Begin typing your search above and press return to search.

విలీన నిర్ణయంతో జగన్ హీరో..మోడీ మాత్రం జీరో

By:  Tupaki Desk   |   4 Sep 2019 5:15 AM GMT
విలీన నిర్ణయంతో జగన్ హీరో..మోడీ మాత్రం జీరో
X
రోజుల తేడాతో తీసుకున్న విలీనం మాట ఇద్దరు ముఖ్యనేతల ఇమేజ్ ను ఎంతలా మార్చిందన్నది చూస్తే ఆసక్తికరంగా ఉంటుందని చెప్పాలి. బ్యాంకుల విలీన నిర్ణయాన్ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తీసుకున్నట్లు కనిపించినా.. దాని వెనుక ఉన్నది ప్రధాని మోడీ అన్నది అందరికి తెలిసిందే.

దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని పన్నెండుకు పరిమితం చేస్తూ.. మొండి బకాయిల మోతెక్కిపోయిన బ్యాంకుల్ని.. బాగా పని చేస్తున్న బ్యాంకుల్ని విలీనం చేయటంపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. సరైన పని తీరును ప్రదర్శించని బ్యాంకుల్లో.. బాగా పని చేసే బ్యాంకుల్ని విలీనం చేయటం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇదంతా తన వైఫల్యాన్ని కవర్ చేసుకునేందుకే అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

ఇక.. విపక్షాలైతే మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. కార్పొరేట్ రంగానికి ఊడిగం చేసేందుకే బ్యాంకుల విలీన నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా మండిపడుతున్నాయి. మోడీ ప్రభుత్వ చర్యను స్టాక్ మార్కెట్ సైతం ప్రతికూలంగా రియాక్ట్ అయ్యింది. భారీగా పాయింట్లు కోల్పోయి.. షేర్ ధరలు పడిపోయాయి. విలీనం బలం కావాలే కానీ బలహీనంగా ఉండకూడదన్న ఆర్థికవేత్తల మాటలు మోడీ సర్కారుకు ఇబ్బందిగా మారుతున్నాయి. ఇలా.. బ్యాంకుల విలీనం మోడీ సర్కారు ఇమేజ్ ను డ్యామేజ్ చేసిందని చెప్పక తప్పదు.

దీనికి భిన్నంగా జగన్ చేసిన విలీన నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గడిచిన కొన్నేళ్లుగా ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు కుట్రలు జరుగుతున్నట్లుగా పలు ప్రభుత్వాల్లో విమర్శలు వినిపించేవి. అలాంటి వాటికి శాశ్వితంగా చెక్ చెబుతూ.. ఆర్టీసీని ఏపీ ప్రభుత్వంలో విలీనం చేయటం ద్వారా జగన్ సంచలనంగా మారారని చెప్పాలి. ఈ నిర్ణయంతో ఆర్టీసీ ఆర్థిక కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉందంటున్నారు.

అయితే.. ఆర్టీసీ ప్రభుత్వానికి గుదిబండగా మారకుండా ఉండేలా.. చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత జగన్ మీద ఉంది. విలీన నిర్ణయంతో సంస్థలో పని చేస్తున్న వేలాది ఉద్యోగులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఆర్టీసీలో ఉన్న బస్సుల స్థానే.. విద్యుత్ బస్సుల్ని దశల వారీగా ప్రవేశ పెడతామని చెబుతున్న జగన్ మాటలు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వటమే కాదు.. ఆర్టీసీ ఉద్యోగుల్లో కొత్త బలాన్ని ఇచ్చాయని చెప్పక తప్పదు. విలీనం మోడీని అంతలా డ్యామేజ్ చేస్తే..అదే విలీన నిర్ణయం జగన్ విషయంలో మాత్రం భిన్నమైన ఫలితాన్ని ఇవ్వటం గమనార్హం.