Begin typing your search above and press return to search.

ట్రబుల్స్ నుంచి ట్రబుల్స్ లోకి జగన్.. ?

By:  Tupaki Desk   |   27 Dec 2021 7:32 AM GMT
ట్రబుల్స్ నుంచి ట్రబుల్స్ లోకి జగన్.. ?
X
జగన్ ముఖ్యమంత్రి హోదాలో ముచ్చటగా మూడవ నూతన ఆంగ్ల దినోత్సవ వేడుకలను జరుపుకోబోతున్నారు. జగన్ 2019 ద్వితీయార్ధంలో సీఎం గా కుర్చీ ఎక్కారు. ముప్పయి నెలల పాలన తరువాత 2022లోకి అడుగు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి కుర్చీలో ఆయన సక్సెస్ ఫుల్ గా సగం పాలన పూర్తి చేశారని టెక్నికల్ గానే చెప్పాలి. ఎందుకంటే జగన్ దూకుడు ఆయన మార్క్ పాలన అంతా కూడా తొలి ఆరు నెలల పాటే సాగింది. ఆయన వినూత్న నిర్ణయాలు అన్నీ నాడు చూసిన వారు సూపర్ సీఎం అనేశారు.

జగన్ స్వయంగా చెప్పుకున్నట్లుగా ముప్పయ్యేళ్ల పాటు సీఎం కావడం ఖాయమని కూడా జోస్యం చెప్పారు. అయితే 2020లో తొలి మూడు నెలలు గడచిన తరువాతనే జగన్ రాజకీయ జాతకం మారింది. కరోనా మహమ్మారి వచ్చి మీద పడింది. అది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైరస్ అయినా ఏపీ లాంటి బలహీన ఆర్ధిక వ్యవస్థ కలిగిన స్టేట్ కి మూలిగే నక్క మీద తాటిపండులా వచ్చి పడింది. దానికి ముందు జగన్ తొలి ఆరు నెలల్లోనే సంక్షేమ క్యాలండర్ ని రెడీ చేసి పెట్టేశారు.

అలా వరస బెట్టి లబ్దిదారులకు పంచడాలు చేసుకుంటూ వెళ్లారు. ఆయన ఆలోచనల్లో ముందు సంక్షేమం తరువాత అభివృద్ధి అన్నది ఉంది. ఆ విధంగా ఆయన చేద్దురేమో కానీ అంత వీలు కరోనా ఇవ్వలేదు. అంతంతమాత్రంగా ఉన్న ఆర్ధిక పరిస్థితిని అది దెబ్బ కొట్టేసింది. ఇక రాబడి తగ్గి ఖర్చు పెరిగి అంతా తడిసి మోపెడు అయింది. ఇలా ఎలాగో 2020ని నెట్టుకు వచ్చారు. కానీ 2021లో మళ్లీ రెండవ విడత కరొనా వచ్చి అతలాకుతలం చేసింది.

మరో వైపు చూస్తే జగన్ సంక్షేమాన్ని ముందు పెట్టి అభివృద్ధి తరువాత అనుకోవడంలో తప్పు ఎంత అన్నది కూడా పూర్తిగా తెలిసింది 2021లోనే ఈ ఏడాది బిగ్ ట్రబుల్స్ మధ్యనే జగన్ సర్కార్ కి గడచింది అని చెప్పాలి. ఎటు చూసిన పేరుకుపోయిన అప్పులు.కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తమ బాకీల గురించి ఏపీ సర్కార్ ని అడగడం విశేషం. అలాగే కాంట్రాక్టర్లు తమకు రావాల్సిన డబ్బులు కోసం కోర్టుకు వెళ్లారు.

ఇక వైసీపీ సర్కార్ కి పూర్తి ఫేవర్ గా ఉన్న ఉద్యోగ వర్గాలు సైతం జగన్ సర్కార్ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగడం 2021లోనే సాగింది. మొత్తానికి ఖజానా ఖాళీ, ఎక్కడా అప్పులు పుట్టని పరిస్థితి. కోర్టు కేసుల్లో మొట్టికాయలు, మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకోవడం, పోలవరం లాంటి ప్రాజెక్ట్ ని 2021లో కంప్లీట్ చేస్తామని చెప్పినా చేయలేకపోవడం, ఈ రోజుకీ ఏపీకి రాజధాని ఫలానా అని చూపించలేకపోవడం, అభివృద్ధి అన్నది పక్కన పెట్టి అసలు రాష్ట్రం ఎటు వైపు పోతోంది అన్న చర్చ, భయం బెంగ ఏపీలోని వారికీ బయటవారికీ ఒకేసారి కలగడం, ఇవన్నీ కూడా 2021 అందించినవే అనుకోవాలి.

ఈ ఏడాది రాజకీయంగా చూసుకుంటే జగన్ కి కలసి వచ్చింది. ఆయన లోకల్ బాడీస్ ఎన్నికల్లో ఏకపక్ష విజయాలను సాధించారు. అదే టైమ్ లో తిరుపతి లోక్ సభ, బద్వేల్ ఉప ఎన్నికల్లో ఆయన పార్టీ మంచి మెజారిటీతో గెలిచింది. అయినా సరే ఆ విజయానందం మాత్రం ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాలనా వైఫల్యాలు ఒక్కోటిగా బయటపడిపోతున్నాయి. ఈ మొత్తం వ్యవహరాల‌లో ఒకటే ఊరట. అదేంటి అంటే ఏపీలో విపక్షాలు ఇంకా బలపడకపోవడం.

అయితే ఇవే ట్రబుల్స్ మరింత బిగ్ సౌండ్ చేస్తూ 2022లోనూ ఎదురుకానున్నాయి. వీటికి కొత్తవి కూడా జత కానున్నాయి. ఇక విపక్షాల మధ్య ఐక్యతకు 2021 సంకేతాలను అందిస్తే అవి మరింత దగ్గర కావడానికి 2022 బాటలు వేసేలాగానే ఉంది. మొత్తానికి జగన్ అధికార పయనం ట్రబుల్స్ నుంచి ట్రబుల్స్ అన్నట్లుగానే సాగుతోంది అని చెప్పాలి.