Begin typing your search above and press return to search.

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల‌కు పండుగేనా.. నియోజ‌క‌వ‌ర్గానికి 18 కోట్ల చొప్పున నిధులు!

By:  Tupaki Desk   |   19 July 2022 4:31 AM GMT
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల‌కు పండుగేనా.. నియోజ‌క‌వ‌ర్గానికి 18 కోట్ల చొప్పున నిధులు!
X
గ‌డ‌ప గ‌డ‌ప మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మ స‌మీక్ష‌లో భాగంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గాల ఇన్చార్జులు, ప్రాంతీయ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు, జిల్లాల పార్టీ అధ్యక్షులతో నిర్వ‌హించిన స‌మావేశంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఎమ్మెల్యేల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. ఒక్కో స‌చివాల‌యానికి రూ.20 ల‌క్ష‌ల చొప్పున నిధులు ఇస్తామ‌న్నారు. ప్ర‌తి జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు, క‌లెక్ట‌ర్, ఎస్పీల‌తో రాష్ట్ర స్థాయిలో సీఎంవో అధికారుల‌తో వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేయాల‌ని కోరారు.

జిల్లా స‌మ‌స్య‌ల‌ను ఈ వాట్సాప్ గ్రూపులో పోస్టు చేయ‌డం ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు వాటిని ప‌రిష్క‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం జ‌గ‌న్ సూచించారు.

కాగా సీఎం జ‌గ‌న్ ప్ర‌తి స‌చివాల‌యానికి రూ.20 ల‌క్ష‌లు చొప్పున నిధులు ఇస్తామ‌ని ప్ర‌క‌టించ‌డంతో ఎమ్మెల్యేలంతా లెక్క‌లు వేసుకున్నార‌ని ప‌లు ప‌త్రిక‌లు వార్తా క‌థ‌నాలు ప్ర‌చురించాయి. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో దాదాపు 80 గ్రామ‌/ వార్డు స‌చివాల‌యాలు ఉన్నాయ‌.. ఇలా 80 స‌చివాల‌యాల‌కు రూ.16 కోట్ల చొప్పున వ‌స్తాయ‌ని ఎమ్మెల్యేలు లెక్కలు వేసుకుని ఆనంద‌ప‌డ్డార‌ని సమాచారం. అలాగే ప్ర‌తి ఎమ్మెల్యేకి నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి ఫండ్ కింద రూ.2 కోట్ల చొప్పున నిధులు ఇచ్చామ‌ని సీఎం జ‌గ‌న్ వెల్ల‌డించారు.

ఈ నేప‌థ్యంలో స‌చివాల‌యాల‌కు కేటాయించిన నిధుల‌తో క‌లిపి ఒక్కో నియోజ‌క‌వ‌ర్గానికి రూ.18 కోట్ల చొప్పున నిధులు అందుబాటులోకి వ‌చ్చాయ‌ని ఎమ్మెల్యేలు లెక్క‌లు వేసుకున్న‌ట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీలో మొత్తం 175కి 175 సీట్లు సాధించాల‌ని సీఎం జ‌గ‌న్ నేత‌ల‌కు ఉద్భోదించారు.

ప్రతి ఎమ్మెల్యే నెలలో 7 సచివాలయాలు సందర్శించాల‌ని ఆదేశించారు. ఎమ్మెల్యేలు ఇలా నెల‌లో 20 రోజులు గడపగడపకు మ‌న ప్ర‌భుత్వం కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చిన సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నామ‌న్నారు.

ఎమ్మెల్యేకు రూ.2 కోట్లు చొప్పున అభివృద్ధి నిధులతో పాటు ప్రతి సచివాలయానికి 20 లక్షల చొప్పున స్థానిక సమస్యల పరిష్కారానికి నిధులు ఇస్తామ‌ని తెలిపారు. ఈ నిధుల‌తో స్థానిక సమస్యలను పరిష్కరించడం ద్వారా ప్రజల ఆశీస్సులు తిరిగి పొందేలా ప్రయత్నాలు చేయాల‌ని సీఎం జ‌గ‌న్ సూచించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.