Begin typing your search above and press return to search.

2019 ఎన్నిక‌ల కోసం కొత్త జ‌గ‌న్‌

By:  Tupaki Desk   |   6 July 2017 5:30 PM GMT
2019 ఎన్నిక‌ల కోసం కొత్త జ‌గ‌న్‌
X
2014 ఎన్నిక‌ల్లో చేతికందాల్సిన విజ‌యం చేజారింది. చంద్ర‌బాబు అనుభవం ముందు జ‌గ‌న్ జ‌నాద‌ర‌ణ కాస్త వెనుక‌బ‌డిపోయింది. అధికారం అందాక చంద్ర‌బాబు డామినేట్ చేయాల‌ని చూస్తున్నా జ‌గ‌న్ ప్రాభవం ఏమాత్రం త‌గ్గ‌లేదు. అయితే... జ‌గ‌న్ పై కొన్ని ముద్ర‌లు మాత్రం ప‌డిపోయాయి. మిగ‌తా నేత‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌ర‌ని.. ఎవ్వ‌రి మాటా విన‌ర‌ని.. అహంకారం ఎక్కువ‌ని, సార్ సార్ అన‌క‌పోతే ఎంత పెద్ద నేత‌నైనా ప‌క్క‌న‌పెట్టేస్తార‌ని... ఇలా ఎన్నో దుష్ప్ర‌చారాలు. నిజానిజాల‌తో సంబంధం లేకుండా జ‌గ‌న్ ప‌ట్ల కొంద‌రిలో ఇలాంటి భావ‌న ఏర్ప‌డేలా చేయ‌గ‌లిగారు ఆయ‌న వ్య‌తిరేకులు. అయితే... జ‌గ‌న్ ఆ బురద‌ను క‌డిగేసుకుంటున్నారు.. స్వ‌చ్ఛంగా క‌నిపిస్తూ 2019 ఎన్నిక‌ల కోసం ముత్యంలా మెరిసిపోతూ దూసుకెళ్తున్నారు.

జ‌గ‌న్ ఇప్పుడు ఎవ‌రు ఏం చెప్పినా అందులోని మంచిని గ్ర‌హిస్తున్నారు. వ్యూహాల్లో ప‌దునుంటే స్వీక‌రిస్తున్నారు. అనుభ‌వ‌మున్న నేత‌ల‌తో మాట్లాడుతున్నారు. త‌మ కుటుంబ‌మంటే ఎంతో ఇష్టం చూపించే ద‌ళిత వ‌ర్గాల కోసం ఏమైనా చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. జ‌గ‌న్ లో ఈ మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అది చూసి టీడీపీ, దాని అనుకూల మీడియా వ‌ర్గాలు భ‌య‌ప‌డుతున్నాయి.

మొన్న‌టికి మొన్న రాష్ట్రప‌తి అభ్య‌ర్థి రామ్ నాథ్ కోవింద్ వ‌స్తే ఆయ‌న‌కు పాదాభివంద‌నం చేశారు జ‌గ‌న్‌. దేశ అత్యున్న‌త ప‌ద‌విని అలంక‌రించ‌బోతున్న ఒక ద‌ళిత మేధావికి ఆయ‌న హృద‌య‌పూర్వ‌కంగా అందించిన ఆ గౌర‌వానికి వంక‌లు పెట్టాయి కొన్ని మీడియా సంస్థ‌లు. ద‌ళితుల ప‌ట్ల త‌న‌కున్న గౌర‌వం, వారి అభ్యున్న‌తి ప‌ట్ల త‌న‌కున్న చిత్త‌శుద్ధిని ఆయ‌న పాదాభివంద‌నం చాటింది.

అలాగే తాజాగా జ‌గ‌న్ పార్టీలోని సీనియ‌ర్ల‌తో స‌మావేశ‌మ‌వుతున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు - పరిశీలకులు - ముఖ్యనేతలతోనూ బుధవారం సమావేశమయ్యారు. ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్‌ కిషోర్ ను ఆయ‌న ఈ సమావేశానికి తెచ్చి ఆయ‌న‌తో మాట్లాడించారు. పార్టీ నేతలకు ఆయ‌న సూచ‌న‌లు చేరేలా చేశారు. నంద్యాల ఉప ఎన్నిక‌పైనా ప్ర‌శాంత్ కిశోర్ స‌ల‌హాలు అందిస్తున్నారు. జ‌గ‌న్ వ‌న్ మ్యాన్ షో చేస్తార‌న్న ప్ర‌చారానికి దీంతో తెర‌ప‌డుతోంది. దీంతో వైసీపీ నేత‌లు కూడా జ‌గ‌న్ ను చూసి సంతోషిస్తున్నారు. 2019 ఎన్నిక‌ల కోసం కొత్త జ‌గ‌న్ రెడీ అయ్యార‌ని సంబ‌ర‌ప‌డుతున్నారు. జ‌గ‌న్ గురించి అపోహ‌లున్న‌వారు కూడా ఇప్పుడు ఆయ‌న్ను అర్థం చేసుకోవ‌డం ఖాయ‌మంటున్నారు.