Begin typing your search above and press return to search.

ఎవరీ సంచైత.. ఏపీలో కీలక పదవినిచ్చిన జగన్ సర్కారు

By:  Tupaki Desk   |   5 March 2020 5:44 AM GMT
ఎవరీ సంచైత.. ఏపీలో కీలక పదవినిచ్చిన జగన్ సర్కారు
X
సంచైత గజపతిరాజు. ఉత్తరాంధ్ర ప్రజలకు ఆమె సుపరిచితమే కానీ.. మిగిలిన ఏపీలో ఆమె గురించి తెలిసినోళ్లు తక్కువే. తెలంగాణలో ఆమె ఎవరన్న విషయం తర్వాత.. ఆమె పేరు విన్నోళ్లు కూడా తక్కువే. అలాంటి ఆమె బీజేపీ నేతగా వ్యవహరిస్తున్నారు. ఆ మధ్య జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ బీజేపీ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

ప్రస్తుతం ఆమె బీజేపీ యువమోర్చా జాతీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరంటే.. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరావు ఉన్నారు కదా? ఆయన సోదరుడి కుమార్తె. దివంగత ఆనంద గజపతిరాజు.. సుధా గజపతిల రెండో కుమార్తె సంచిత గజపతిరాజు. ఢిల్లీలో ఉండే ఆమె.. బీజేపీలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఒక ఎన్జీవోను నిర్వహిస్తూ సేవా కార్యక్రమాల్ని చేపడుతున్నారు. విశాఖలో పలు కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఏపీ ప్రభుత్వం రాత్రికి రాత్రి రహస్య జీవోల్ని తీసుకురావటం ఆసక్తికర చర్చ జరుగుతుంటే.. ఆ రహస్య జీవోల్లోనే సంచైత గజపతి రాజును సింహాచల దేవస్థానం ఛైర్మన్ గా ఎంపిక చేసిన వైనం షాకింగ్ గా మారింది. ఈ పదవిలో ఇప్పటివరకూ కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు వ్యవహరించారు. ఆయన్ను తొలగించి.. సంచైతను ఎంపిక చేయటం ఇప్పుడు సంచలనమైంది. దీనికి తగ్గట్లే తనకు పదవిని కట్టబెడుతూ జీవో చేసినంతనే.. ఆగమేఘాల మీద ఢిల్లీ నుంచి వచ్చి పదవీబాధ్యతల్ని చేపట్టటం గమనార్హం.

గతంలో ఈ పదవిని అశోక్ గజపతిరాజు తండ్రి పీవీజీ రాజు చేపట్టి ఉండగా.. ఆయన మరణానంతరం పెద్ద కొడుకు అనంద గజపతి రాజు.. ఆ తర్వాత అశోక్ గజపతి రాజు చేపట్టారు. 2016నుంచి ఇదే పదవిలో అశోక్ గజపతి రాజు ఉన్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా.. రాత్రికి రాత్రి జారీ చేసిన జీవోలతో సంచైతకు కీలక పదవిని కట్టబెడుతూ జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆమెకు ఈ పదవిని అప్పజెటాన్ని బీజేపీకి చెందిన నేతలే తప్పు పడటం విశేషం. సింహాచలం దేవస్థానం పాలకమండలి ఛైర్ పర్సన్ గా సంచైతను ఎంపిక చేయటం నిబంధనలకు విరుద్ధమని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించటం ఆసక్తికరంగా మారింది. సంచైతా తమ పార్టీకి చెందిన వ్యక్తే అయినా.. నిజం చెప్పాల్సిన బాధ్యత తన మీద ఉందంటూ మాధవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త కలకలానికి తెర తీశాయని చెప్పాలి. ఈ ఆలయం పరిధిలో నాలుగు జిల్లాల్లో 12,716 ఎకరాలు ఉండటం ఒక ఎత్తు అయితే.. వీటి విలువ దగ్గర్లో దగ్గర లక్షన్నర కోట్ల మేర ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. ఈ భూముల విషయంలో కీలక నిర్ణయాన్ని తీసుకునేందుకు వీలుగా జగన్ సర్కారు వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకొని ఉంటుందన్న వాదన వినిపిస్తోంది.