. స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయంలోనే కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తానన్నారు. 24గంటలు దాన్ని తానే పర్యవేక్షిస్తానన్నారు. వారు ప్రజల ఫిర్యాదులపై నేరుగా చర్యలు తీసుకుంటారన్నారు. అవినీతి ఎక్కడ జరిగినా పనులన్నీ రద్దు చేస్తామని.. అవినీతి రహిత పాలనను ప్రజలకు అందిస్తానన్నారు.

ఎక్కువ మంది టెండర్ లో పాల్గొనేలా చేసి ప్రభుత్వ పనుల్లో రివర్స్ టెండర్ ప్రక్రియను అమలు చేసి అవినీతి లేకుండా ప్రభుత్వ కాంట్రాక్టులు అప్పగిస్తామని జగన్ ప్రజలకు హామీ ఇచ్చారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి జరిగిందో అందరికీ తెలుసన్నారు. గత పాలనలో ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందన్నారు. అవినీతికి దూరంగా వైసీపీ పాలన ఉంటుందన్నారు. రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను తగ్గిస్తామని.. సౌర - పవన విద్యుత్ కొనుగోళ్లలో టీడీపీ పెంచిన రేట్లను అవినీతిని జగన్ ప్రశ్నించారు.

త్వరలోనే హైకోర్టు చీఫ్ జస్టిస్ ను కలిసి జ్యూడిషియల్ కమిషన్ వేసి సిట్టింగ్ జడ్జిని దానికి చైర్మన్ గా పెట్టి ఆ కమిషన్ సూచనల మేరకే కాంట్రాక్టర్లకు టెండర్లను పిలుస్తామని జగన్ హామీ ఇచ్చారు.