Begin typing your search above and press return to search.

సుప్రీం తీర్పుతో డిఫెన్స్‌ లో పడ్డ జగన్ సర్కార్..ఇక ఆ పని చేయడమే మంచిదా!

By:  Tupaki Desk   |   25 Jan 2021 1:12 PM GMT
సుప్రీం తీర్పుతో డిఫెన్స్‌ లో పడ్డ జగన్ సర్కార్..ఇక ఆ పని చేయడమే మంచిదా!
X
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకి సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో , నిన్నటి వరకు ఎన్నికలు నిర్వహించేది లేదు అంటూ చెప్తున్నా వస్తున్నా జగన్ సర్కార్ ప్రస్తుతం ఆలోచనలో పడింది. సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించేందుకు ఇప్పటివరకు ఏ ఒక్క నేత ముందుకురాలేదు. ఇప్పటికే ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేఫథ్యంలో ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయబోతోంది అనేది ఇప్పుడు అందరిలో ఉత్కంఠత పెంచుతుంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని తెలిసి కూడా మొండిగా ఎస్‌ఈసీకి సహాయ నిరాకరణకు దిగిన ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో పూర్తిగా డిఫెన్స్‌ లో పడింది.

సుప్రీం తీర్పు తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై వైసీపీ కీలక నేతలతో సీఎం జగన్ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు ఎస్ ఈ సి మాత్రం చాలా వేగంగా పనులు ముగిస్తున్నారు. ప్రభుత్వంలో కీలక అధికారులతో పాటు నేతలతో చర్చించాక ఎన్నికలకు సహకరించే అంశంపై ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఎస్‌ ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ‌కు ప్రభుత్వం తప్పనిసరిగా సహకరించాల్సిన పరిస్దితి ఏర్పడింది. ఇప్పుడు నిమ్మగడ్డకు సహకరించకపోతే కోర్టు ధిక్కార చర్యలకు గురయ్యే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీంతో నిమ్మగడ్డకు సహకరించడమే మంచిదన్న ఆలోచనతో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది.

సుప్రీంకోర్టులో ఎన్నికలకు వ్యతిరేకంగా తాము దాఖలు చేసిన పిటిషన్‌, అందులో వాడిన భాషపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఉద్యోగులు కూడా ఆత్మరక్షణలో పడ్డారు. రెండు రోజుల క్రితం వరకూ సుప్రీంకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని చెబుతూ వచ్చిన ఉద్యోగులు.. ఆ తర్వాత టోన్ మార్చి సుప్రీం తీర్పు వ్యతిరేకంగా వస్తే మెరుపుసమ్మె చేపడతామని, ఎన్నికలకు సహకరించబోమన్న ఉద్యోగులు ఇప్పుడు షాక్‌ కు గురయ్యారు. ఇంకా ఎన్నికలకు సహకరించకపోతే సుప్రీం చర్యలకు గురవుతామన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది.