Begin typing your search above and press return to search.

ఏపీ సర్కారు కొత్త టార్గెట్.. ఏపీలోని హోటళ్లకు నోటీసుల షాక్

By:  Tupaki Desk   |   19 March 2022 7:50 AM GMT
ఏపీ సర్కారు కొత్త టార్గెట్.. ఏపీలోని హోటళ్లకు నోటీసుల షాక్
X
నిమ్మళంగా నిమిషం కూడా ఉండటం కొంతమందికి అస్సలు ఇష్టం ఉండదు. వారున్న ప్రాంతాలన్ని గడబిడగా.. హడావుడిగా ఉంటాయి. ఏపీలోని జగన్ సర్కారును చూస్తే.. ఇదే గుర్తుకు రావటం ఖాయం. విపక్షం కారణంగా కొన్ని పరీక్షలు ఎదుర్కొంటున్న జగన్ సర్కార్.. కొన్ని వ్యవస్థలను తనకు తాను కెలికి తలనొప్పులు కొన్ని.. మరికొన్ని ప్రభుత్వ నిర్ణయాలతో ఎవరో ఒకరు ఇబ్బందులు ఎదుర్కోవటంతో పాటు.. నిత్యం ఏదో ఒక వివాదం లైవ్ లో ఉండటం కనిపిస్తుంటుంది.

కరోనా దెబ్బకు గడిచిన రెండేళ్లలో ఏపీలోని చాలా హోటళ్లు దారుణంగా దెబ్బ తిన్నాయి. ఒకవైపు వరుస లాక్ డౌన్ లతో మూసి ఉంచారు. దీంతో అద్దెలు.. కరెంటు బిల్లులతో పాటు.. సిబ్బంది జీతాలకు సైతం కటకటలాడే పరిస్థితి. లాక్ డౌన్ ముగిసి.. ఇప్పుడిప్పుడే పరిస్థితులన్ని చక్కబడుతున్న వేళలో జగన్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం హోటల్ నిర్వాహకుల నెత్తిన పిడుగు మాదిరి పడింది.

కరోనా కాలానికి సైతం ప్రాపర్టీ ట్యాక్స్.. ట్రేడ్ లైసెన్సు.. సకాలంలో వాటిని చెల్లించని దానికి పెనాల్టీలు కలిసి తడిచి మోపెడు అవుతున్న పరిస్థితి. దీంతో.. హోటల్ యజమానులు హాహాకారాలు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తమ మీద ఈ పన్ను భారాల పిడుగులు ఏమిటి? అని వాపోతున్నారు.

విజయవాడలోని యాభై గదులు ఉన్న హోటల్ ను కరోనా టైంలో చాలా రోజులు బంద్ అయితే.. లాక్ డౌన్ తర్వాత బుకింగ్ లు లేక వ్యాపారం జరగని పరిస్థితి. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్న వేళలో అధికారులు రంగంలోకి దిగి.. కరోనా కాలానికి సంబంధించిన పన్ను మోత మోగిస్తున్నారు.

దీనికి సంబంధించిన నోటీసులు ఇచ్చి.. వాటిని చెల్లించాలని కోరుతున్నారు. దీంతో హోటల్ యజమానులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారీ మొత్తాల్ని పన్నుల రూపంలో చెల్లించాలని ఇబ్బంది పెట్టటం ఎంతవరకు సబబు? అని ప్రశ్నిస్తున్నారు. యాభై గదులున్న బెజవాడ హోటల్ కు దగ్గర దగ్గర రూ.5 లక్షలు చెల్లించాలని కోరిన తీరుపై వ్యాపార వర్గాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

కరోనా కారణంగా వ్యాపారాలు దారుణంగా దెబ్బ తిని.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తమకు ప్రభుత్వాలు అండగా నిలవకపోయినా ఫర్లేదు కానీ.. ఇలా పన్నుల మోత మోగించి ఇరుకున పడేయటం సరికాదంటున్నారు. మరికొందరు జగన్ సర్కారు ఇప్పుడు హోటళ్లను టార్గెట్ చేసినట్లుగా మండిపడుతున్నారు. కోరి.. వివాదాల్ని నెత్తి మీద వేసుకోవటం అంటే ఇదేనన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.