Begin typing your search above and press return to search.

జగన్ పాదయాత్రకు బ్రేక్

By:  Tupaki Desk   |   10 Nov 2017 6:45 AM GMT
జగన్ పాదయాత్రకు బ్రేక్
X
వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు బ్రేక్ పడింది. నాలుగు రోజులపాటు సాగిన యాత్రకు తొలి ఆటంకం ఏర్పడింది. అయితే.. ఇది ముందే తెలిసిన ఆటంకం, ఈ ఆటంకాలను కూడా పరిగణలలోకి తీసుకునే షెడ్యూల్ ఖరారు చేయడంతో పాదయాత్రపై అనుకోని ప్రభావవమేమీ దీనివల్ల లేదు. ప్రతి శుక్రవారం జగన్ సీబీఐ కోర్టుకు హాజరుకావాల్సి ఉండడంతో ఈ విరామం వచ్చింది.

అక్రమాస్తుల కేసులో ఉన్న జగన్ విచారణ కోసం ఈ రోజు హైదరాబాదులోని సీబీఐ కోర్టు హాజరయ్యారు. కేసు విచారణలో భాగంగా ప్రతి శుక్రవారం జగన్ కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. పాదయాత్ర నేపథ్యంలో తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును ఇవ్వాలని జగన్ పెట్టుకున్న పిటిషన్ ను ఇంతకుముందే కోర్టు కొట్టివేసింది. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సిందేనని ఆదేశించింది. దీంతో పాదయాత్ర చేపట్టిన తరువాత తొలి శుక్రవారమైన ఈ రోజు మొదటి విరామం ఏర్పడింది.

కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని యర్రగుంట్ల వద్ద నిన్న సాయంత్రం జగన్ పాదయాత్ర ముగిసింది. అక్కడ నుంచి కోర్టు విచారణ కోసం రోడ్డు మార్గంలో హైదరాబాద్ బయల్దేరారు. తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో నగరంలోని లోటస్ పాండ్ లోని నివాసానికి ఆయన చేరుకున్నారు. కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత... 10.30 గంటలకు ఆయన కోర్టుకు చేరుకున్నారు. డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో, మధ్యాహ్నం తర్వాత కూడా ఆయన కోర్టులోనే ఉండనున్నారు. విచారణ అనంతరం ఆయన మళ్లీ రోడ్డు మార్గంలో యర్రగుంట్ల ప్రాంతానికి చేరుకుంటారు. రేపు పాదయాత్ర యథావిధిగా కొనసాగనుంది.