Begin typing your search above and press return to search.

టార్గెట్ మార్గదర్శి.. ఏపీ సర్కారు విడుదల చేసిన ఉత్తర్వులో ఏముంది?

By:  Tupaki Desk   |   16 Nov 2022 4:30 AM GMT
టార్గెట్ మార్గదర్శి.. ఏపీ సర్కారు విడుదల చేసిన ఉత్తర్వులో ఏముంది?
X
ఈనాడు అధినేత రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్ ఫండ్ మీద ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నజర్ వేశారా? దాని ఆర్థిక మూలాలపై వచ్చే ఆరోపణలు.. విమర్శలకు చెక్ పెట్టి.. దాని సంగతి చూడాలన్న నిర్ణయానికి ఆయన వచ్చారా?మార్గదర్శి మూలాల్లోకి వెళ్లటం ద్వారా తనను తరచూ ఇరుకున పెట్టే మీడియా సంస్థకు ముచ్చమటలు పోయించాలని డిసైడ్ అయ్యారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే.. ఏకపక్షంగా రామోజీ మీద కత్తి దూసినట్లుగా కనిపించకుండా.. కాస్త జాగ్రత్తగా వ్యవహరాన్ని నడపిస్తున్నట్లుగా తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

కేవలం మార్గదర్శి చిట్ ఫండ్ విషయంలోనే కాకుండా.. రాష్ట్రంలోని చిట్ ఫండ్ సంస్థల తీరుపైన శోధన చేస్తున్నట్లుగా.. వారు చేసే తప్పులు.. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు చెక్ పెట్టాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉందన్న విషయాన్ని స్పష్టం చేసేలా తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత నెలలో ఏపీ వ్యాప్తంగా ఉన్న పలు చిట్ ఫండ్ సంస్థల్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. మంగళవారం మాత్రం ఏపీ వ్యాప్తంగా ఉన్న మార్గదర్శి కార్యాలయాల్లో సోదాల్ని నిర్వహించారు. 2019 నుంచి ఇప్పటివరకు ఉన్న ఖాతా పుస్తకాల్ని జాగ్రత్తగా పరిశీలించినట్లుగా చెబుతున్నారు.

ఈ సోదాల్ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, డిపార్ట్ మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్.. జీఎస్టీ అధికారులు పాలు పంచుకున్నారు. ముందుగా సిద్ధం చేసుకున్న చెక్ లిస్టు సాయంతో మార్గదర్శి లెక్కల్ని.. బ్యాలెన్స షీట్లను పరిశీలించినట్లుగా తెలుస్తోంది. మార్గదర్శి ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గతంలో కేసు వేయటం తెలిసిందే.

నిబందనలకు విరుద్ధంగా ప్రజల నుంచి నగదు డిపాజిట్లను సేకరించారన్న ప్రధాన ఆరోపణకు సంబంధించిన కేసు సుప్రీం విచారణలో ఉంది. తాజాగా ఈ వ్యవహారంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఇంప్లీడ్ కావాలని ఉండవల్లి కోరారు. అయినా.. తెలంగాణ ప్రభుత్వం ఇంప్లీడ్ కాలేదు. ఏపీ సర్కారు మాత్రం అయ్యింది.

దీనికి సంబంధించిన అధికార నిర్ణయాన్ని కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులకు మార్గదర్శకంగా ఏపీ ప్రభుత్వం నవంబరు రెండున ఉత్తర్వులు జారీ చేశారు.

చిట్ ఫండ్ చట్టం 1982 ప్రకారం గతంలో నిర్వహించిన తనిఖీల్లో లోపాలు.. ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించినట్లుగా పేర్కొని.. తాజాగా కొన్ని అంశాల మీద తక్షణం ఫోకస్ చేయాలని అందులో పేర్కొన్నారు. తాజాగా విడుదల చేసిన ఉత్తర్వులు మార్గదర్శిని టార్గెట్ చేయటానికి మాత్రమే అన్న మాట వినిపిస్తోంది. ఇంతకు ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులో ఏముంది? అందులోని కీలక అంశాలు ఏమిటి? అన్నది చూస్తే..
- చిట్‌ఫండ్‌ చట్టం-1982 కింద నమోదైన కంపెనీల చిట్‌ వసూళ్లు, నగదు లావాదేవీలపై నిఘా పెట్టాలి.
- చిట్‌ఫండేతర పనులకు నగదు బదలాయింపు చేస్తున్నారు కాబట్టి వాటిపై పూర్తి నిఘా పెట్టాలి.
- ఈ చట్టం కింద చిట్‌ఫండేతర కార్యకలాపాల నిర్వహణ, నగదు సమీకరణ, అప్పులివ్వడం, డిపాజిట్ల సేకరణ చేస్తున్నారా లేదా గుర్తించాలి.
- చిట్‌ఫండ్‌ కంపెనీ నగదును అదే కంపెనీలోని ఇతర గ్రూపులకు ఏమైనా మళ్లించిందా? అలాగే ఏమైనా ఖర్చుపెట్టిందా అనేది గుర్తించాలి.
- చట్టప్రకారం వ్యాపారానికి సంబంధించి అకౌంట్లు, రిజిస్టర్లు నిర్వహించడం లేదు. ఇది తీవ్రమైన ఉల్లంఘనగా భావించాలి.
- చిట్టీ పాడుకున్నవారికి వెంటనే నగదు చెల్లించడం లేదు. రశీదులు, బిల్లులు ఇవ్వడం లేదు. ఇంకా తప్పుడు వోచర్లు సృష్టిస్తున్నారు. బ్యాంకు ఖాతాల నిర్వహణ బాగోలేదు. నేరుగా నగదు చెల్లింపులు చేస్తున్నారు. ఇవి ఐటీ చట్టం ఉల్లంఘన కిందకు వస్తున్నాయి కాబట్టి ఈ కేసుల్లో తక్షణమే చర్యలు తీసుకోవాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.