Begin typing your search above and press return to search.

వ‌ర‌ద ప్రాంతాల‌కు ఇప్పుడా వెళ్లేది.. జ‌గ‌న్‌..!

By:  Tupaki Desk   |   1 Dec 2021 12:30 AM GMT
వ‌ర‌ద ప్రాంతాల‌కు ఇప్పుడా వెళ్లేది.. జ‌గ‌న్‌..!
X
స‌ర్వం మునిగిపోక ముందుకాదు.. అంతా అయిపోయిన త‌ర్వాత‌.. ప‌రామ‌ర్శిస్తా! అన్న‌ట్టుగా ఉంది ఏపీ సీఎం జ‌గ‌న్ ప‌రిస్థితి అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. ఆయ‌న‌తీసుకునే నిర్ణ‌యాలు.. చేతులు కాలిపోయిన త‌ర్వాత‌.. ఆకులు ప‌ట్టుకున్న చందంగానే ఉంటున్నాయ‌ట‌. రాష్ట్రంలో నాలుగు జిల్లాలు అత‌లాకుతలం అయితే.. వాటిని ప‌ట్టించుకోవ‌డం మానేసిన జ‌గ‌న్‌.. ఇప్పుడు తీరిగ్గా.. వ‌ర‌ద ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత‌.. ప‌రామ‌ర్శిస్తార‌ట‌. దీంతో ఈ విష‌యం.. స‌టైర్ల‌కు దారితీస్తోంది.

భారీ వర్షాలు, వరదలు ఏపీని అతలాకుతలం చేశాయి. కనీవిని ఎరుగని రీతిలో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్ప‌టికీ.. ప‌డుతున్నారుకూడా. ఇంకా చాలా ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి. ఎటుచూసినా వరద నీరే కనిపిస్తోంది. ఇదంతా కూడా .. ఏపీ సీఎం జ‌గ‌న్‌కు అత్యంత ఇష్ట‌మైన‌.. త‌న సొంత జిల్లా క‌డ‌ప‌.. పొరుగునే ఉన్న చిత్తూరు, నెల్లూరు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ కేవ‌లం ఒక్క‌సారే.. ఒకే ఒక్క‌సారే.. ఆయా ప్రాంతాల్లో ఏరియ‌ల్ స‌ర్వే చేశారు.

ఆ త‌ర్వాత‌.. ఆయ‌న అటు వైపు మొహం కూడా చూపించ‌లేదు. బాధితుల గోడు విన‌లేదు. అదేమంటే.. నేను వెళ్తే.. డిస్ట‌ర్బ్ అవుతుంద‌ని అన్నారు. అధికారులు అంద‌రూ.. త‌న‌వెంటే ఉండాల్సిన అవ‌స‌రం ఉంటుంద‌ని.. అందుకే తాను వెళ్ల‌లేద‌ని.. చెప్ప‌కొచ్చారు. దీంతో న‌లుదిక్కుల నుంచి విమ‌ర్శలు వ‌చ్చాయి. అయినా.. జ‌గ‌న్ లెక్క‌చేయ‌లేదు. ఇక‌, ఇప్పుడు అంతా స‌ర్దుకుంటున్న ప‌రిస్థితిలో.. అంతా అయిపోయిన ప‌రిస్థితిలో త‌గుదున‌మ్మా! అంటూ.. జ‌గ‌న్ వ‌ర‌ద ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

డిసెంబ‌రు 2న స్వయంగా తానే జనం దగ్గరకి వెళ్లనున్నారట‌. నేరుగా వరద బాధితులతో సీఎం జగన్‌ ముఖాముఖి నిర్వహించనున్నారట‌! ఇప్పటికే వరద ప్రభావిత జిల్లాల్లో పంట, ప్రాణ, ఆస్తి నష్టంపై వివరాలను జగన్‌ తెప్పించుకున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితిని పరిశీలించేందుకే జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్న జగన్ బాధితులను పరామర్శిస్తారు. ఇదే పర్యటనలో వరద నష్టంపై పరిహారం ప్రకటించే అకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.