Begin typing your search above and press return to search.

అవినాష్ కు అదిరిపోయే ఛాన్సు ఇచ్చిన జగన్

By:  Tupaki Desk   |   2 March 2021 5:00 PM IST
అవినాష్ కు అదిరిపోయే ఛాన్సు ఇచ్చిన జగన్
X
అవకాశాలు అన్నిసార్లు రావు. అరుదుగా వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే.. మొత్తంగా మారిపోతుంది. తాజాగా ఏపీలో జరిగే మున్సిపల్.. కార్పొరేషన్ ఎన్నికలు పోటాపోటీగా జరగనున్నాయని చెప్పాలి. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీ గుర్తుతో జరుగుతున్న మొదటి ఎన్నికలుగా వీటిని చెప్పాలి. ఏపీలోని కీలక నగరాలైన విజయవాడ.. విశాఖ లాంటి వాటిల్లో అధికార పార్టీ తన జెండా ఎగరాలని కోరుకుంటోంది. ఇందుకోసం సీఎం జగన్ భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు.

అదే సమయంలో ఏపీ విపక్షాలు సైతం కార్పొరేషన్లను సొంతం చేసుకోవటం ద్వారా తమ ఉనికిని చాటుకోవాలని భావిస్తున్నాయి. దీంతో.. ఎన్నికలు నువ్వా నేనా? అన్నట్లు సాగే పరిస్థితి. ఇదిలా ఉంటే.. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల బాధ్యతను యువనేత దేవినేని అవినాష్ చేతికి సీఎం జగన్ అప్పజెప్పారు. ఈ కీలకమైన నగర కార్పొరేషన్ మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా విజయగర్వంతో ఎగరాన్న పార్టీ అధినేత ఆశల్ని నిజం చేస్తారా? అన్నది ప్రశ్న.

అరుదుగా లభించిన అవకాశాన్ని అవినాష్ సద్వినియోగం చేసుకుంటారా? ఒకవేళ సీఎం అంచనాలను చేరుకుంటే అవినాష్ భవిష్యత్తు ఉజ్జలంగా ఉంటుందని చెబుతున్నారు. యూత్ లో మాంచి ఫాలో యింగ్ ఉన్న అవినాష్.. సార్వత్రిక ఎన్నికల్లో గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి కొడాలి నాని చేతిలో ఓడారు. అనంతరం పార్టీలో చేరిన ఆయన.. ఇప్పుడు పార్టీ జెండాను బెజవాడ కార్పొరేషన్ భవనం మీద ఎగిరేలా చేసి తన సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇందుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

విజయవాడ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా పుణ్యశీలను దాదాపుగా ఖరారు చేసినట్లు చెబుతారు.టీడీపీ అధికారంలో ఉన్న వేళలో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేవలం ఐదుగురు మాత్రమే కార్పొరేటర్లు ఉండేవారు. అయినప్పటికీ పార్టీ విషయంలో కమిట్ మెంట్ తో వ్యవహరించి.. నాటి అధికారపక్షాన్ని ఎదుర్కొనేందుకు ఆమె విపరీతంగా శ్రమించే వారు. ఆమె సేవల్ని గుర్తు పెట్టుకున్న జగన్.. ఆమెకే అవకాశం ఇస్తారని చెబుతున్నారు. ఇక.. టీడీపీ అభ్యర్థిగా కేశినేని నాని కుమార్తె ను బరిలోకి దింపుతారని భావిస్తున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఏమైనా.. అవినాష్ కు అప్పజెప్పిన బాధ్యతను ఆయన ఏ మేరకు పూర్తి చేస్తారన్నది చూడాలి.