Begin typing your search above and press return to search.

అంబులెన్స్ వచ్చిందా?.. జగన్ ఆగిపోతారంతే!

By:  Tupaki Desk   |   13 July 2019 10:23 PM GMT
అంబులెన్స్ వచ్చిందా?.. జగన్ ఆగిపోతారంతే!
X
నిజమే... తన తండ్రి - దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి నోట నుంచి పదే పదే వినిపించిన ఆ సౌండ్ విన్నారంటే... వైసీపీ అధినేత - ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాణువు మాదిరే నిలబడిపోతారు. ఎంత ముఖ్యమైన పని మీద వెళుతున్నా కూడా ఆ సౌండ్ విన్నంతనే జగన్ తన కాన్వాయ్ ను ఉన్నపళంగా నిలిపేసి ఆ సౌండ్ దూరమయ్యాకే మళ్లీ బయలుదేరతారు. నిజమా?... కళ్లెదురుగా కనిపిస్తుంటే నిజమని ఒప్పుకోకపోతే ఎలా? మొన్నటికి మొన్న హైదరాబాద్ లోని రాజ్ భవన్ వెళ్లిన జగన్... బయటకు వస్తుండగా ఆ సౌండ్ విని తన కాన్వాయ్ ని రోడ్డెక్కకుండానే నిలిపేశారు. ఆ సౌండ్ అలా దూరం అయిన తర్వాతే తిరిగి తన కాన్వాయ్ ని ముందుకు కదిలించారు.

అప్పుడే కాదండోయ్... తాజాగా శనివారం విజయవాడలోనూ జగన్ ఆ సౌండ్ విన్నంతనే తన కాన్వాయ్ ని రోడ్డుపై స్లో చేయించి... ఆ సౌండ్ కు దారిచ్చారు. జగన్ అంతగా ప్రాధాన్యం ఇస్తున్న ఆ సౌండ్ ఏమిటో ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా. అదే అంబులెన్స్ లు చేసే కుయ్యి... కుయ్యి మంటూ వినిపించే సౌండ్. వైఎస్ రాజశేఖరరెడ్డి బతికున్నప్పుడు తన హయాంలోనే రోడ్డెక్కిన 108 సర్వీసుల గురించి చెబుతూ కుయ్యి... కుయ్యి మనే సౌండ్ ను ఆయన చాలా హృద్యంగా వినిపించేవారు. అసెంబ్లీ వేదికగానూ వైఎస్ ఆ ధ్వనిని తన నోట పలికించేవారు. లక్షలాది మంది క్షతగాత్రుల ప్రాణాలను కాపాడిన 108 సర్వీసులకు శ్రీకారం చుట్టింది వైఎస్సే కదా. ప్రపంచ బ్యాంకు కూడా ప్రశంసలు కురిపించిన ఈ పథకాన్ని వైఎస్ తర్వాత పాలనా పగ్గాలు చేపట్టిన వారు కూడా నిలిపివేసే ధైర్యం చేయలేకపోయారు.

అలాంటి సర్వీసుల పట్ల జగన్ కు చాలా కన్ సర్న్ ఉందనే చెప్పాలి. అందుకే... తాను ఎంత ముఖ్యమైన పనిమీద వెళుతున్నా... అంబులెన్స్ సౌండ్ విన్నంతనే తన కాన్వాయ్ ని నిలిపేసి మరీ జగన్ అంబులెన్స్ లకు దారి ఇస్తున్నారు. ఇలాంటి మరో ఘటన శనివారం విజయవాడలో చోటుచేసుకుంది. తిరుమల వెంకన్న దర్శనార్థం వస్తున్న భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు స్వాగతం పలికేందుకు తిరుపతి వెళ్లేందుకు బయలుదేరిన జగన్... తాడేపల్లిలోని తన నివాసం నుంచి తన కాన్వాయ్ లో గన్నవరం ఎయిర్ పోర్టుకు వస్తున్నారు. ఈ క్రమంలో నగరంలోని బెంజ్ సర్కిల్ దాటిన తర్వాత తన కాన్వాయ్ వెనుక ఓ అంబులెన్స్ రావడాన్ని జగన్ గమనించారు. అంతే... తన కాన్వాయ్ ని దాదాపుగా నిలిపివేసిన జగన్... అంబులెన్స్ కు దారి ఇచ్చారు. ఆ అంబులెన్స్ తన కాన్వాయ్ ని దాటి వెళ్లిన తర్వాతే... జగన్ తిరిగి తన కాన్వాయ్ ని స్టార్ట్ చేయించారు.