Begin typing your search above and press return to search.

ప్రజా బ్యాలెట్ తో బాబుపై జగన్ పోరు

By:  Tupaki Desk   |   5 July 2016 5:14 AM GMT
ప్రజా బ్యాలెట్ తో బాబుపై జగన్ పోరు
X
అవకాశం చిక్కినప్పుడు అస్సలు వదిలిపెట్టకూడదు. రాజకీయాల ప్రాధమిక లక్ష్మణమిది. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం.. సింగపూర్ కంపెనీల ఒప్పందాల్లో భాగంగా వస్తున్న ఆరోపణలు.. విమర్శలు.. వెల్లువెత్తుతున్న అభ్యంతరాల వేళ ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సర్కారుపై సరికొత్త సమరశంఖాన్ని పూరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 8 నుంచి గడప గడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని చేపట్టనున్న సంగతి తెలసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా బాబు సర్కారు తీరుపై పెద్ద ఎత్తున ప్రచారం చేయటం.. తమ వాదనకు బలం చేకూరేలా వినూత్న ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని జగన్ పార్టీ డిసైడ్ అయ్యింది.

ఇందులో భాగంగా బాబు సర్కారు ఎలా పని చేస్తుంది? ప్రభుత్వం మీదా.. చంద్రబాబు అండ్ కో మీద వస్తున్న విమర్శలు.. ఆరోపణలకు సంబంధించి 100 ప్రశ్నలతో రూపొందించిన ప్రజా బ్యాలెట్ ను తయారు చేశారు. గడపగడపకూ.. కార్యక్రమంలో ఈ బ్యాలెట్ ను ప్రతి ఇంటికి పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ బ్యాలెట్ లో ప్రతి ప్రశ్నకు అవును.. కాదు అని ఉంటాయని.. వాటికి సమాధానం ఇస్తే సరిపోతుందని చెబుతున్నారు.

ఈ వంద ప్రశ్నల ప్రజాబ్యాలెట్ ను నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లకు అందించనున్నారు. ఐదు నెలల వ్యవధిలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్లు జగన్ పార్టీ వెల్లడించింది. వినూత్నంగా నిర్వహించనున్న ఈ ప్రజాబ్యాలెట్ కు ప్రజా స్పందన ఏ తీరులో ఉంటుందో చూడాలి. కాకుంటే.. 100 ప్రశ్నలంటే బ్యాలెట్ భారీగా ఉండే వీలుంది. ప్రజలకు విసుగు కలగటం ఖాయం. సూటిగా ఉండే 10 ప్రశ్నల్ని వేసి.. అభిప్రాయాల్ని రాబడితే మరింత బాగుండేది. ఎంత బాబు మీద కోపం ఉంటే మాత్రం.. అదంతా ప్రజల మీద చూపిస్తున్నట్లుగా వంద ప్రశ్నలతో జనాల్ని ఉక్కిరిబిక్కిరి చేయటం జగన్ కు సబబుగా ఉంటుందా? అంత భారీ ప్రజాబ్యాలెట్ పత్రాన్ని ఇంటింటికి తిరిగి.. వాటిని పూర్తి చేసేంత ఓపికా.. తీరికా జగన్ పార్టీలో ఎంతమంది ఉన్నట్లు? అన్నది ఒక సందేహంగా మారింది. మరి ..ఈ భారీ ప్రజాబ్యాలెట్ తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకున్నది సాధించగలదా? అన్నది అసలుసిసలు ప్రశ్నగా చెప్పక తప్పదు.