Begin typing your search above and press return to search.

మ‌రో ఎమ్మెల్యేకి కేబినెట్ హోదా క‌ల్పించిన జ‌గ‌న్ స‌ర్కార్!

By:  Tupaki Desk   |   13 July 2022 11:30 AM GMT
మ‌రో ఎమ్మెల్యేకి కేబినెట్ హోదా క‌ల్పించిన జ‌గ‌న్ స‌ర్కార్!
X
జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో ఇప్ప‌టికే కేబినెట్ హోదాతో చాలామంది నేత‌లు, స‌ల‌హాదారులు ఉన్నారు. వీరంద‌రికీ కేబినెట్ హోదాతో భారీ ఎత్తున వేత‌నాలు, ఇత‌ర సౌక‌ర్యాలు అందిస్తూ ప్ర‌జాధ‌నాన్ని దుర్వినియోగం చేస్తుంద‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. అయినా జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏమాత్రం త‌గ్గడం లేదు.

తాజాగా అన్న‌మ‌య్య జిల్లా (గ‌తంలో వైఎస్సార్ జిల్లా) రాయ‌చోటి నియోజ‌క‌వ‌ర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గ‌డికోట శ్రీకాంత్ రెడ్డికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం కేబినెట్ హోదా క‌ల్పించింది. ఏపీ శాస‌న‌స‌భ వ్య‌వ‌హారాల స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా ఆయ‌న‌ను కేబినెట్ హోదాలో నియ‌మించింది.

2019లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక గ‌డికోట శ్రీకాంత్ రెడ్డిని ప్ర‌భుత్వ చీఫ్ విప్ గా నియ‌మించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వ చీఫ్ విప్ కు కేబినెట్ మంత్రి హోదా ఉంటుంది. ఇటీవ‌ల రెండోసారి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేసిన‌ప్పుడు జ‌గ‌న్ ఆ ప‌ద‌వి నుంచి గ‌డిగోట‌ను త‌ప్పించారు. ప్ర‌భుత్వ చీఫ్ విప్ ప‌ద‌విని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్ర‌సాద‌రాజుకు క‌ట్ట‌బెట్టారు.

కాగా గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి 2009లో కాంగ్రెస్ త‌ర‌ఫున తొలిసారి రాయ‌చోటి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ త‌ర్వాత 2011లో వైఎస్ జ‌గ‌న్ వైఎస్సార్సీపీని స్థాపించ‌డంతో ఆయ‌న‌తో క‌లిసి అడుగులు వేశారు. 2012లో కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా శాస‌న‌స‌భ‌లో ఓటేయ‌డంతో అన‌ర్హ‌త‌కు గుర‌య్యారు.

త‌ర్వాత జ‌రిగిన ఉప ఎన్నిక‌లో వైఎస్సార్సీపీ త‌ర‌ఫున గెలుపొందారు. 2014, 2019ల్లో గెలుపొంది వ‌రుస‌గా ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచి నాలుగుసార్లు గెలిచిన నేత‌గా రికార్డు సృష్టించారు.

ప్ర‌తిప‌క్షాల‌పై సాధికారంగా విమ‌ర్శ‌లు చేస్తార‌ని.. విష‌య ప‌రిజ్ఞానంతో మాట్లాడ‌తార‌ని గ‌డికోట‌కు పేరుంది. అందులోనూ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ కు స‌న్నిహితుడు కావ‌డంతో ఆయ‌న‌ను శాస‌న‌స‌భ వ్య‌వ‌హారాల స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా నియ‌మిస్తూ ముఖ్య‌మంత్రి నిర్ణ‌యం తీసుకున్నారు.