Begin typing your search above and press return to search.

వైఎస్ బాట‌లో ప‌య‌నించిన జ‌గ‌న్‌!

By:  Tupaki Desk   |   17 March 2019 8:48 AM GMT
వైఎస్ బాట‌లో ప‌య‌నించిన జ‌గ‌న్‌!
X
స‌రైన ప్ర‌ణాళిక‌.. వ్యూహం ఉండాలే కానీ క్లిష్ట‌మైన ప‌ని కాస్తా చాలా సింఫుల్ గా పూర్తి చేయొచ్చు. ఈ విష‌యాన్ని సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబుకు ఇప్ప‌టికి అర్థం కానిది. కానీ.. ఆ విష‌యంలో త‌న‌కున్న నేర్పును తాజాగా అంద‌రికి అర్థ‌మ‌య్యేలా చేశారు ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. మిగిలిన పార్టీల‌తో పోలిస్తే.. ఒక‌ట్రెండు రోజులు ఆల‌స్య‌మైతే అయ్యాయి కానీ.. నాన్చుడు లేకుండా.. వాయిదా ప‌ద్ద‌తికి పోకుండా ఒకేసారి అన్నిఅసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించి రికార్డు సృష్టించారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

ఏ రాజ‌కీయ పార్టీ సైతం త‌న అభ్య‌ర్థుల్ని ఒక్క‌సారిగా ప్ర‌క‌టించే సాహ‌సానికి పూనుకోదు. కొన్ని సీట్ల‌కు సంబంధించిన ఇబ్బందులు ఉండ‌టం.. బుజ్జ‌గింపులు జ‌ర‌పాల్సిన రావ‌టం లాంటి ఇబ్బందులు ఉంటాయి. కానీ.. అలాంటి వాటిని అధిగ‌మించి మ‌రీ ఒకేసారి అసెంబ్లీ ప‌రిధిలోని మొత్తం 175 స్థానాల‌కు సింగిల్ లిస్ట్ తో అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌.

అసెంబ్లీ అభ్య‌ర్థుల ఎంపిక విష‌యంలో జ‌గ‌న్ అనుస‌రించిన విధానం 2009లో త‌న తండ్రి.. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిని మ‌రోసారి గుర్తు చేశారు. 2009లో జ‌రిగిన ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని 294 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు 282 మంది అభ్య‌ర్థుల్ని ఒక‌టే జాబితాలో ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించారు. ఆయ‌న ఆపిన అభ్య‌ర్థులు సైతం హైద‌రాబాద్ పాత‌బ‌స్తీకి చెందిన సీట్లే ఎక్కువ ఉన్నాయి.

వాయిదాల ప‌ద్ధ‌తిలో కాకుండా ఒకేసారి అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించే విష‌యంలో త‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అనుస‌రించిన బాట‌లోనే తాజాగా జ‌గ‌న్ ఫాలో అయ్యారు. అసెంబ్లీ అభ్య‌ర్థుల విష‌యం ఇలా ఉంటే.. లోక్ స‌భ స్థానానికి సంబంధించి మొత్తం 25 స్థానాల‌కు ఇప్ప‌టికే 9 స్థానాల‌కు ఎంపీ అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌.. మిగిలిన 16 ఎంపీ స్థానాల‌కు ఈ రోజు సాయంత్రం అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు చెబుతున్నారు.

మొత్తం సీట్ల‌లో బీసీల‌కు 41 స్థానాల‌ను.. ముస్లిం సోద‌రుల‌కు 5 సీట్లు కేటాయించామ‌ని.. గ‌తం కంటే ఒక్క స్థానాన్ని ఎక్కువ కేటాయించిన‌ట్లు చెప్పారు. స‌ర్వేల‌ను ప్రాతిప‌దిక‌గా తీసుకొని కొంత‌మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు.. ఎంపీల‌కుసీట్లు కేటాయించ‌లేద‌న్నారు. చంద్ర‌బాబు మాదిరి కాపుల‌ను బీసీల జాబితాలో క‌లిపి చూపించ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఏమైనా.. ఒకే ద‌ఫా అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించ‌టం ద్వారా జ‌గ‌న్ సంచ‌ల‌నం సృష్టించ‌ట‌మే కాదు.. జ‌గ‌న్ కు.. చంద్ర‌బాబుకు మ‌ధ్య నిర్ణ‌యాలు తీసుకోవ‌టంలో ఉన్న వ్య‌త్యాసాన్ని తాజాగా చెప్ప‌క‌నే చెప్పేశార‌ని చెప్పాలి.