Begin typing your search above and press return to search.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త!

By:  Tupaki Desk   |   17 Jun 2022 4:58 AM GMT
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త!
X
ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు వైఎస్ జగన్ ప్రభుత్వం శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించిన మేరకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ డిక్లరేషన్‌కు చర్యలు చేపట్టింది.

రెండేళ్లు సర్వీసు పూర్తి చేసుకుని, శాఖాపరమైన పరీక్షలు పాసైన సచివాలయాల ఉద్యోగులకు ప్రొబేషన్‌ డిక్లరేషన్‌కు సీఎం జగన్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫైలుపై ఆయన సంతకం చేశారు. గతంలో ప్రకటించిన మేరకు కొత్త పే స్కేల్‌ ప్రకారమే జీతాలు ఇవ్వాలని ముఖ్యమం‍త్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వ నిర్ణయంతో రెండేళ్లు సర్వీసు పూర్తి చేసుకుని, శాఖాపరమైన పరీక్షలు పాసైన సుమారు 1.20 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ చేసినా పాత స్కేల్‌ ప్రకారం వీరికి జీతాలు ఇవ్వాలని ఆర్థిక శాఖ చేసిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి జగన్ తిరస్కరించారు.

అర్హులైన ఉద్యోగులకు ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ చేసే అధికారాలను సంబంధిత జిల్లా అధికారులకు అప్పగించారు. ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ ఉత్తర్వులు ఒకటి రెండు రోజుల్లో జారీ అవుతాయి.

ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రకారం జూలై 1వ తేదీ నుంచి కొత్త పేస్కేలు వర్తిస్తుంది. పెరిగిన వేతనాలు ఆగస్టు నెల వేతనంతో ఉద్యోగులకు అందుతాయి. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రోబేషన్ డిక్లేర్ చేయడంతో పాటు కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్వాగతించింది. ఫెడరేషన్ తరపున సీఎం వైఎస్ జగన్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని సంస్థ చైర్మన్‌ కె.వెంకటరామిరెడ్డి తెలిపారు.

కాగా 16 వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మాత్రం జగన్ ప్రభుత్వం జెల్లకొట్టింది. వారు డిపార్టమెంట్ పరీక్ష కానందువల్ల వారు ప్రొబేషన్‌కు అర్హత పొందలేదని తెలిపింది. వారికి కూడా జూన్ లోనే ఏపీపీఎస్సీ ద్వారా డిపార్ట్‌మెంట్ పరీక్షలు నిర్వహిస్తామని చెబుతుంది.