Begin typing your search above and press return to search.

మరో కీలక నిర్ణయంతో మనసు దోచేసిన జగన్ సర్కార్

By:  Tupaki Desk   |   7 Nov 2020 6:15 AM GMT
మరో కీలక నిర్ణయంతో మనసు దోచేసిన జగన్ సర్కార్
X
సంక్షేమ పథకాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోటీ పడుతుంటారు. ఒకరికి మించి మరొకరు అన్నట్లుగా.. వినూత్నమైన పథకాల్ని తెర మీదకు తీసుకురావటమేకాదు.. వాటి అమలు విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే.. కరోనా నేపథ్యంలో ప్రజలు ఎంతగా ఇబ్బంది పడినా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోలేదన్న విమర్శ వినిపిస్తోంది.

దీనికి భిన్నంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరు ఉందన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది. కరోనా బారిన పడిన వారికి చికిత్స చేసేందుకు.. ఆరోగ్య శ్రీ పరిధిలోకి ఆ రోగాన్ని తీసుకురావటం తెలిసిందే. పేద.. మధ్యతరగతి వారికి ఈ నిర్ణయం ఎంతో సాయంగా నిలిచింది. ఇదిలా ఉంటే.. కరోనా తర్వాత కూడా పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో.. ఇలాంటి వారికి దన్నుగా నిలిచేందుకు ఏపీ సర్కారు కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఆరోగ్య సమస్యలు ఎదురైతే.. అలాంటి వారికి పోస్ట్ కోవిడ్ చికిత్సకు అనువుగా.. ఆరోగ్య శ్రీలో చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి కీలక ఉత్తర్వుల్ని శుక్రవారం ఏపీ సర్కారు జారీ చేసింది. అంతేకాదు.. పోస్టు కొవిడ్ చికిత్సకు రోజువారీగా ఎంత వసూలు చేయాలన్న విషయంపైనా సర్కారు స్పష్టత ఇచ్చేయటం గమనార్హం.

కరోనాసోకి రెండు వారాల తర్వాత కూడా అనారోగ్యంతోబాధ పడుతున్నరోగులకు రోజుకు రూ.2930 చొప్పున చెల్లింపులు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలోని అన్ని ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ఆసుపత్రుల్లో ఈ స్కీం తక్షణమే అమల్లోకి వస్తుందని సీఎం చెప్పినట్లు పార్టీ నేత ఆళ్ల నాని స్పష్టం చేస్తున్నారు. పోస్టు కోవిడ్ ట్రీట్ మెంట్ ను ఆరోగ్య శ్రీలో చేర్చటం ద్వారా.. పలువురికి దన్నుగా నిలుస్తుందని చెప్పాలి. ఈ తరహా నిర్ణయాలు తీసుకోవటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెనుకబడ్డారన్న మాట వినిపిస్తోంది.