Begin typing your search above and press return to search.

జగన్ డేరింగ్..స్కూల్ ఫీజులపై రంగంలోకి కమిటీ

By:  Tupaki Desk   |   25 Jun 2019 1:38 PM GMT
జగన్ డేరింగ్..స్కూల్ ఫీజులపై రంగంలోకి కమిటీ
X
వైసీపీ అధినేత - ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెనకడుగు వేసేది లేదన్న రీతిగానే సాగుతున్నారు. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి ఇంకా నెల కూడా కాకుండానే ఇప్పటికే సంచలనాలకే సంచలనాలుగా నిలుస్తున్న నిర్ణయాలు తీసుకున్న జగన్... తాజాగా మరో డేరింగ్ స్టెప్ వేశారు. రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థల బాదుడు నుంచి జనానికి ఉపశమనం కల్పించే దిశగా కీలక నిర్ణయం తీసుకున్న జగన్.. రాష్ట్రంలోని ప్రైవేటు - ప్రభుత్వ విద్యాలయాల్లో అమలవుతున్న ఫీజుల వసూళ్లపై అధ్యయనం కోసం ఓ కమిటీని వేశారు. బెంగళూరులోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆప్ సైన్స్ (ఐఐఎస్సీ)కి చెందిన ప్రొఫెసర్ ఎన్. బాలకృష్ణన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కమిటీ.. త్వరలోనే ఫీజుల బాదుడుపై ప్రత్యేక దృష్టి సారించనుంది.

అమరావతి పరిధిలోని ప్రజా వేదికలో గడచిన రెండు రోజులుగా జరుగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో భాగంగా చాలా కీలక అంశాలను ప్రస్తావించిన జగన్... విద్యా వ్యవస్థలో చేపట్టాల్సిన సంస్కరణలపైనా కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన సంస్కరణలపై కాస్తంత లేటైనా.... త్వరితగతిన ప్రజలకు ఉపశమనం కల్పించే అవకాశం ఉన్న ఫీజు వసూళ్ల కేవలం ఆరు వారాల్లోనే ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లుగా సమాచారం. ఇప్పటికప్పుడు తక్షణమే ప్రజలకు ఉపశమనం కలిగించే రీతిగా ఏఏ అంశాల్లో సంస్కరణలు చేపట్టాలన్న అంశంపై ఆరు వారాల్లో నివేదిక ఇవ్వాలని, మొత్తం విద్యా వ్యవస్థలో చేపట్టాల్సిన సంస్కరణలపై నాలుగు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని సదరు కమిటీకి జగన్ క్లియర్ కట్ టైం బౌండ్ నిర్దేశించినట్లుగా సమాచారం.

ఇక ఈ కమిటీలో బాలకృష్ణన్ తో పాటు హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ దేశాయ్ - నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ మాజీ వీసీ జంధ్యాల బీజీ తిలక్ లు కీలక భూమిక పోషించనున్నారు. ఈ ముగ్గురితో పాటు మరో 9 మందితో మొత్తం 12 మందితో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా జగన్ సర్కారు ప్రకటించింది. ఈ కమిటీ తన తొలి నివేదికను ఇచ్చిన వెంటనే దానిని అమలు చేసే దిశగా జగన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నారు. ఈ నిర్ణయంతో పిల్లల విద్య కోసం అప్పులపాలు అవుతున్న తల్లిదండ్రులకు భారీ ఉపశమనం లభించనుందన్న వాదన వినిపిస్తోంది.