Begin typing your search above and press return to search.

దేశంలో ఏకైక నేత ఒక్క జగన్ మాత్రమేనా!

By:  Tupaki Desk   |   20 Jun 2019 4:30 PM GMT
దేశంలో ఏకైక నేత ఒక్క జగన్ మాత్రమేనా!
X
ఫిరాయింపు రాజకీయాలు.. ప్రజాస్వామ్యానికి పట్టిన చీడలాంటివి. వీటిని ప్రజలు తీవ్రంగా అసహ్యించుకుంటున్నారు. అందుకు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా ఒక నిదర్శనం. అరవై ఏడు మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు వేల పద్నాలుగులో నెగ్గితే వారిలో ఇరవై మూడు మందిని చంద్రబాబు నాయుడు కొనుక్కొన్నారు. అలా చేస్తే ఎమ్మెల్యేలను కొనేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుందని చంద్రబాబు నాయుడు అనుకున్నారు.

వారిలో నలుగురికి మంత్రి పదవులు సైతం ఇచ్చారు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు సాధించింది ఏమిటో అందరికీ తెలిసిందే. చంద్రబాబుకు చివరకు మిగిలింది అదే ఇరవై మూడు సంఖ్యలో ఎమ్మెల్యేలు - ముగ్గురు ఎంపీలు.

వారిని ఇప్పుడు బీజేపీ తనవైపుకు తిప్పుకోవడం ప్రారంభించినట్టుగా ఉంది. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీ ఫిరాయింపజేసుకుంది. తద్వారా ఫిరాయింపుల చట్టానికి నీళ్లు వదిలింది కమలం పార్టీ.

ఇక తెలంగాణలో జరగుతున్న ఫిరాయింపుల రచ్చనూ ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. ఈ రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా.. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఫిరాయింపు రాజకీయాలు కొనసాగుతూ ఉన్నాయి. తమిళనాడు - కర్ణాటక - పశ్చిమబెంగాల్ - గోవా.. ఇలా రాష్ట్రాలు ఏవైనా ఫిరాయింపులు మాత్రం కొనసాగుతూ ఉన్నాయి. అధికారంలో ఉన్న వాళ్లు కొనుగోలు చేయడం - ప్రతిపక్షం నుంచి ఎమ్మెల్యేలు - ఎంపీలు వెళ్లడం సాగుతూ ఉంది.

ఇప్పుడు తెలుగుదేశం రాజ్యసభ సభ్యులను బీజేపీ తనవైపుకు తిప్పుకుని.. భారత ఎగువ సభలో కూడా ఫిరాయింపులే రాజకీయం అనే పరిస్థితిని తీసుకొచ్చింది. కమలం పార్టీ కూడా రాజకీయ అనైతికతకు పాల్పడింది.

ఈ పరిస్థితులను గమనిస్తే.. దేశంలో ఫిరాయింపు రాజకీయాలు వద్దంటూ - పార్టీ మారితే చట్టబద్ధమైన పదవికి రాజీనామా చేయాల్సిందే అంటూ ఆ నియమాన్ని గట్టిగా అమలు చేస్తున్నది కేవలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే అని చెప్పవచ్చు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఫిరాయింపుల బాధితుడయ్యారు. అయినా తన వైపుకు వచ్చిన ఎమ్మెల్సీ చేత రాజీనామా చేయించి చేర్చుకున్నారు.

ఇప్పుడు కూడా తెలుగుదేశం నుంచి ఎంపీలు - ఎమ్మెల్యేలు వచ్చేందుకు రెడీ అన్నా.. ఫిరాయింపు రాజకీయాలకు నో చెబుతూ జగన్ మోహన్ రెడ్డి తను కట్టుబడిన విలువలను - ప్రజాస్వామ్య నిర్దేశించిన విలువలను పాటిస్తూ ఉన్నారు. దేశంలో అలాంటి విలువలను పాటిస్తున్న ఏకైక నేత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే అని చెప్పడానికి సందేహించనక్కర్లేదు.