Begin typing your search above and press return to search.

ఏపీ జీవోలన్ని సీక్రెట్.. పబ్లిక్ కు కనిపించని రీతిలో జగన్ సర్కారు నిర్ణయం

By:  Tupaki Desk   |   17 Aug 2021 7:30 AM GMT
ఏపీ జీవోలన్ని సీక్రెట్.. పబ్లిక్ కు కనిపించని రీతిలో జగన్ సర్కారు నిర్ణయం
X
ప్రజల చేత.. ప్రజల కొరకు.. ప్రజలకై ఎన్నుకునే ప్రజాప్రభుత్వాల్లో దాపరికం ఎంత తక్కువగా ఉంటే అంత మంచింది. ప్రజలే ప్రభువులైనప్పుడు .. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు పాలనా నిర్ణయాల్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమిటి? అన్నది ప్రశ్న. 2009 నుంచి ఆన్ లైన్ లో జీవోలను ఉంచటం.. చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు.. ప్రభుత్వం విడుదల చేసే జీవోల్ని డౌన్ లోడ్ చేసి.. చూసుకునే అవకాశం ఇకపై ఉండదు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జీవోలను ఇకపై ఆన్ లైన్ లో ఉంచకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. జగన్ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఉత్తర్వులు కనిపించవు.

ఇప్పటివరకు జీవోల జారీ విషయంలో అనుసరిస్తున్న విధానాల్ని మార్చాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. జీవో నంబర్లు జనరేట్ చేసే విధానాన్ని ఇకపై ఫాలో కావొద్దని.. అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు దీనికి అనుగుణంగా వ్యవహరించాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. వాస్తవానికి జగన్ సర్కారు ఆగస్టు ఒకటో తేదీ నుంచి బ్లాంక్ జీవోల్ని జారీ చేయటం మొదలు పెట్టింది. జీరో జీవో అంటే.. వెబ్ సైట్ లో జీవో నెంబరు ఇచ్చినా.. అందులో ఎలాంటి సమాచారం ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గడిచిన పదహారు రోజుల్లో 82 జీవోలు జారీ చేస్తే.. అందులో 49 జీవోలు బ్లాంక్ గా ఉంచటం విశేషం. మరో నాలుగు జీవోల్ని కాన్ఫిడెన్షియల్ గా ఉంచారు. రెండు న్యాయశాఖకు సంబంధించి మరొకటి అటవీశాఖలో ఖాళీల్ని పేర్కొంటూ జీవోల్ని జారీ చేశాయి.

ఇంతకాలం జీవో జారీలో ప్రమోషన్లు బదిలీలకు సంబంధించిన సమాచారం ఉండేది. వీటి ద్వారాసమాచారం లభించేది. తాజాగా కొందరు ఐపీఎస్.. ఐఏఎస్ అధికారులు బదిలీ చేశారు. ఇందుకు సంబంధించి జీవోనెంబరు 1334 జారీ చేశారు. అయితే.. ఈ జీవోను కూడా బ్లాంక్ గా ఉంచారు. బదిలీల సమాచారాన్ని రహస్యంగా ఉంచటం ద్వారా జరిగే ప్రయోజనం ఏమిటన్నది అసలు ప్రశ్న. అయినా.. ప్రజలకు అన్ని తెలిసేలా పారదర్శకంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వాలు అన్నింటిని గుట్టుగా.. తమకు మాత్రమే తెలిసేలా చర్యలు తీసుకోవటం ఎందుకు. అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ప్రజలందరికి అందుబాటులో ఉండేలా సాగిన జీవో జారీ విధానంలో ఒక్కసారి రహస్యంగా మార్చటానికి కారణం ఏమిటన్నది ఇప్పుడు చర్చగా మారింది. ప్రభుత్వ వర్గాల వాదన చూస్తే.. సర్కారు తీసుకునే నిర్ణయాలను ఏదో పాయింట్ పట్టుకొని న్యాయస్థానాల్ని ఆశ్రయించటం.. స్టేలు తీసుకురావటం ఎక్కువైందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. లిటిగెంట్లు అనే వారు ఎప్పుడూ ఉంటారు. అలాంటివారు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా చికాకులు పెడుతూనే ఉంటారు. అంతమాత్రానా అన్నింటిని రహస్యంగా ఉంచేస్తామనటంలో అర్థం లేదు. ప్రభుత్వ నిర్ణయాలు.. వివిధ ప్రాజెక్టులు.. పథకాలకు చేసే కేటాయింపులు.. మార్గదర్శకాలు.. విధివిధానాల్ని జీవోల రూపంలో జారీ చేసిన తర్వాతే తెలిసేది. ఇలాంటి వాటి ద్వారా అందుకున్న సమాచారంతో కోర్టుల్ని ఆశ్రయిస్తున్నారన్న మాటతో రహస్యంగా ఉంచేయటం సరికాదని చెప్పాలి. సమస్యలకు పరిష్కారం వెతకాలే కానీ.. సమస్యల్ని దాచి పెట్టేయాలన్నట్లుగా వ్యవహరించటం ప్రజాస్వామ్యానికే నష్టమన్నది మర్చిపోకూడదు.