Begin typing your search above and press return to search.

జగన్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ప్రతిపక్ష పార్టీలకు ఇది షాకే!

By:  Tupaki Desk   |   3 Jan 2023 3:29 AM GMT
జగన్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ప్రతిపక్ష పార్టీలకు ఇది షాకే!
X
ఇటీవల నెల్లూరు జిల్లాలో కందుకూరు, తాజాగా గుంటూరులో జరిగిన తొక్కిసలాటల్లో 11 మంది మరణించడంతో జగన్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్‌ లో రహదారులపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధించింది. ఇకపై జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, మున్సిపల్‌ రహదారులు, పంచాయతీరాజ్‌ రహదారులపైన, మార్జిన్లలో సభలు, ర్యాలీలకు అనుమతించేది లేదని పేర్కొంది. అత్యంత అరుదైన సందర్భాల్లో జిల్లా ఎస్పీలు లేదా పోలీస్‌ కమిషనర్లు కచ్చితమైన షరతులతో సభలు, ర్యాలీలకు అనుమతి ఇవ్వొచ్చని మినహాయింపునిచ్చింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్‌ హోం శాఖ జనవరి 2 రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. 1861 పోలీస్‌ చట్టం ప్రకారం హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్‌ కుమార్‌ గుప్తా ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

కొద్ది రోజుల క్రితం నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగి 8 మంది మృతి చెందారు. అలాగే పలువురు గాయపడ్డారు. తాజాగా గుంటూరులో టీడీపీ సానుభూతిపరుడు ఉయ్యూరు శ్రీనివాస్‌ నిర్వహించిన చంద్రన్న కానుక పంపిణీలోనూ తొక్కిసలాట జరిగి ముగ్గురు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రజల ప్రాణాలను కాపాడటానికి తాము రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధించామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.

ఈ సభలు, ర్యాలీలు ప్రజలకు అసౌకర్యం కలిగిస్తుండటంతోపాటు, వాటి నిర్వహణలో లోటుపాట్లు, నిర్వాహకుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలను బలిగొంటున్న నేపథ్యంలో 30 పోలీస్‌ యాక్ట్‌ను అమలు చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని జగన్‌ ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం.

తాజా ఉత్తర్వుల్లో రాష్ట్రంలో జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్‌ రహదారులను ఇక నుంచి పూర్తిగా ప్రజల రాకపోకలు, సరుకు రవాణా కోసమే ఉపయోగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో సభల నిర్వ­హణకు ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంపిక చేయా­లని ప్రభుత్వం జిల్లాల ఉన్నతాధికారులకు సూచనలు జారీ చేసింది. రహదారులకు దూరంగా సాధారణ ప్రజ­లకు ఇబ్బంది కలగకుండా సరైన ప్రదేశాలను ఎంపిక చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. వివిధ పార్టీలు, ఇతర సంస్థలు సభలను ఎంపిక చేసిన ప్రదేశాల్లో నిర్వహించుకోవచ్చని సూచించింది.

ఇక అత్యంత అరుదైన సందర్బాల్లో జిల్లా ఎస్పీలు/ పోలీస్‌ కమిషనర్లు సంతృప్తి చెందితే షరతులతో సభలు, ర్యాలీలకు అనుమతినివ్వొచ్చని జగన్‌ ప్రభుత్వం పేర్కొంది. అందుకు నిర్వాహకులు ముందుగా లిఖితపూర్వకంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. అన్ని వివరాలను ఎస్పీలకు అందిస్తే వాటితో వారు సంతృప్తి చెందితే అనుమతి ఇస్తారని పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించింది.

కందుకూరు, గుంటూరుల్లో రహదారులను ఆక్రమించి వేదికల నిర్మాణం, ఇష్టానుసారం ఫ్లెక్సీలు, సౌండ్‌ సిస్టమ్స్‌ ఏర్పాటు, చివరి నిమిషాల్లో రూట్‌ మ్యాప్‌ల మార్పు, ఇరుకుగా బారికేడ్ల నిర్మాణం మొదలైన లోపాలతో ఈ దుర్ఘటనలు జరిగాయని అధికారులు నిర్ధారించారని తెలుస్తోంది. ఈ దుర్ఘటనలపై ఇప్పటికే విచారణ మొదలైంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం రహదారులపై బహిరంగ సభలు, ర్యాలీల నిర్వహణపై నిషేధం విధించింది.

మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. తమ సభలకు, ర్యాలీలకు పెద్ద ఎత్తున వస్తున్న జనాలను చూసి తట్టుకోలేకే ప్రజల ప్రాణాల పేరుతో ఈ ఉత్తర్వులు తెచ్చిందని మండిపడుతున్నారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. మరోవైపు ఆయన కుమారుడు నారా లోకేష్‌ జనవరి 27 నుంచి 4 వేల కిలోమీటర్ల పాదయాత్రకు సిద్ధమవుతున్నారు.

అదేవిధంగా సంక్రాంతి తర్వాత జనసేనాని పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రంలో బస్సు యాత్ర చేయనున్నారు. ఇప్పటికే లోకేష్‌ పాదయాత్రను అడ్డుకుంటామని వైసీపీ మంత్రులు ప్రకటించారు. అలాగే పవన్‌ కల్యాణ్‌ వాహనానికి అనుమతులు లేవని.. పవన్‌ యాత్రను అనుమతించబోమని ఇప్పటికే గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని వంటి మంత్రులు చెప్పారు.

వైసీపీ నేతల ముందస్తు ప్రకటనలను బట్టి చూస్తే ఉద్దేశపూర్వకంగానే రోడ్లపై సభలు, ర్యాలీలను ప్రభుత్వం నిషేధించిందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ప్రతిపక్ష నేతల సభలకు, ర్యాలీలకు వెల్లువలా ప్రజలు హాజరవుతుండటంతోనే తట్టుకోలేక సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ఉత్తర్వులు తెచ్చారని దుయ్యబడుతున్నారు. జగన్‌ ప్రభుత్వంపై నిర్ణయంపై ప్రతిపక్షాలు కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.