Begin typing your search above and press return to search.

కేంద్రానికి జగన్ బాసట: దేశం కోసం అండగా ఉంటామని ప్రకటన!

By:  Tupaki Desk   |   20 Jun 2020 6:30 AM GMT
కేంద్రానికి జగన్ బాసట: దేశం కోసం అండగా ఉంటామని ప్రకటన!
X
సరిహద్దులో భారత జవాన్లపై చైనా దాడి చేసిన ఈ సంక్షోభ సమయంలో కేంద్రం తీసుకునే ఎలాంటి వ్యూహాత్మక నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని కేంద్ర ప్రభుత్వానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్‌ బాసటగా నిలిచారు. శుక్రవారం నిర్వహించిన అఖిలపక్ష నాయకుల వీడియో కాన్ఫరెన్స్‌ లో వైఎస్సార్సీపీ అధినేతగా జగన్ పాల్గొన్నారు.

ఈ సంధర్భంగా 20మంది సైనికులు దుర్మరణం చెందడం పై జగన్‌ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. దీనికి ప్రతిగా తీసుకొనే నిర్ణయానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. నాయకులంతా భుజంభుజం కలిపి వారికి అండగా నిలవాలని సూచించారు. ప్రస్తుత అణ్వస్త్ర యుగంలో ప్రపంచం మారుతోందని‌, సైనికులతో మాత్రమే యుద్ధం చేయలేమని పేర్కొన్నారు. దౌత్యం, ఆర్థిక ఆంక్షలు, అంతర్జాతీయ ఒత్తిడి వంటి ఇతర రూపాలనూ అనుసరించాలని చెప్పారు. 2014 నుంచే అంతర్జాతీయంగా ప్రధాని మోదీ నాయకత్వంలో మనదేశ గౌరవం, ప్రతిష్ఠ ఇనుమడించిందని కొనియాడారు. ఇది నచ్చని కొన్ని శక్తులు జరుపుతున్న దాడులివని వివరించారు. 192 సభ్య దేశాలున్న ఐక్యరాజ్యసమితిలో దేశం 184మంది సభ్యుల మద్దతుతో భద్రతామండలిలో సభ్యదేశంగా మారడం.. మోదీ అసాధారణ నైపుణ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.

ప్రస్తుత పరీక్షా సమయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా, సీఎంగా మోదీ వెంట ఉంటానని జగన్ ప్రకటించారు. ఏపీ రాష్ట్రంలోని 5 కోట్ల మంది కూడా మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. దేశ భవిష్యత్తు భద్రంగా ఉండబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.